ఇక 'సిరి'కాకుళమే!

Special Story Of AP Budget In Srikakulam District - Sakshi

‘సంకల్ప’ సూరీడు.. పాదయాత్రలో జనం కష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి బాధలను గుర్తుపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు తొలి ‘పద్దు’ పొడిచే వేళ.. వారి కన్నీళ్లు తుడిచేలా, వారి బతుకుల్లో వెలుగులు నిండేలా నిధులు కేటాయించారు.. ‘ప్రజల ముఖ్యమంత్రి’నని నిరూపించుకున్నారు.. నాయకుడి మనసెరిగిన ఆర్థిక మంత్రి విపక్షాలు సైతం ‘బుగ్గన’ వేలేసుకునేలా బడ్జెట్‌ సమర్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆనందంలో ముంచెత్తేలా తన ప్రణాళికను వెల్లడించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేలా అనేక నిర్ణయాలను ప్రకటించారు. కిడ్నీ వ్యాధితో బతుకీడుస్తూ ఎన్నాళ్లు జీవిస్తామో తెలీక కొట్టుమిట్టాడుతున్న ప్రాణ దీపాలను వెలిగించేలా రీసెర్చి సెంటర్‌కు రూ.50 కోట్లు కేటాయించారు. వందలాది కోట్ల నిధులిచ్చి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకురావాలని తలపెట్టారు.

సాక్షి, శ్రీకాకుళం : వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగానికి, అలాగే వ్యవసాయాధారిత వ్యవస్థలకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జిల్లాలో అత్యధిక శాతం మంది ప్రజలకు ప్రత్యక్షంగానూ.. మరికొందరికి పరోక్షంగానూ లబ్ధి చేకూరనుంది. సాగు, తాగునీటికి కీలకమైన బి.ఆర్‌.ఆర్‌ వంశధార, జి.ఎల్‌ తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులను కేటాయించడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రధానమైన కిడ్నీ రోగుల వ్యధలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

గడిచిన మూడేళ్లుగా జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్ర తుఫాన్లు విధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా రాష్ట్రస్థాయిలో రూ.200 కోట్లు కేటాయించారు. దీంతో పాటు వ్యవసాయ రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించి, ఇందుకోసం నిధులను కూడా తాజా బడ్జెట్‌లో కేటాయించింది. అలాగే మత్స్యకారుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసారు.

వేటనిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతి పెంచడం కూడా విశేషం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల అమలులో భాగంగా ఇంటర్‌ వరకు అమ్మ ఒడి పథకం, గ్రామ/వార్డు సచివాలయాలు, గ్రామ/వార్డు వలంటీర్లు తదితర నియామకాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో నవరత్నాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. 

అన్ని వర్గాలకు ప్రయోజనం
జిల్లాలోని రైతులు, పేదలు, విద్యార్ధులు, డ్వాక్రా మహిళలతో పాటు నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యంకి గురైన ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంతో సాగు విస్తీర్ణం పెరిగి,రైతులకు లాభదాయకం కానుంది.  రైతు స్థిరీకరణ నిధికి కేటాయింపులు జరపడంతో రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి అందుబాటులోకి వస్తుంది. ఉద్దానం ప్రాంతంలో వేలాదిమంది కిడ్ని వ్యాధిబారిన పడుతున్నా గత ప్రభుత్వాలు సర్వేలు, నామమాత్రపు చికిత్సలతో సరిపెట్టాయి. డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, అది పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది.

పాదయాత్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ప్రాంతంలో  కిడ్నీ రిసెర్చి సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో రూ. 50 కోట్లు నిధులు కేటాయించడంలో అక్కడ ఉన్న తీవ్ర స్థాయి వ్యాధితో బాధపడుతున్న 16 వేలమందితోపాటు వ్యాధి లక్షణాలు ఉన్న మరో పది వేలమందికి ఊరట కల్పించే అంశంగా మారింది. జిల్లాలో మత్సకార గ్రామాలు 110 వరకు గ్రామాలు ఉండగా, వేట నిషేధ భృతి రూ.10 వేలకు పెంచడంతో సుమారుగా 9 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.  

ఆశా వర్కర్లు, గిరిజన ఆరోగ్య కార్యకర్తలు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు హోంగార్డులు, మద్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 2 లక్షల మందికి ఊరట కల్గించనుంది.

 జిల్లాలో రుణ పద్ధతితో అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లను పేదలకు కేటాయించగా రుణ మాఫీ చేస్తామని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపడంతో జిల్లాలో అన్ని పురపాలక, నగరపాలక సంఘాల్లో 7వేల వరకు లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. మహిళలకు, రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో పొందుపర్చడం వలన 48,962 డ్వాక్రా సంఘాలలోని 5,46,715 మంది మహిళలకు,  సుమారుగా 5 లక్షల రైతు కుటుంబాలకు మేలు చేకూరుతోంది. 

సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట
జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు ప్రధనంగా వంశధార, నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు,  మడ్డువలసలు  అర్ధంతరంగా  ఉండిపోయాయి. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి      హయాంలో జలయజ్ఞంలో భాగంగా జిల్లాను సస్యశామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. అయితే ఆయన అకాల మరణంతో పనులు నిలిచిపోయాయి. సుమారుగా పుష్కరకాలం నిలిచిన పనులకు మరలా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రాణం పోసింది. వంశధారకు రూ. 147 కోట్లు, మడ్డువలసకు రూ. 9.50 కోట్లు, తోటపల్లికి రూ.156 కోట్లను కేటాయించారు. చిన్నతరహా నీటి ప్రాజెక్టులకు రాష్టంలో  రూ. 589.59 కోట్లు కేటాయించారు. దంతో జిల్లాలోని చిన్న ప్రాజెక్టులకు మహర్ధశ వస్తుంది. ఈ బడ్జెట్‌లో జిల్లాలో సుమారు 5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరగనుంది. 

తోటపల్లి ప్రాజెక్టుకు : రూ.156 కోట్లు
వంశధార ప్రాజెక్టుకు : రూ.147.10కోట్లు
పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధికి :  రూ.50 కోట్లు
మడ్డువలస ప్రాజెక్టుకు : రూ.9.5 కోట్లు
మహేంద్ర తనయ ప్రాజెక్టుకు : రూ.100.94 కోట్లు 

  • అమ్మఒడి ద్వారా చదువులకు పెద్ద పీట వేశారు.  పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేయనున్నారు. దీనికి గాను ఈ బడ్జెట్లో రూ. 6,450 కోట్ల్లను కేటాయించారు. దీంతో జిల్లాలో ప్రాధమిక, మాధ్యమిక, ఇంటర్మీడియట్‌ విద్యార్ధులు సుమారు 3.20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దీంతో చదువుకొనేందుకు పేదలకు ఆర్ధిక సమస్య లేకుండా ఉంటుంది. 
  • వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటి వరకు గడచిన అయిదు సంవత్సరాలుగా నీరసించింది. దీనికి పుర్వవైభవాన్ని తీసుకువచ్చారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందడానికి రోగాల సంఖ్యను 1040కి  పెంచడంతోపాటు ఈ బడ్జెట్‌లో రూ.1740 కోట్లును కేటాయించారు. దీంతో జిల్లాలో తెలుపురంగు కార్డుగల పేద రోగులకు అన్ని రకాల జబ్బులకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందనుంది.
  • వైఎస్‌ఆర్‌ గృహ వసతి ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడంతో పాటు, ఆ ఇంటి మహిళ పేరిట పట్టాను అందజేసి,  ఆ స్థలంలో ఇల్లు నిర్మాణాకి నిధులు అందజేయనున్నారు.  జిల్లాలో సుమారుగా 2 లక్షల ఇల్లులేని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు, నిర్మాణాలు చేయనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర బడ్జెట్‌లో రూ.8.615 కోట్లును కేటాయించారు. ఈ బడ్జెట్‌లో వారిలో స్వంత ఇల్లు కల నెరవేనుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా 300 చదరపు అడుగుల వరకు గల గృహాలక సంబంధించి పట్టణ గృహనిర్మాణ లబ్దిదారుల రుణాలను మాఫీ చేసేందుకు ఈ బడ్జెట్‌లో పొందుపర్చారు. 
  • వైఎస్‌ఆర్‌ పింఛను కానుక ద్వారా  60 ఏళ్లు దాటిని వృద్దులకు పింఛను అందజేయనున్నారు. జిల్లాలో కొత్తగా 46 వేల పింఛన్లు రానున్నాయి. గత అయిదేళ్లతో పోల్చితే పింఛను మూడు రెట్లు పెరిగింది. కిడ్నీ రోగులకు, దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ. 10 వేలు, అలాగే వికలాంగులకు ’3 వేలు అందిస్తున్నారు.  ప్రస్తుతం వివిధ రకాల పింఛనుదార్లు 3,25,785 మంది ఉన్నారు. వీరి సంఖ్య పెరగనుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 15746 కోట్లు కేటాయించారు. 
  • వైఎస్‌ఆర్‌ కళ్యాణ కానుక పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువుకి రూ. 50 వేలు,  ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వధువుకి రూ.లక్ష అందజేస్తారు. గతం కంటే ఈ కానుకను రెట్టింపు చేయడంతో ఆనందం వ్యక్తమవుతోంది.

జిల్లాకు ప్రయోజనమిలా..
వైఎస్సార్‌ రైతు భరోసా : 5 లక్షల మందికి
జగనన్న అమ్మ ఒడి :  3.20 లక్షల మందికి
వైఎస్సార్‌పెన్షన్‌ కానుక :  3.26 లక్షల మందికి
మత్స్యకారులకు నిషేధభృతి : 9,162 మందికి 
ఊరట పొందనున్న అగ్రి గోల్డ్‌ బాధితులు : 2 లక్షల మంది
వైఎస్సార్‌ ఆసరా : 5.46 లక్షల మందికి
వైఎస్సార్‌ గృహ వసతి :  2 లక్షలమందికి 

పాదయాత్ర హామీలకు కట్టుబడిన బడ్జెట్‌
ప్రతిపక్ష నాయకునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి సమస్యలను గుర్తించి అన్ని వర్గాల వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్టుబడి బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు స్పష్టమైంది. ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చే గుణం ఉన్న వైఎస్‌ కుటుంబం మాట తప్పకుండా ఉండేలా బడ్జెట్‌ రూపకల్పన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి కేటాయి ంపులు జరిగితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఆయన కుమారుడు జగన్‌ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధార జీవనాలు ఎక్కువ. వ్యవసాయం, రైతులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. 
– ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం శాసనసభ్యుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top