మిస్‌ఫైర్ అయిన ఎస్‌ఎల్‌ఆర్ గన్ | slr gun misfired | Sakshi
Sakshi News home page

మిస్‌ఫైర్ అయిన ఎస్‌ఎల్‌ఆర్ గన్

Jan 31 2015 8:10 PM | Updated on Sep 2 2017 8:35 PM

అది పోలీసు జిల్లా కార్యాలయం ...సమయం శనివారం తెల్లవారు జామున 5.30 గంటలు.. అకస్మాత్తుగా తుపాకీ పేలిన శబ్ధం

పశ్చిమగోదావరి : అది పోలీసు జిల్లా కార్యాలయం ...సమయం శనివారం తెల్లవారు జామున 5.30 గంటలు.. అకస్మాత్తుగా తుపాకీ పేలిన శబ్ధం ... దీంతో ఉలిక్కి పడిన సిబ్బంది.. అధికారులు అక్కడకు చేరుకుని ఏమైందో ఆర్ధంకాక ఉరుకులు పరుకులు పెట్టారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. తుపాకీ మిస్ ఫైర్ అయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర కలవరాన్ని సృష్టించిన ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు పొలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.చినబాబు డ్యూటీపై ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న ఏఆర్ విభాగానికి శనివారం తెల్లవారు జామున వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కొవ్వూరు పోలీస్టేషన్‌కు చెందిన షాజహాన్‌తో కొతంసేపు ముచ్చటించాడు. ఇద్దరి వద్ద బందోబస్తు నిమిత్తం ఒకే రకమైన తుపాకీలు ఉన్నాయి. షాజహాన్ చేతిలో ఉన్న తుపాకీని బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చే వరకూ పట్టుకోమని చినబాబుకు ఇచ్చాడు. కొద్దిసేపటికే షాజహాన్ వచ్చి తన తుపాకీని తీసుకుని , డ్యూటీ పూర్తయిదంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే షాజహాన్‌కు ఆయన తుపాకీ బదులు పొరపాటున చినబాబుకు చెందిన లోడ్ కాని తుపాకీని ఇచ్చాడు. ఇంటికి వెళ్లే తొందరలో షాజహాన్ తుపాకీని పరిశీలించకుండానే తీసుకువెళ్ళి పోయాడు. కొద్దిసేపటి అనంతరం చినబాబు తన తుపాకీని లోడ్ చేయాలనే ప్రయత్నంలో ఖాళీ తుపాకీ అనుకుని షాజహాన్ లోడెడ్ తుపాకీ టిగర్‌ను నొక్కాడు. దీంతో ఒక్క సారిగా తుపాకీ పెద్ద శబ్దంతో మిస్ ఫైర్ అయింది. తుపాకీలు రెండూ ఒకే రకంగా ఉండటం, పొరపాటున షాజహాన్ తుపాకీ చినబాబు దగ్గరకు రావడం, దానిని ఖాళీ తుపాకీ అనుకుని అజాగ్రత్తగా హ్యండెల్ చేయడం వల్లే మిస్ ఫైర్ జరిగిందని ఏఆర్ డీఎస్పీ కె. కోటేశ్వరరావు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మిస్‌ఫైర్ చేసిన కానిస్టేబుల్ చినబాబు సస్పెన్షన్
జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన తుపాకీ పేలుడు సంఘటనకు బాధ్యులైన మొగల్తూరుకు చెందిన కానిస్టేబుల్ ఎన్.చినబాబును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ విచారణ అధికారిగా ఏఆర్‌డీఎస్పీ కె.కోటేశ్వరరావును ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

(ఏలూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement