దటీస్ బండిరాజు

షార్ట్‌ ఫిలిమ్స్‌తో ఫుల్‌ జోష్‌

దర్శకుడు కావడమే లక్ష్యం

సినిమాలపై ఉన్న పిచ్చి ఓ పల్లెటూరి కుర్రోడిని హైదరాబాద్‌కు పారిపోయేలా చేసింది. డైరెక్టరు అవ్వాలనే కోరికతో స్టూడియోల చుట్టూ తిరిగేలా చేసింది. అవకాశాల కోసం పడరాని పాట్లు పడ్డ ఆ యువకుడు నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు. ఎందరినో ప్రాధేయపడ్డాడు. తనలోని టాలెంట్‌ను చూపిస్తూ ఒక్క అవకాశం కోసం ఎదురు చూశాడు. చివరకు యానిమేషన్‌ వర్క్‌ నేర్చుకుని యాడ్‌ ఫిల్మ్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌పె దృష్టి పెట్టాడు. చిన్న అవకాశాలను అందిపుచ్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇపుడిపుడే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ పలు యాడ్‌ ఫిల్మ్స్‌ను డైరెక్టు చేసే అవకాశాలను దక్కించుకుంటున్నాడు.

కోటవురట్ల(పాయకరావుపేట): మండలంలోని గొట్టివాడకు చెందిన ఆ యువకుడు సర్వసిద్ధి బండిరాజు. నిరుపేద కుటుంబంలో పుట్టిన బండిరాజుకు చిన్నప్పటి నుండి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. గ్రామంలో జరిగే ప్రతి నాటకాన్ని వదిలిపెట్టేవాడుకాదు. పదో తరగతి చదివే సమయంలో నాటికలు రాయడం మొదలెట్టాడు. వీటిని గ్రామంలోని తన నేస్తాలతో నటింపజేసేవాడు. ప్రేమస్పందన, రాజకీయ రాబంధులు, బ్రిటిష్‌ సామ్రాజ్యం వంటి నాటికలు రాసి మెప్పించాడు. బండిరాజుకు పొగడ్తలు వచ్చిపడసాగాయి. దీంతో స్నేహితుల దగ్గర తలా రూపాయి దండుకుని ఓ రోజు హైదరాబాద్‌ పయణమయ్యాడు. అక్కడకు వెళ్లాక గాని సినిమా ప్రపంచం ఏంటో అర్థం కాలేదు. చేతిలో డబ్బులు అయిపోయాయి. ఎవరూ ఆదుకోలేదు. కష్టపడి ఓ యానిమేషన్‌ స్టూడియోలో ఆఫీస్‌బాయ్‌గా చేరాడు. కొంచెంకొంచెంగా యానిమేషన్‌ వర్క్‌ నేర్చుకుంటూ మల్టీమీడియా డిప్లొమా పూర్తి చేశాడు.

‘కృష్ణ’ యానిమేషన్‌తో తొలి అడుగు..
మొదటి అవకాశంగా ‘కృష్ణ’ యానిమేషన్‌ ఫిల్మ్‌కు నాలుగు పార్టులకు పనిచేశాడు. ఆ తర్వాత చోటాభీమ్‌కు 100 ఎపిసోడ్స్‌కు కంపోజర్‌గా పనిచేశాడు. కథలు రాస్తూ గొట్టివాడలో యువకులతో షార్ట్‌ఫిల్మŠస్‌ తీస్తూ గ్రామంలో బండిమాంబ జాతరలో చిన్నతెరపై ప్రదర్శించేవాడు. ఇలా కిడ్నాప్, దుర్గమహిమ, యువకులు, పోటుగాళ్లు, అద్భుతం, యేసే నారక్షకుడు, ఆడపిల్ల, అన్నా చెల్లి ఓ గోపాల్, ఒంటరినే, ఆత్మబలి, కిట్టు వంటి షార్ట్‌ ఫిల్మŠస్‌కు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం వహించి ప్రశంసలు పొందాడు. నాలుగు యాడ్‌ఫిల్మŠస్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తూ ఆడపిల్ల జీవితాన్ని అత్యంత హృద్యంగా చిత్రీకరించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

షార్ట్‌ ఫిలింతో ఓ సందేశం
ఎంతగా అభివృద్ధి చెందినా ఉన్నత శిఖరాలను తాకినా ఆడపిల్లకు అడుగడుగునా ఎదురయ్యే అనుభవాలు, నేర్పిన పాఠాల నుంచి లేచి నిలబడిన ఓ ఆదర్శ యువతి కథే ‘ఆదర్శ ఎం.బి.బి.ఎస్‌’. ప్రస్తుతం ఈ షార్ట్‌ఫిల్మ్‌ బండిరాజుకు మంచి పేరు తెస్తోంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని సందేశాత్మక షార్ట్‌ ఫిల్మŠస్‌ చేస్తానని, సినిమా అవకాశం వస్తే తన లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నాడు. తనలోని టాలెంట్‌కు సాక్షి దిన పత్రిక కారణంగానే ఓ గుర్తింపు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాడు.

చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్రాణం
బండిరాజుకు సినిమాలంటే చాలా పిచ్చి. స్కూల్‌కు ఎగనామం పెట్టి రిలీజ్‌ సినిమాలకు వెళ్లిపోయేవాడు. నాటకాలు రాసి మాతో నటింపజేసేవాడు. అలా నెమ్మదిగా కెమెరాతో షూట్‌ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లాడు. సినిమా దర్శకుడు అవుతాడన్న నమ్మకం ఉంది. – నగేష్, ఉప సర్పంచ్, గొట్టివాడ

‘సాక్షి’ ప్రోత్సహించింది..
నాకు సినిమాలంటే మాటల్లో చెప్పలేను..మా వూరు, నా స్నేహితులు ఎంతో ప్రోత్సహించారు. కష్టపడ్డాను నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం తీసిన ఆదర్శ ఎం.బి.బి.ఎస్‌ మంచి ప్రశంసలు తీసుకొస్తోంది. సాక్షి దినపత్రిక ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కారణం సాక్షి అడుగడుగునా అందించిన తోడ్పాటే. జీవితంలో మరిచిపోలేను. – సర్వసిద్ధి బండిరాజు, షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top