పది వేల మెగావాట్ల సోలార్‌ పరుగు

Solar Power Plants without Trouble for Free Agricultural Power - Sakshi

ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు ఢోకా లేకుండా సౌర విద్యుత్‌ ప్లాంట్లు 

ఇందుకోసం 50 వేల ఎకరాల గుర్తింపు.. డీపీఆర్‌లు సిద్ధం 

నేడు సీఎంకు నివేదిక ఇవ్వనున్న అధికారులు 

సాక్షి, అమరావతి: ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కోసం చేపట్టిన 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పురోగతిలో ఉంది. దీనిపై విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్‌ కోసం ప్రభుత్వం ఏటా డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. నాలుగేళ్ల సబ్సిడీ మొత్తాన్ని సౌర విద్యుత్‌ కోసం వినియోగిస్తే 25 ఏళ్ల పాటు రైతులకు పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించవచ్చని భావించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుంది. ఇప్పటికే సౌర విద్యుత్‌ ప్లాంట్ల కోసం ప్రభుత్వం 50 వేల ఎకరాలను గుర్తించింది. ఇందులో చాలా వరకు ప్రభుత్వ భూమే ఉంది. 200, 400 కేవీ సబ్‌ స్టేషన్లు, లైన్లకు దగ్గరగా సోలార్‌ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. 

వ్యవసాయానికి రోజుకు 33 మిలియన్‌ యూనిట్లు 
రాష్ట్రంలో ప్రస్తుతం 18.37 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 9 గంటల పగటిపూట విద్యుత్‌ పథకం ప్రకారం రోజుకు 33 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ అవసరం. పగటిపూటే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ డిమాండ్‌ కూడా ఉంటోంది. ఈ కారణంగా వ్యవసాయ విద్యుత్‌కు కోత పెట్టడం అనివార్యమవుతోంది. వేసవిలో డిమాండ్‌ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉచిత విద్యుత్‌ కోసమే ప్రత్యేకంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ పార్కుల నుంచి రోజుకు 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయానికి రోజుకు 33 మిలియన్‌ యూనిట్లు వాడుకున్నా.. ఇంకా 7 మిలియన్ల యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేయొచ్చు. పైగా నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం వల్ల యూనిట్‌ రూ.2.50 లోపే ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ పెరగడంతో గతంలో మార్కెట్లో యూనిట్‌ రూ.6 పెట్టి కొనుగోలు చేసేవారు. ఈ ఖర్చంతా డిస్కమ్‌లపైనే పడింది. గత ప్రభుత్వం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన సబ్సిడీ మాత్రమే ఇచ్చింది. గత ఐదేళ్లుగా ఇది ఏటా రూ.4 వేల కోట్లు మించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరమే రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈ సబ్సిడీ మొత్తాన్ని నాలుగేళ్లకు లెక్కగడితే రూ.40 వేల కోట్లు అవుతుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి వెచ్చిస్తే 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా చౌకగా విద్యుత్‌ అందించే వీలుంది. 

డీపీఆర్‌లు సిద్ధం: నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి 
సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లను ఇప్పటికే సిద్ధం చేశాం. లాభనష్టాలపై సీఎంతో చర్చిస్తాం. అవసరమైన రుణాలు కూడా అతి తక్కువ రేటుకే లభించే వీలుంది. వ్యవసాయానికి పగటి విద్యుత్‌లో కోతలు రాకుండా సౌర విద్యుత్‌ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top