జనం గుండె చప్పుళ్లలో రాజన్న జ్ఞాపకం

special story on ys rajasekhara reddy 70th birth anniversary - Sakshi

పెద్దాయన పుట్టినరోజు.. ప్రతి పేదోడికి పండుగ రోజు

పల్లె వాకిట సంబరాలు.. ప్రతి ఇంటా ఆనందోత్సాహాలు

ఉపాధి కూలీల్లో ఉప్పొంగిన అభిమానం

బతుకు మెట్లెక్కించిన వైఎస్‌కు యువత జోహార్లు

రంజాన్‌ సంబరాలే అంటున్న ముస్లిం మైనార్టీలు

ఆశలు మొలకెత్తాయంటున్న రైతన్న ఊరువాడా ప్రాణదాత పక్షమే

ఆరోగ్యశ్రీ ఊపిరిలో ప్రతిధ్వనిస్తున్న వైఎస్‌

రాజధాని నుంచి పల్లెదాకా ఉప్పొంగిన ఆత్మీయత

ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు.. ‘వైఎస్సార్‌’. పల్లె తలుపు తట్టినా.. పేదవాడి ముంగిటకెళ్లినా.. వైఎస్సార్‌ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో, బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లయిన నిరుపేదల ఫీజురీయింబర్స్‌మెంట్‌ అనుభవాల్లో పెద్దాయనే కనిపిస్తారు. ఏ ఊరికెళ్లినా రాజన్న మాటలే. ఏ వాడకెళ్లినా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీపిగుర్తులే. జనం గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహనీయుడి పుట్టిన రోజును ప్రజలు గొప్ప పండుగనే అంటున్నారు. ఎంత చేస్తే ఓ వ్యక్తిని ఇంతగా ఆరాధిస్తారు? ఏం చేసి ఆయన జనం గుండెల్లో దేవుడై నిలిచాడు? పెద్దాయన పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్న ప్రజల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లినప్పుడు మాటలకందని అభిమానం కనిపించింది. అక్షరాలకే అంతుచిక్కని ఆత్మీయత ప్రస్ఫుటమైంది.
– ప్రజాక్షేత్రం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు

ఆయన పుట్టిన రోజున విత్తనం నాటడం అలవాటు
గుడివాడలో విత్తనాల కోసం వచ్చిన రైతులు శ్రీనివాసరావు, యాగ భార్గవ్, చందం గురవయ్య.. షాపు యజమానితో చెప్పే మాటల్లో వైఎస్‌ ప్రస్తావన విని అటువైపు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ‘నకిలీ విత్తనాలు అమ్మితే వైఎస్‌ తాట తీసేవారు.


తూర్పుగోదావరి జిల్లా రాజోలులో వైఎస్సార్‌ పుట్టిన రోజు నిర్వహిస్తున్న మహిళలు

పెద్ద పెద్ద విత్తన కంపెనీలతోనూ ఢీ అని పోరాడి రైతుల పక్షాన నిలబడ్డారు. ఇప్పుడు ఆయన కొడుకే సీఎం. గుర్తుపెట్టుకోండి.. మీరిచ్చే విత్తనంలో తేడా వస్తే రియాక్షన్‌ మరోలా ఉంటుంది’ రైతు శ్రీనివాస్‌ ధైర్యంతో ఇచ్చిన వార్నింగ్‌ ఇది. ‘అవునయ్యా వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే మాకు అభిమానం. మాకు ఆయన పుట్టిన రోజు నాడే విత్తనం నాటడం అలవాటు. ఇంతకాలం నకిలీ విత్తనాలు వచ్చినా అడగలేకపోయాం. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలన నడుస్తోంది. అదే మా« ధైర్యం’ అన్నాడు చందం గురవయ్య. రైతుకు వైఎస్‌ చేసిన మేలు గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పారు.. ఆ రైతులు.

పేదల గుండెల్లో... పెద్దాయన పటం
‘ఆ మహానుభావుడి పుట్టిన రోజు.. కాలనీ మొత్తం రావాల్సిందే.. పండుగయ్యేక పులిహోర పంచుదాం’.. భీమవరం ఇందిరమ్మ కాలనీ రేషన్‌ షాపు దగ్గర నిలబడి చర్చించుకుంటున్న మహిళలతో సుశీల అన్న మాటలివి. ‘వాళ్లకు పూట గడవడమే కష్టంగా ఉంది. అయినా వైఎస్సార్‌ పుట్టిన రోజు ఘనంగా చేయాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూడండి సార్‌’.. ఆ కాలనీకి చెందిన బీటెక్‌ విద్యార్థి రామశేషు అన్నాడు. అంత అభిమానం ఏంటని అడిగితే.. ఆ కాలనీ వైఎస్సార్‌ హయాంలోనే ఏర్పాటు చేశారట. అప్పటివరకూ కూలిపోయిన ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లట. చావు బతుకులతో సంసారం చేసేవాళ్లంట. వారి గోడు విన్న వైఎస్‌ వాళ్ల కోసం భూమి కొని మరీ ఇళ్లు కట్టించారట.

‘కాలనీకొచ్చి చూడండయ్యా.. మా ఇంట్లో దేవుడి పక్కనే వైఎస్‌ ఫొటో ఉంటుంది’.. అంది ఈశ్వరమ్మ. ఆయన కన్నుమూశాక వాళ్లకొచ్చిన కష్టాలేంటో చెçప్పుకొచ్చారు. ఆయన కట్టించారని టీడీపీ వాళ్లు కక్షగట్టారని చెప్పారు. డ్రైయిన్లు లేవయ్యా అంది షేక్‌ అబిదాబీ. కట్టుకున్న ఇళ్లకు లోన్లు క్లియర్‌ చేయలేదని వెంకటలక్ష్మి బావురుమంది. భర్త చనిపోయినా పింఛన్‌ ఇవ్వట్లేదని చెప్పిన సుశీల.. ‘ఆయన కొడుకొచ్చాడుగా వస్తాయిలే బాబూ’ అంటూ ధీమా వ్యక్తం చేసింది. మంచంలో కదలలేని స్థితిలో ఉన్న బళ్ల గురువులు దగ్గరకు తీసుకెళ్లారు ఆ కాలనీ వాసులు. ఆయన భార్య కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ స్థితిలోనూ వాళ్లు వైఎస్సార్‌ గురించి చెప్పుకొచ్చారు. ‘కూడు.. గూడు ఇచ్చిన దేవుడయ్యా’ అని చేతులెత్తి మొక్కారు.

పిలిస్తే పలికే దేవుడాయన
‘వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు నేను నందివాడ సర్పంచ్‌గా పనిచేశాను. ప్రజాపథం కార్యక్రమానికి సీఎం హోదాలో ఆయన మా ఊరొచ్చారు. మహిళనైన నన్ను ఎంతగానో గౌరవించారు. సీసీ రోడ్లు లేవని ఆయన దృష్టికి తెస్తే అప్పటికప్పుడు రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఊరికి 115 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. పేదవాడికి ఆపదొచ్చిందంటే ఏ పార్టీ అని కూడా చూడని మంచి నేత ఆయన. అందుకే ఈ ఊరంతా ఆయనంటే అభిమానిస్తారు. వైఎస్‌ జయంతిని ఊరంతా పండుగలా చేసుకుంటాం’ అని కృష్ణా జిల్లా నందివాడకు చెందిన పెయ్యల రాణి ఆనందంతో చెప్పారు. తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డానంటే అది వైఎస్సార్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ భిక్షేనని మండవల్లి మండలం లింగాలకు చెందిన ఉప్పల కిరణ్‌ తెలిపారు. 

‘నేను ఆయనతో కలిసి గుల్బర్గాలో ఎంబీబీఎస్‌ చదివాను. అప్పుడే ఆయన గొప్ప లీడర్‌గా ఉండేవారు. సీఎం అయ్యాక కూడా నన్ను మరిచిపోలేదు. గుండెలోతుల్లోంచి మిత్రుడికి వినిపించేలా హ్యాపీ బర్త్‌డే చెప్పాలనుంది’ అని పాలకొల్లులో డాక్టర్‌ పెన్మత్స శివాజీరాజు చెప్పారు. ‘తలలో రక్తం గడ్డకట్టి చావు బతుకుల మధ్య ఉన్న నన్ను ఆరోగ్యశ్రీ ఆదుకుంది. అప్పటి నుంచి కష్టం తెలియకుండా బతికాను. రోజూ ఆయనకు ప్రార్థన చేశాకే మరే పనైనా’ అని రాజోలు మండలం శివకోడుకు చెందిన వీరవాణి పేర్కొంది. ‘నేను కొబ్బరి కాయల వ్యాపారం చేస్తాను. మాకు వైఎస్సార్‌ ఇల్లు కట్టించారు. అందుకే రోజూ వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఓ కొబ్బరికాయను ఆయన కోసం తీయడం ఆనవాయితీగా మారింది’ అని శివకోడుకు చెందిన సత్యవతి చెప్పింది.

అందరి గుండెల్లో గుడి..
ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన సాక్షి బృందానికి దారిపొడవునా ఎంతో మంది వైఎస్సార్‌ అభిమానులు కలిశారు. ‘ముసల్మాన్‌ కా జాన్‌.. వైఎస్సార్‌.. ఆయన ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్‌తో నేను మెడికల్‌ సీటు సంపాదించాను. విజయవాడ సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీలో పైసా కట్టకుండా సీటు వచ్చింది. నాకైతే వైఎస్సార్‌ ‘అల్లా’ మాదిరిగానే నన్ను ఆదుకున్నట్లు అనిపించింది’ అని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైద్యురాలు షేక్‌ ఆఫ్రిన్‌ చెప్పారు. ‘మగ్గంపై నేసిన చీరలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునే నాకు 2008లో గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. నా వద్ద ఉన్న తెల్లకార్డుతోనే గుంటూరులోని ఆసుపత్రిలో చేర్చుకుని ఉచితంగా ఆపరేషన్‌ చేశారు.

ఈ భూమిపై నాకు నూకలు ఉన్నాయంటే అది వైఎస్సార్‌ పెట్టిన భిక్షే’ అని ప్రకాశం జిల్లా ఈపూరుపాలెంకు చెందిన చేనేత కార్మికుడు జొన్నాదుల సుబ్బారావు ఆ మహానేత మేలును గుర్తు చేసుకున్నారు. ‘ఆ మహానుభావుడు కండలేరు ఎడమ కాలువ తవ్వించడం వల్లే ఈ రోజు మా నోట్లోకి నాలుగు వేళ్లు వెళుతున్నాయి’ అని నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన రైతు ఆకుల గంగిరెడ్డి ఆనందంతో చెప్పారు. ‘మహానేత వైఎస్సార్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ చలువ వల్లే ఈ రోజు నా కూతురు పోలీస్‌ శాఖలో కమ్యూనికేషన్స్‌ విభాగంలో రేడియో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అప్పట్లో ఆయన ఇచ్చిన పావలా వడ్డీ రుణం మా కుటుంబానికి బాగా ఉపయోగపడింది’ అని నెల్లూరు జిల్లా బంగారుపేటకు చెందిన కోనేటి రేవతి ఆనందంతో చెప్పింది. వైఎస్‌ చేపట్టిన రుణమాఫీ పథకం వల్లే అప్పుల ఊబి నుంచి బయట పడ్డామని, ఇందుకు ఆయనకు రుణ పడి ఉంటామని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరుకు చెందిన యామల భాస్కర్‌ చెప్పారు.  

మెతుకు ఇచ్చిన దేవుడు.. మొక్కుతాం ఎప్పుడూ..
తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని గోదావరి గట్టు పక్కన వెళ్తునప్పుడు కనిపించిన దృశ్యం.. వైఎస్సార్‌ ఫొటో, కేక్, చుట్టూ పదుల సంఖ్యలో జనం. ఏంటని అడిగితే చెప్పారు.. వాళ్లు వైఎస్సార్‌ పుట్టినరోజు చేసుకుంటున్నారట.. ఉపాధి కూలీలట. ఎక్కడ ఉంటే అక్కడ ఏటా అలా వైఎస్‌ పుట్టిన రోజుకు కేక్‌ కట్‌ చేయడం ఆనవాయితీ అన్నారు. అంత అభిమానమేంటన్న ప్రశ్నకు.. జయలక్ష్మి భూలక్ష్మి, అన్నమ్మ, మేరి, లక్ష్మమ్మ, చంద్రకళ, గ్రేసమ్మ పోటీపడి మరీ చెప్పారు. ‘ఆయన దేవుడయ్యా.. ఉపాధి కూలీకి అన్నం పెట్టాలనుకున్నాడు.

ఉప్పల కిరణ్‌

యంత్రాలు రానివ్వకుండా చేశాడు. ముద్ద నోటికెళ్తుందంటే ఆయన చలువే బాబు’. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పేటప్పుడు ప్రతి కళ్లలోనూ ఆనంద భాష్పాలు కన్పించాయి. ‘నా కొడుకు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడయ్యా.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ వల్లే ఇది జరిగింది’ మాణిక్యమ్మ మనసులోంచి తన్నుకొచ్చిన సంతోషమిది. కూలిపోయే ఇంట్లో చావలేక బతుకుతున్న మాకు వైఎస్‌ ఇల్లిచ్చాడు. పింఛను ఇప్పించాడు. ఆ మహారాజును ఎలా మరిచిపోతాం. వెంకట గోవిందమ్మ అన్న మాటిది. రాజన్నే దేవుడనే అక్కడున్న ఆ జనం మధ్య వైఎస్సార్‌ పుట్టిన రోజు ఓ పండుగ వాతావరణాన్నే తలపించింది.  

దారిపొడవునా అభిమానమే..
కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని వెంటప్రగడ నుంచి గుడివాడ, ముదినేపల్లి, కైకలూరు, ఆకివీడు మొదలు ఉండి, భీమవరం, పాలకొల్లు, రాజోలు, అమలాపురం, అంబాజీపేట, తణుకు, తాడేపల్లిగూడెం వరకూ సాగిన ‘సాక్షి’ బృందం ప్రత్యేక పర్యటనలో ఎంతోమంది వైఎస్సార్‌ వీరాభిమానులు కలిశారు. మహానేత తమకు చేసిన మేలును గుర్తు చేసుకున్నారు. ఆయన పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటామని చెప్పారు.

నిద్ర లేవగానే వైఎస్‌ తాతను చూడాల్సిందే..
గుడివాడలో పొన్నంపల్లి కల్పన, శ్రీనివాసరావు దంపతులు నిరుపేదలు. వారి పిల్లలు యోగభావన, యోగ భార్గవి పుట్టుకతోనే చెవుడు, మూగ. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆ చిన్నారులకు కొత్త జీవితాన్నిచ్చింది. మొత్తం రూ.13 లక్షలు మంజూరై చికిత్స అందడంతో ఆ చిన్నారులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిద్ర లేవగానే తాత (వైఎస్సార్‌) ఫొటోనే చూస్తారని కల్పన చెప్పింది. ఆపరేషన్‌ అయిన నెల రోజులకు వైఎస్సార్‌ని కలిశారట. ఆయన ముద్దు పెట్టుకున్నారట. రోజూ దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పిల్లలు మురిసిపోతున్నారు.  

తరాలు మారినా... యువతరానికీ పెద్దే
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలో సైకిళ్లపై ర్యాలీగా వెళ్తున్న యువత  ‘జోహార్‌ వైఎస్సార్‌...’ అంటూ నినదిస్తోంది. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి రాజన్న ఫోటో పట్టుకున్నాడు. వాళ్ల నినాదాలు ఉద్వేగంగా ఉన్నాయి. గుండె నిండా ప్రేమతో తన్నుకొచ్చే ఆవేశం వాళ్లల్లో కనిపించింది. ఎందుకీ సందడి... ప్రశ్న రాకముందే కుడుపూడి నరేష్‌ చెప్పడం మొదలుపెట్టాడు. ‘రాజన్న బర్త్‌డే... మా ఊరిలో చాలామంది యువకులు ఆయన వల్లే బాగుపడ్డారు. రేపటి తరాలకు ఆయన గుర్తుండాలి. ప్రతి వ్యక్తికి ఆయన మంచి తెలియాలి. అందుకే ప్రతి పుట్టిన రోజూ గ్రాండ్‌గా చేస్తాం’ అన్నాడు. ‘ఇప్పటికీ ఆయన
మాటలను యూట్యూబ్‌లో వింటాం. ఆరోగ్యశ్రీతో ఎంతో మందిని ఆదుకున్న మహా మనిషి అని ఆయన గురించి చెప్పుకుంటాం’ వై.షరీన్‌ నోటి వెంట వచ్చిన మాటలివి. ‘యూత్‌కు ఆయనే ఫేవరెట్‌ లీడర్‌’ ప్రకాశ్, పవన్‌కుమార్, ఉదయ్‌ చందులో ఉప్పొంగే ఆనందంలోంచి వినిపించిన మాటలివి.

అల్లాని మొక్కుదాం... సల్లగుండాలని
మామిడికుదురులో ముస్లిం మైనార్టీలు రాజన్నను దేవుడుగానే చూస్తున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకల కోసం చేస్తున్న సన్నాహాలే దీనికి నిదర్శనం. ఆ ఊరి గుండా వెళ్తున్నప్పుడు ఓ ఇంటి ముందు సన్నివేశం ఆపింది. ముజఫర్‌ అలీ, ఎండీ రఫీ, షబ్బీర్‌ అలీ, అబిద్‌ హుస్సేన్, అలీ రజా, సకీర్‌ హుస్సేన్‌ గుంపుగా ఓ ఇంటి ముందు ఆగారు. ఆ ఇంటి పెద్దావిడకు వైఎస్సార్‌ ఫొటో చూపించి చెబుతున్నారు.. ‘మన ముస్లింలకు నిజమైన బతుకునిచ్చిన దేవుడమ్మా.. ఊళ్లో ఆయన పుట్టిన రోజు చేస్తున్నాం.. ఇంటిల్లిపాది రావాలి. ఆయన కుటుంబాన్ని సల్లగా చూడాలని ఇంటిల్లిపాది దువా చేయాలి’ అన్నారు. ‘ఇంత హడావుడా?’ ఈ ప్రశ్న వాళ్లకు ఇబ్బందిగా అనిపించిందేమో.. ‘ఏం సార్‌.. వైఎస్సార్‌ మా ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌ ఓ వరం. దాంతో ఎంతోమంది గవర్నమెంట్‌ ఉద్యోగాల్లోకి వెళ్లారు. మా ఊరి నుంచే 20 మంది ఉన్నారు. ప్రతి ముస్లింకూ ఆయన పుట్టిన రోజు రంజాన్‌ అంత పెద్ద పండుగ’ అంటూ భావోద్వేగంగా చెప్పారు.  
 

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లిలో సైకిళ్లపై ర్యాలీగా వెళ్తున్న యువత 


మామిడికుదురులో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమానికి వృద్ధురాలిని ఆహ్వానిస్తున్న వైఎస్‌ అభిమానులు


వైద్యురాలు షేక్‌ ఆఫ్రిన్‌ 


నెల్లూరు జిల్లాకు చెందిన రైతు ఆకుల గంగిరెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top