తస్సాదియ్యా.. రొయ్య

Shrimp prices Hikes In PSR Nellore - Sakshi

పుంజుకుంటున్న రొయ్యల ధరలు

క్రాప్‌ హార్వెస్టింగ్‌ చివరి దశలో పెరుగుతున్న వైనం

వారం వ్యవధిలో టన్నుపై రూ. 50 వేల నుంచి రూ.లక్ష హెచ్చింపు

ఆలస్యంగా సాగుచేసిన రైతుల మోముల్లో ఆనందం

రొయ్య రైతులను మరోసారి దగా చేసింది. ధరలుఆశాజనకంగా లేక సాగుకు దూరమైన తరుణంలో ధరలు పుంజుకోవడం చూసి రైతులు బాధ, సంతోషం మిళితమైన భావంతో తస్సాదియ్యా.. రొయ్య అంటున్నారు. ప్రధానంగా ఈ ఏడాది ధరలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం కూడా చాలా తగ్గింది. ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా హార్వెస్టింగ్‌ పూర్తయిన తరుణంలో ధరలు ఆశాజనకంగా పెరగడంతో ఆసల్యంగా సాగు చేసిన రైతులకు ఊరటనిస్తుంది.

గూడూరు:  వారం రోజులుగా రొయ్యల ధరలు  పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్నా.. మొన్నటి వరకూ ఆక్వా రైతును ఒక వైపు ధరలు పతనం.. మరో వైపు వైరస్‌లు వెంటాడి వేధిస్తూ ఫీడ్‌ తీసుకోకుండా పెరుగుదల లేకపోవడంతో అతలాకుతలం చేశాయి. సాధారణంగా జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో 1.25 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపడుతారు. కానీ ఈ సీజన్‌లో ధరలు లేకపోవడం, వర్షాలు  కురవకపోవడంతో ప్రస్తుతం 75 వేల ఎకరాల్లోనే రొయ్యల సాగును రైతులు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 70 శాతం మేర రొయ్యలగుంతల్లో హార్వెస్టింగ్‌ చేశారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా టన్ను రొయ్యలపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పెరగడంతో ఆక్వా రైతులు ఆశలు చిగురిస్తున్నాయి.  

పెరిగిన వ్యయం.. నష్టాల పాలవుతున్న రైతాంగం
రొయ్యల సాగు వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ ధరలు మాత్రం నిలకడగా లేక రైతాంగం నష్టాలపాలవుతున్నారు. 2013 సంవత్సరం తర్వాత రొయ్యల ధరలు ఆశించిన మేర లేకుండా పోవడమేకాక, నిలకడగా ఉన్న పరిస్థితీ లేదు. దీంతో సొంత గుంతలున్న రైతులు మాత్రం విధిలేని పరిస్థితుల్లో సాగు కొనసాగిస్తుంటే, లీజుకు తీసుకుని సాగు చేస్తున్నవారు మాత్రం, పోగొట్టుకున్న మొత్తం ఏం చేíసినా తిరిగి రాదని, ఆ మొత్తాలు రావాలంటే కచ్చితంగా రొయ్యల సాగు చేయక తప్పదనుకుని రొయ్యల సాగులోనే పాకులాడుతున్నారు. వరుస నష్టాలపాలవుతూ సాగు కొనసాగిస్తున్న రైతాంగాన్ని 2015లో వరదలకు రొయ్యలతోపాటు, ఏయిరేటర్లు, మోటార్లు, ఇతర సాగు పరికరాలన్నీ సముద్రం పాలయ్యాయి. దీంతో కోలుకోలేని విధంగా ఆక్వా రైతులు మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయారు.

వెంటాడుతున్న వైరస్‌లు
ఆక్వాసాగే చేపడుతూ, వైట్‌గట్, ఈహెచ్‌పీ అనే ప్రోటోజోవా తాకిడితో పెరుగుదల ఆగిపోవడంతో పాటు, నిలకడలేని రొయ్యల ధరలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ సీజన్‌లో వరద తాకిడి ఉన్న తీరప్రాంత మండలాల్లో రొయ్యల సాగు గణనీయంగా పడిపోయింది. జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం రొయ్యల ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో రొయ్యల గుంతల్లో చేపలు వదులుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రొయ్యల సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతోనే రొయ్యల ధరలు పెరుగుతున్నాయని రైతులు అంటున్నారు. సాగవుతున్న రొయ్యలకు కూడా వైట్‌ పీకల్, విబ్రియో వంటి వైరస్‌లు ప్రబలడంతో కూడా సాగు వ్యయం బాగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top