దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు.. | so many stories of forgery cases on tdp mlc deepak Reddy | Sakshi
Sakshi News home page

దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు..

May 17 2017 1:11 PM | Updated on Aug 10 2018 7:13 PM

దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు.. - Sakshi

దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి కబ్జా దందాల్లో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి కబ్జా దందాల్లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. కబ్జాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు కీలక నిందితుడు ఒకర్ని అరెస్టు చేయడంతో.. న్యాయవాది శైలేష్‌ సక్సేనాతో కలసి దీపక్‌రెడ్డి చేసిన దందాలు బయటకు వస్తున్నాయి. ఎంజే మార్కెట్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద వివిధ రకాల పత్రాలు విక్రయించే శివభూషణంతో శైలేష్‌ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్‌ సంతకాలు చేయించేవారని వెల్లడైంది. దీనికి ప్రతిఫలంగా శివభూషణం కుమార్తె, కుమారుడి వివాహం జరిపిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

 2004లో భోజగుట్టలో ఉన్న రూ. 300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల స్థలానికి సంబంధించి న్యాయ వివాదాలు సృష్టించారు. ఆ స్థలం యజమాని ఇక్బాల్‌ ఇస్లాం ఖాన్‌లాగా న్యాయస్థానంలో శివభూషణంతో సంతకాలు చేయించారు. వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే.. ఇక్బాల్‌ ఇస్లాం ఖాన్‌గా కోర్టుకు తీసుకెళ్లేవారు. 2006 మార్చ్‌లో మరోసారి శివభూషణాన్ని శైలేష్‌ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్‌ సంతకాలకు వాడుకున్నారు. గుడిమల్కాపూర్‌లో ఉన్న 78 ఎకరాలు 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలాన్ని శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఎన్‌హెచ్‌ శైలజ, బి.ప్రకాష్‌ చంద్‌ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్‌ పత్రాలు సృష్టించారు.

వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి రాధాకృషన్‌ ఠాకూర్‌ పేరుతో బోగస్‌ ఓటర్‌ ఐడీ సృష్టించారు. ఆ బోగస్‌ ఓటర్‌ ఐడీని బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల విలువైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ వాడారు. ఇదే తరహాలో జరిగిన మరిన్ని దందాలు సీసీఎస్‌ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అల్లుడనే విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement