సీనియర్లు సూపర్‌ | Sixty years old people was at the forefront of conquering the Coronavirus | Sakshi
Sakshi News home page

సీనియర్లు సూపర్‌

Jul 13 2020 3:25 AM | Updated on Jul 13 2020 9:05 AM

Sixty years old people was at the forefront of conquering the Coronavirus - Sakshi

విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడి జీజీహెచ్‌లో చికిత్స పొందారు. 14 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. అస్సలు ఆందోళన పడలేదు. ఆక్సిజన్‌ పెట్టించుకోలేదు. కేవలం మందులు మాత్రమే వేసుకున్నారు. ఇప్పుడు కరోనా నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉన్నారు. 
 
అలాగే, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 64 ఏళ్ల మరో వ్యక్తి కూడా కరోనా పాజిటివ్‌తో కడప ఫాతిమా ఆస్పత్రిలో చేరారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డా ఆయన మనోధైర్యంతో ఉన్నారు. వైద్యులు టైం ప్రకారం మందులిచ్చారు. 14 రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేస్తే నెగిటివ్‌ వచ్చింది. ఇంటికి పంపించారు. భయం వద్దు..జాగ్రత్తగా ఉంటే చాలు అని ఆయన ధైర్యం చెబుతున్నారు. 
 
.. రాష్ట్రంలో ఇలా అరవై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువ మంది వేగంగా కోలుకుంటున్నట్లు డిశ్చార్జి అయిన వారి గణాంకాల ద్వారా అర్థమవుతోంది. రాష్ట్రంలో అరవై ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారిలో రికవరీ శాతం బ్రహ్మాండంగా ఉందని.. యువకులు కోలుకుంటున్నట్లుగానే వృద్ధులూ సురక్షితంగా కరోనా నుంచి బయటపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. వీరిలో 90 శాతం మంది ఆక్సిజన్‌ అవసరం లేకుండానే డిశ్చార్జి అయి ఇంటికి వెళ్తున్నారు. చాలామంది కోమార్బిడిటీ (దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న) వారు కూడా కరోనా నుంచి బయటపడుతున్నారు. ఆలస్యంగా ఆస్పత్రుల్లో చేరిన అతికొద్ది మంది మాత్రమే క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తున్నారని.. మిగతా వారిని 14 రోజుల్లోగానే డిశ్చార్జి చేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ.. ధైర్యంగా ఉంటే కరోనా నుంచి చాలా తేలికగా బయటపడొచ్చని వారంటున్నారు.

సాక్షి, అమరావతి : చాలామంది కరోనా వైరస్‌ అనేసరికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వృద్ధుల కంటే ఎక్కువగా యువతే భయపడిపోతున్నారు. కానీ, మన రాష్ట్రంలో 29 వేల మందికి పైగా పాజిటివ్‌ రాగా.. అందులో మృతిచెందిన వారు కేవలం 1.12 శాతం మాత్రమే. వీరు కూడా చివరి దశలో ఆస్పత్రికి వచ్చిన వారు కావడం గమనార్హం. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పటికీ టెస్టులు చేయించుకోవడంలో జాప్యం చేయడం.. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండటం.. సకాలంలో ఆస్పత్రులకు రాకపోవడంవల్ల ఈ మరణాలు నమోదయ్యాయి. ఇక 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాలను పరిశీలిస్తే.. ఏపీ అతితక్కువ మరణాలతో ముందు వరుసలో ఉంది.

60 ఏళ్లు దాటిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు.
► వీలైనంత వరకూ ప్రత్యేక గదిలో ఉండాలి.
► పిల్లలను దగ్గరకు చేరదీయవద్దు.
► మధుమేహం, రక్తపోటు వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి.
► ప్రాణాయామం వంటివి చేయాలి.
► ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
► పల్స్‌ ఆక్సీమీటర్, ఎమర్జెన్సీ సమయంలో ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో ఉంచుకోవాలి.

కరోనా నుంచి కోలుకున్నాక వృద్ధులు ఇలా చేయాలి..
► వీరిలో రోగనిరోధక శక్తి కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుల సూచన మేరకు విటమిన్ల ట్యాబ్లెట్లు వేసుకోవాలి.
► చికెన్, గుడ్డు, చేపల వంటి ఆహారం తీసుకోవాలి.
► ప్రత్యేక గదిలో ఉంటూ.. ప్రశాంతంగా గడపాలి.
► తమ గదిలోకి చిన్న పిల్లలను రానివ్వకుండా చూసుకోవాలి.
► పల్స్‌ ఆక్సీమీటర్, ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలి.

40 వేల మందికి సరిపడా ఏర్పాట్లు
రాష్ట్రంలో 40 వేల మంది పాజిటివ్‌ కేసులకు వైద్యమందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఇందుకోసం అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది విషయంలో ప్రభుత్వం వనరులన్నీ కూడా సమకూర్చింది. ఇవి కాక..
► రాష్ట్రంలో 19 వైరాలజీ ల్యాబొరేటరీలు, 47 ట్రూనాట్‌ మెషీన్లు, 5 సీబీనాట్‌ మెషీన్లు, 2 నాకో ల్యాబొరేటరీలు, 5 క్లియా మెషీన్ల ద్వారా టెస్టుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
► 40 వేల మందికి పడకలు ఏర్పాటయ్యాయి.
► జూలై 12 నాటికి నమోదైన పాజిటివ్‌ కేసులు 29,168 కాగా, అందులో చికిత్స పొందుతున్న వారు కేవలం 13,428 మాత్రమే.
► చికిత్స విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని ఆరోగ్య శాఖ భరోసా ఇస్తోంది.
► ఎలాంటి లక్షణాలు కనిపించని (అసింప్టమాటిక్‌), తీవ్రత తక్కువగా (మైల్డ్‌) ఉన్న వారికి 76 క్వారంటైన్‌ సెంటర్లలో వైద్యం అందిస్తున్నారు.
► 40వేల మంది వైద్యులు, సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బందితో నిత్యం పర్యవేక్షణ జరుగుతోంది.
► రాష్ట్రవ్యాప్తంగా 51 చోట్ల ఆర్టీసీ బస్సుల ద్వారా ఆయా జిల్లాల్లో నమూనాలు తీసుకుంటున్నారు.
► కోవిడ్‌ పేషెంట్ల రవాణా కోసం 200కి పైగా 108 అంబులెన్సులు నిత్యం అందుబాటులో ఉన్నాయి. 3,661 క్యూబిట్‌ మీటర్ల ఆక్సిజన్‌ను సిద్ధంగా ఉంచారు. 

వృద్ధులే మానసికంగా దృఢంగా ఉన్నారు
కుర్రాళ్లే ఎక్కువగా భయపడుతున్నారు. 60 ఏళ్లు దాటిన వారు ఆందోళన పడటంలేదు. మానసికంగా దృఢంగా కనిపిస్తున్నారు. కొన్ని దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పటికీ రికవరీలో వారు ముందువరుసలో ఉన్నారు. అసలు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఏపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో మంచి వైద్యం లభిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మృతుల శాతం తక్కువే.
– డా. కె. ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వాసుపత్రి

భయపడకుండా ఉండాలి.. 
నా వయసు 69 ఏళ్లు. నాకు కరోనా పాజిటివ్‌ అనగానే మా ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఆందోళన పడ్డారు. నాకు బీపీ ఉంది. ఆస్పత్రికి వెళ్లాను. 14 రోజులు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా. ఆ తర్వాత డిశ్చార్జి చేశారు. ఆందోళన చెందకుండా ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 
    – షేక్‌ మహమూద్‌ బాషా, బ్రాడీపేట, గుంటూరు

మందులు కూడా పెద్దగా వాడలేదు
నాకు కరోనా సోకిందనగానే ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. నా వయసు 62 ఏళ్లు. షుగర్‌ ఉండడంతో నాక్కూడా తొలుత భయమేసింది. కానీ,  వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాక ధైర్యమొచ్చింది. జ్వరానికి పారాసెటిమాల్‌ మాత్రమే ఇచ్చేవారు. అంతకుమించి నేనేమీ మందులు వాడలేదు. 14 రోజుల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికొచ్చా.
    – రామలక్షుమ్మ, ఒంగోలు

ఎలాంటి ఆందోళన అక్కర్లేదు
లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకుని వెళ్తే ఏ సమస్యా ఉండదు. చాలామంది భయపడుతున్నారు. కానీ, నాకేమీ అలా అనిపించలేదు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యం, మంచి ఆహారం తీసుకున్నా. ఆందోళన పడాల్సిన అవసరంలేదని, ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. వారి సూచనలు పాటించా. 65 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నాను.    
    – ప్రసాదరావు, సీ క్యాంప్‌ ఏరియా, కర్నూలు

మానసికంగానే ఎదుర్కోవాలి
నా కొడుకు అమెరికా నుంచి వచ్చాక అతని నుంచి నాకు కరోనా వచ్చింది. కుటుంబ సభ్యులందరూ చాలా భయపడ్డారు. 65 ఏళ్ల వయసులో ఇదేంటి అనుకున్నారు. మానసికంగా దృఢంగా ఉంటే ఈ వైరస్‌ ఏమీ చేయలేదని అనిపించింది. నా కొడుకు, నేను ఆరోగ్యంగా ఉన్నాం. డాక్టర్లు చాలా ధైర్యం చెప్పారు. వాళ్ల సేవలు మరువలేనివి.
    – సుబ్రమణ్య ప్రసాద్, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement