భద్రత మధ్య కోర్టుకు శ్రీనివాసరావు

Srinivasa Rao14days Remand In Murder Attempt On YS Jagan Case - Sakshi

మరో 14 రోజులు రిమాండ్‌

విధించిన న్యాయమూర్తి

ఆరిలోవ (విశాఖ తూర్పు): వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌రావును  కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తరలించారు.  శుక్రవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీసులు బందోబస్తుగా వచ్చి జైలు నుంచి శ్రీనివాసరావును కోర్టుకు తీసుకెళ్లారు.  కోర్టు వద్ద ప్రత్యేక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కోర్టులో న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించడంతో తిరిగి జైలుకు తరలించారు. హత్యాయత్నానికి పాల్ప డిన అనంతరం శ్రీనివాసరావుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో గత నెల 26న రాత్రి ఎయిర్‌పోర్టు పోలీసులు జైలుకు తరలించారు. అప్పట్లో విధించిన రిమాండ్‌లో 6 రోజులపాటు సిట్‌ కస్టడీలో ఉండగా మిగిలిన 9 రోజులు జైలులో గడిపాడు. అనంతరం ఈ నెల 9 నుంచి 23 వరకు 14 రోజులు పాటు రిమాండ్‌లో గడిపాడు. ఇంతవరకు శ్రీనివాసరావు 23 రోజులు జైలులో రిమాండ్‌లో గడిపాడు. 

కోర్టులపై నమ్మకం ఉంది
విశాఖ లీగల్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించిన తీరు వల్లే సిట్‌ విచారణపై నమ్మకం లేదని చెప్పామని ఆ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ అన్నారు. జగన్‌ తరపున న్యాయవాదితో కలిసి శుక్రవారం కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టులపై తమపార్టీ అధినేతకు, తమకు అచంచలమైన గౌరవం, విశ్వాసం ఉన్నాయన్నారు. అందువల్లే కోర్టు ఆదేశాల మేరకే షర్ట్‌ను కోర్టులో సమర్పించామని, అయితే హైకోర్టులో విచారణ ఉన్నందున 27వ తేదీ వరకు షర్ట్‌ ఇవ్వొద్దని జగన్‌ తరపున న్యాయవాది కోరగా.. పరిశీలిస్తామని మేజిస్ట్రేట్‌ చెప్పారన్నారు. ఈ కేసులో దాగి ఉన్న కుట్ర కోణం సిట్‌ విచారణలో బయటపడే అవకాశాలు లేవని మళ్ల విజయప్రసాద్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top