పేరుకే కమిషనరేట్‌!

Staff Shortage In Amravati Commissionerate - Sakshi

సిబ్బంది లేమితో సతమతం

నాలుగున్నరేళ్లుగా మాటలతో సరిపెట్టిన ప్రభుత్వం

నిత్యం ఇతర జిల్లాల పోలీసులతో నగరంలో విధులు

బెజవాడకు మరో 1,800 మంది సిబ్బంది అవసరమన్న సీపీ

ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ .. సర్కారు నుంచి స్పందన కరువు

పేరు గొప్ప.. ఊరు దిబ్బ..! సరిగ్గా ఇదే పరిస్థితిని రాజధాని బెజవాడ పోలీసు కమిషనరేట్‌ ఎదుర్కొంటోంది. పాలనా కేంద్రంగా మారినా అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అటు సీపీ నుంచి ఇటు హోంగార్డు దాకా షిప్టులను వదిలేసి పనివెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.

సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ సిబ్బంది లేమితో అల్లాడుతోంది. నలువైపుల నుంచి ఎదురవుతున్న పని ఒత్తిళ్లతో పోలీసు కమిషనర్‌ పాలనాంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. హైదరాబాద్‌ స్థాయిని మించి విజయవాడ పోలీసులను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో పోలీసింగ్‌ ప్రమాణాలపై ఎవరెంత ఊదరగొడుతున్నా వాస్తవంలోకి వస్తే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయనేది అందరూ అంగీరించాల్సిన విషయం.

పెను భారంగా మారిన సిబ్బంది కొరత..
కమిషనరేట్‌ పరిధిలో 5 జోన్లు ఉండగా.. మొత్తం 22 పోలీసు స్టేషన్లు, 4 ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. 1,200 మంది ఏఆర్‌ సిబ్బందితో కలుపుకొని సుమారు 3 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో విజయవాడ భాగమవడం.. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడే ఉండటంతో కమిషనరేట్‌ పరిధిలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. ప్రముఖుల బందోబస్తు పనులతో సిబ్బందికి తీరిక లేకుండా పోతోంది. ప్రధానంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వీఐపీల భద్రత కమిషనరేట్‌పై బాధ్యత చాలా ఎక్కువగా ఉంటోంది. ఇక సివిల్‌ పోలీసులకు సంబంధించి చూస్తే.. కొన్ని స్టేషన్లలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై పని భారం పడుతోంది.

మాటలతో సరిపెట్టిన సర్కారు..
ఎన్నో సవాళ్లు, సమస్యల మధ్య అదనపు డీజీపీ స్థాయిలోని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి విజయవాడ కమిషనరేట్‌ పగ్గాలు అప్పగించింది ప్రభుత్వం. 2015 మే నెల నుంచి సీఆర్‌డీఏ (రాజధాని) పోలీసు కమిషనరేట్‌ ఆవిర్భవిస్తుందని అందరూ అనుకున్నారు. కృష్ణా, గుంటూరు, విజయవాడలతో కలిపి 8,603.32 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, సుమారు వంద పోలీసు స్టేషన్లతో రాజధాని కమిషనరేట్‌ను విస్తరిస్తారన్న ప్రకటన నాలుగున్నరేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటిదాకా విజయవాడ కమిషనరేట్‌ పరిధి అనూహ్యంగా విస్తరిస్తుంది. అదేస్థాయిలో శాంతిభద్రతలు, పరిపాలన సమన్వయం సీపీకి పెను సవాలుగా మారింది. రాజధానికి తగిన స్థాయిలో పోలీసు దళాలను సిద్ధం చేయడం, పరిపాలనను సమన్వయం చేయడం కత్తిమీద సాముగా మారింది.

మరో 1,800 మంది సిబ్బంది అవసరం..
బెజవాడ పోలీసు కమిషనరేట్‌లో కలవరపరిచే నేరాలు, మరోవైపు కళ్లు తిరిగే ట్రాఫిక్‌ రద్దీ పోలీసు బాస్‌కు పెను సవాలుగా మారింది.  అమరావతి రాజధాని ప్రకటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన విజయవాడలో జనాభా పెరిగింది. ముఖ్యమంత్రి, కేబినెట్, ఐఏఎస్‌ గణం బెజవాడలో మకాం వేసింది. జాతీయ, అంతర్జాతీయ గోష్ఠులు, ప్రముఖులు రాకపోకలతో నిత్యం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రోజూ 1,100 మంది పోలీసులు రాజధాని ప్రాంతంలో పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్‌ విజయవాడ కానుండటంతో విజయవాడ కమిషనరేట్‌ స్థాయిలో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని నగర సీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మరో 1,800 మంది పోలీసు సిబ్బందిని నియమించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top