ఉపాధ్యాయుల కొరతను తీర్చడంలో భాగంగా ‘పని సర్దుబాటు’ ఆదేశాలను ప్రభుత్వం హడావుడిగా ప్రకటించింది, అయితే ఈ ప్రకటన వెలువడి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల కొరతను తీర్చడంలో భాగంగా ‘పని సర్దుబాటు’ ఆదేశాలను ప్రభుత్వం హడావుడిగా ప్రకటించింది, అయితే ఈ ప్రకటన వెలువడి నెలరోజుల దాటినా జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ఎంఈఓల బాధ్యతారాహిత్యం కారణంగా టీచర్ల మిగులు, ఖాళీల జాబితాను పలుమార్లు పరిశీలించాల్సి రావడంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం..పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి అవసరమున్న పాఠశాలకు పంపే విధంగా సర్దుబాటు చేయాలి.
నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల నివేదికను జిల్లా కేంద్రంలోనే విద్యాశాఖ తయారుచేసి సర్దుబాటు కౌన్సెలింగ్‌ను జిల్లాస్థాయిలో చేపట్టాలి. అయితే ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు సర్దుబాటు ప్రక్రియను మండలపరిధికి కుదించారు. ఈ నేపథ్యంలో టీచర్ల నివేదిక కోసం విద్యాశాఖ ఎంఈఓలపై ఆధారపడింది. మండలస్థాయిలో సర్దుబాటు నివేదికలను ఎంఈఓలు జిల్లా విద్యాశాఖకు పంపాలి. రేషనలైజేషన్, సర్దుబాటుకు సంబంధించిన మార్గదర్శకాలపై ఎంఈఓలకు సరైన అవగాహన లేక టీచర్ల నివేదికను ఇష్టానుసారం తప్పులతడకలతో పంపారు. దీంతో ఆ నివేదికలను పలుమార్లు వెనక్కి పంపాల్సి రావడంతో సర్దుబాటు ప్రక్రియ జాప్యమవుతోందని విద్యాశాఖ చెబుతోంది.
ఇష్టానుసారం ఎంఈఓల నివేదికలు
రేషనలైజేషన్ జీఓ పరిపూర్ణంగా అమలు చేస్తే ఖాళీలున్న అన్ని స్థానాలకు టీచర్లను బదిలీ చేయడానికి వీలులేదు. డీఎస్సీ కోసం ఉంచిన పోస్టులు, ఉద్యోగోన్నతుల కారణంగా ఖాళీ అయిన పోస్టులను మినహాయించి బదిలీ కౌన్సెలింగ్‌కు చూపించాలి. తాజాగా అమలు చేయాల్సిన సర్దుబాటు ప్రక్రియ కోసం రేషనలైజేషన్ జీఓ ఒకవైపు అమలు చేస్తూ మిగులు ఉపాధ్యాయులను మాత్రమే గుర్తించాలి. కానీ సర్దుబాటు అవసరమున్న పాఠశాలలను గుర్తించడంలో రేషనలైజేషన్ జీఓను పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యకు ప్రాధాన్యం ఇచ్చి అధికంగా ఉన్న ప్రతి పాఠశాలకు టీచర్‌ను సర్దుబాటు చేయాలి.
ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం వరకు సర్దుబాటు చేసిన పాఠశాలల్లో పనిచేసి ఆఖరి రోజున ఉపాధ్యాయులు తిరిగి తమ మాతృపాఠశాలలో చేరాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని అమలు చేయకుండా తప్పుడు ఖాళీల జాబితా నివేదికలు పలు మండలాల నుంచి జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. వీటిని సరిదిద్దడానికి వారం రోజులు పట్టినట్లు తెలుస్తోంది. సర్దుబాటు మార్గదర్శకాలపై ఎంఈఓలు అవగాహన కల్పించుకోకపోవడం వల్లనే ఈ జాప్యం అనివార్యమైందని ఉపాధ్యాయ వర్గాలు అరోపిస్తున్నాయి.
జాబితా పరిశీలనలో ఉంది
‘జిల్లాలో టీచర్ల పనిసర్దుబాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎంఈఓల నుంచి వచ్చిన టీచర్ల మిగులు, ఖాళీల జాబితా పరిశీలనలో ఉంది. సర్దుబాటు మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయడానికి వీలుగా ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేస్తాం’.
జిల్లా విద్యాశాఖాధికారి, జి. కృష్ణారావు, విజయనగరం.