స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌ @ 22,370  | Special Story On Snake Catcher Kiran | Sakshi
Sakshi News home page

స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌ @ 22,370 

Jul 16 2020 8:40 AM | Updated on Jul 16 2020 9:00 AM

Special Story On Snake Catcher Kiran - Sakshi

డాబాగార్డెన్స్‌/ఆరిలోవ: పాము పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కలలో కనిపించినా భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందు పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. చివరకు పాము బుసకొట్టిన శబ్దం వినిపించినా భయంతో బిగదీసుకుపోతారు. అయితే కిరణ్‌కు పాము కనిపిస్తే చాలు.. ఎవరైనా వాటికి హాని చేస్తారేమోనని ఆందోళన చెందుతారు. అయ్యో పాపం అంటూ దానిని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తారు. అన్ని పాములు హానికరం కావని, అవి మానవులకు ఒక విధంగా స్నేహితుల లాంటివని చెబుతున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పాములు  పట్టడంతో ఆయనది ఓ ప్రత్యేకమైన స్టైల్‌. నగరంలో ఎక్కడ పాము కనిపించినా.. మొదట కిరణ్‌ పేరే వినిపిస్తుంది. 

అది.. నగరంలోనే రద్దీగా ఉండే డాబాగార్డెన్స్‌ ప్రాంతం. పార్కింగ్‌ చేసిన ఓ కారులో కొండ చిలువ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. పెద్దగా కేకలు వేశారు. నాలుగైదడుగుల కొండచిలువ పందికొక్కును మింగుతూ ఉండడాన్ని గమనించారు. జనం హడావిడితో అది బెదిరి కారులోకి దూరింది. ఓ ధైర్యవంతుడు కారు యజమాని వద్ద తాళం తీసుకుని.. కారును అంబేడ్కర్‌ కూడలి చుట్టూ తిప్పి వచ్చాడు.

కానీ కొండచిలువ కారు దిగలేదు. ఈ లోగా రద్దీ పెరిగిపోయింది. ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహన యజమాని గత్యంతరం లేక కారును బీచ్‌రోడ్డులోకి తీసుకెళ్లాడు. ఇంతలో ఎవరో స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌కు ఫోన్‌ చేశారు. గాజువాకలో ఉన్న కిరణ్‌ హుటాహుటిన బీచ్‌రోడ్డుకు వచ్చాడు. కారులో చిక్కుకుపోయిన పామును తీసేందుకు శత విధాలా ప్రయత్నించాడు. ఫలితం లేదు. మరోదారి లేక సమీపంలో ఉన్న కారు గ్యారేజీకి తీసుకెళ్లారు. ఫలితం లేకపోయింది. చివరకు కారు కొనుగోలు చేసిన షోరూంకు తీసుకెళ్లి చెక్‌ చేయించారు. ఎట్టకేలకు స్నేక్‌ కిరణ్‌ చేతికి కొండ చిలువ చిక్కింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌ ద్వారా కిరణ్‌కు గుర్తింపు వచ్చింది.
 
మానవాళి మనుగడకు సహాయపడుతున్న పాములను రక్షించాల్సిన మనం.. అవి కనిపిస్తే చాలు చంపేవరకు నిద్రపోం. కిరణ్‌ మాత్రం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతటి విష సర్పం కనిపించినా.. వీటిని కంటికి పాపలా కాపాడడంతో పాటు సమీపంలోని అడవిలో వదిలి పెడుతుంటారు. రొక్కం లక్ష్మినారాయణ, వరలక్ష్మిల దంపతుల చిన్న కుమారుడు కిరణ్‌. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో 22,370 పాములు పట్టి సమీపంలోని అడవుల్లోకి విడిచిపెట్టి పలువురి మన్ననలు పొందారు. పలు అవార్డులు, రివార్డులు పొందారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కిరణ్‌ పాములను ఎవరైనా చంపితే తట్టుకోలేనని అంటారు.  
ఇలా మొదలైంది 

వ్యవసాయ కుటుంబం కావడంతో తన సొంతూరైన మిందిలో తాతతో సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్తుండేవాడు.  పొలాల్లో పాములు కనిపిస్తే.. చుట్టుపక్కల ఉన్న రైతులు కొట్టి చంపడాన్ని చూసి పదేళ్ల వయసులోనే బాధపడేవారు. అప్పుడే పాములను కాపాడాలనే దృఢ సంకల్పం కలిగిందని, అప్పటి నుంచి అవి కనిపిస్తే పట్టుకుని జన సంచారానికి దూరంగా వదిలిపెట్టేవాడినని కిరణ్‌ తెలిపారు.  

సేవలకు గుర్తింపు 
పర్యావరణానికి మేలు కలిగించే పాములకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2000లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, 2001లో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఏక్‌వీరా బుక్‌ ఆఫ్‌ స్టేట్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యంతో పాటు మూడు యూనియన్లు కలిసి ఉమ్మడిగా 2006లో ఇంటిని కేటాయించాయి. కిరణ్‌ సేవలు విశాఖ ప్రజలకు ఎంతగానో అవసరమని గ్రహించిన జీవీఎంసీ కమిషనర్‌ అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించడంతో కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగింది.  

ఎంతటి విష సర్పాలైనా.. 
ఇళ్లు, కార్యాలయాల్లోకి చొరబడ్డ పాముల కదలికలను పసిగట్టి చాకచక్యంగా పట్టుకోగల సమర్థుడు కిరణ్‌. అలా ఇప్పటి వరకు వివిధ రకాల 22,370 పాములు పట్టుకున్నారు. వీటిలో భయంకర విషసర్పాలైన పొడ, రక్త పింజర, కట్లపాము, నాగుపాము, జెర్రిగొడ్డు, పిట్‌వైపర్, కోబ్రా, నాగజాతి పాములు ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్‌ పరిధిలోనే 10వేల పైబడి పాములు పట్టుకున్నారు. ఇలా పట్టుకున్న పాములను నేరుగా జూలో క్యూరేటర్‌ దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ రికార్డులో నమోదు చేసి సిబ్బందికి పాములు అప్పగించేస్తారు. కొన్నింటిని జూ సిబ్బంది సమక్షంలో తొట్లకొండ, కంబాలకొండ ప్రాంతాల్లో విడిచిపెడుతుంటారు.  

ఫోన్‌ చేయండి..
సాధారణంగా పాములు మనుషులను హాని చేయవు. కేవలం భయపెట్టడానికి మాత్రం బుసకొడతాయి. వాటిని హింసించినా, చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అవి కాటు వేస్తాయి. పాము కనబడగానే అటవీ శాఖ అధికారులను గానీ.. పాములు పట్టే వారిని గానీ పిలిస్తే మనుషులకు, పాములకు హాని ఉండదు. 18 మందితో రెస్క్యూ టీం నడుస్తోంది. పాములు పట్టే విషయంలో ఎవరికీ ఎలాంటి సాయం కావాలన్నా.. 9849140500, 8331840500 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.  
– రొక్కం కిరణ్‌కుమార్, స్నేక్‌ క్యాచర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement