తన మృతికి పోలీసు అధికారి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆందోళనకు దారితీసింది.
పొన్నూరు రూరల్: తన మృతికి పోలీసు అధికారి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆందోళనకు దారితీసింది. మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. శనివారం పొన్నూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామానికి చెందిన సాయికి
రణ్ పొన్నూరు పట్టణంలోని ఓవర్ బ్రిడ్జిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఏఎస్‌ఐ సత్యన్నారాయణ ప్రాథమిక దర్యాప్తు చేసి పొన్నూరు డిపో ఆర్డీసీ డ్రైవర్ బొనిగల రోశయ్య (35) తప్పేమీ లేదని నిర్ధారించారు. అనంతరం రోశయ్య బస్సు తీసుకుని వెళ్లారు. గాయాలతో చికిత్సపొందుతున్న సాయికిరణ్ మృతి చెందడంతో అర్బన్ ఎస్.ఐ. చరణ్ పొన్నూరు ఆర్టీసీ డిపోకు వెళ్లి సాయికిరణ్ మృతికి రోశయ్యే కారణమని బెదిరించడంతో రోశయ్య భయపడిపోయారు.
పొన్నూరు డిపో ఇన్‌చార్జి మేనేజర్‌గా ఉన్న బాపట్ల డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది శుక్రవారం ఎస్‌ఐ చరణ్‌తో చర్యలు జరిపినప్పటికీ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోశయ్య మన్నవలోని తన స్వగృహంలో శుక్రవారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను రాసిన సూసైడ్‌నోట్‌లో తన మృతికి ఎస్‌ఐ చరణ్ కారణమని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
భారీగా మోహరించిన పోలీసు బలగాలు..
డ్రైవర్ రోశయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసి వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించిన మృతుడి బంధువులు, గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బంది రోశయ్య మృతదేహంతో పట్టణంలోని అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్‌ఐ చరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
పలువురు ఎస్‌ఐలు, సీఐలతోపాటు డీఎస్పీలు విక్రమ్ శ్రీనివాస్, పి.మహేష్, అడిషనల్ ఎస్పీ శోభామంజరిలతో పాటు రెండు బెటాలియన్ల రాపిడ్ యాక్షన్‌ఫోర్స్ దిగింది. డీఎస్పీ మహేష్ సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఎస్‌ఐ చరణ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ శోభామంజరి ప్రకటించడంతో రోశయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె పూర్ణిమ, కుమారుడు నాగేంద్ర వరప్రసాద్ ఉన్నారు.