సోలార్‌ దీపాలు సర్దుకున్నారు..! | Sakshi
Sakshi News home page

సోలార్‌ దీపాలు సర్దుకున్నారు..!

Published Sat, Nov 3 2018 8:29 AM

Solar Lights Corruption In Titli Cyclone Donations - Sakshi

శ్రీకాకుళం మందస: తిత్లీ తుపానును కొంతమంది తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సాయాన్ని.. పరికరాలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలకు అంతరాయం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అందజేసిన సోలార్‌ దీపాలను కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టించారనే విషయం ఇప్పుడు చర్చనీ యాంశమైంది.అక్టోబర్‌ 10వ తేదీ రాత్రి భయంకరమైన తుపాను జిల్లాపై విరుచుకుపడింది. ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్‌ వ్యవస్థ నాశనమైంది. అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పరిస్థితిని గమనించిన సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్‌ అత్యవసరశాఖగాగుర్తింపు ఉన్న వైద్యశాఖకు సోలార్‌ విద్యుత్‌ దీపాలను పంపిణీ చేశారు. విద్యుత్‌ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్‌ సెంటర్లకు, ఆశావర్కర్లకు  ల్యాంపులను అందజేశారు.

వీటి వెలుతురులో ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. ఒక్కో సబ్‌ సెంటర్‌కు 10 నుంచి 15 సోలార్‌ దీపాలు సమకూర్చారు. అయితే వీటిని కొంతమం ది పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఇప్పుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా సేవకంటే.. స్వసేవకే ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు కొంతమంది సోలార్‌ దీపాలు ఉచితంగా వచ్చాయనుకుని వారితో పాటు వారి బంధువులకు కూడా పంచేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ల్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. వీటిని ఉచితంగా పంపిణీ చేసినట్టు వైద్యశాఖ ఉద్యోగులు భావించారు. అయితే వీటిని ఉచితంగా సరఫరా చేయలేదని... అత్యవసర సేవల నిమిత్తం పంపించామని ఐటీడీఏ పీవో తాజాగా ఓ  ప్రకటన చేశారు.  వైద్యశాఖకు అందించిన సోలార్‌ దీపాలు ఉచితం కా>దని, విద్యుత్‌ వెలుగులు రాగానే రీకలెక్ట్‌ చేసుకుంటామని స్పష్టం చేయడంతో దీపాలు పంచుకున్న ఉద్యోగులకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. పంపిణీ సమయంలో సోలార్‌ ల్యాంపుల బాధ్యత ఎవరు తీసుకున్నారు.. ఎవరి సంతకాలతో బయటకు వెళ్లాయి.. ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఉన్నాయోనని తెలుసుకోవడానికి ఉద్యోగులు కిందామీదా పడుతున్నారు.

సోలార్‌ దీపాల లెక్కతేలకపోతే చర్యలు
అత్యవసర పరిస్థితి కావడంతో సోలార్‌ దీపాలను వైద్యశాఖకు అందించాం. పూర్తిస్థాయిలో విద్యుత్‌ రాగానే వీటిని తిరిగి తీసుకుంటాం. ఏ ఒక్కటీ విడిచిపెట్టం. ఎవరైన చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తుపాను సాయంలో జరిగిన సంఘటనల్లో బాధ్యులను సస్పెండ్‌ చేయడం జరిగింది. సోలార్‌ ల్యాంపుల లెక్క సక్రమంగా ఉండాలి. లేకపోతే బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం.  
–లోతేటి శివశంకర్, ప్రాజెక్టు అధికారి, ఐటీడీఏ

Advertisement
Advertisement