తండ్రికి అప్పిచ్చి.. పిల్లలతో వెట్టిచాకిరీ

Shocking Incident in Tirupati on Children's Day - Sakshi

నలుగురు బాలికలకు ఎనిమిదేళ్లుగా చిత్రహింసలు

బాధితుడి భార్యనూ బలవంతంగా తీసుకెళ్లిన వైనం

బాలల దినోత్సవం రోజున వెలుగులోకి ఘటన

నిందితుడి నుంచి విముక్తి కల్పించాలని వేడుకోలు

తిరుపతి మంగళం: మానవత్వం మరచి ఎనిమిదేళ్లుగా గిరిజన బాలికలతో వెట్టిచాకిరీ చేయించాడు ఓ కసాయి. నలుగురు నిరుపేద బాలికల స్వేదాన్ని పీల్చిపిప్పి చేసి  చిత్రహింసలకు గురిచేశాడు. బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తిరుపతిలో బుధవారం గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రమణనాయక్‌ బాధిత బాలికల గురించి విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం యానాది కాలనీలో నివసిస్తున్న మేకల చెంచయ్యకు నలుగురు కుమార్తెలున్నారు. రామచంద్రాపురం మండలం రాయల చెరువుపేటకు చెందిన ఎం.తిరుమలరెడ్డి వద్ద 10 సంవత్సరాల క్రితం చెంచయ్య రూ.20 వేలు అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో చెంచయ్య కుమార్తెలు మమత (21), కన్యాకుమారి (19) లను తిరుమలరెడ్డి తన ఇంట్లో, బంధువుల ఇంట్లో 8 సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తర్వాత మూడో కుమార్తె (16)ను రాయచోటిలో, నాలుగో కుమార్తె (13)ను హైదరాబాద్‌లోని తన బావమరిది ఇంట్లో పనుల చేయించేందుకు తిరుమలరెడ్డి పంపించాడు.

వేధింపులు తాళలేక పారిపోయి వచ్చిన బాలికలు
అప్పు చెల్లించలేదంటూ తన నలుగురు కూతురులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెంచయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్ర హింసలు భరించలేక వినాయక చవితి సందర్భంగా పారిపోయి తమ వద్దకు వచ్చేశారని తెలిపాడు. దీంతో ఇంటిపైకి వచ్చిన తిరుమలరెడ్డి తన భార్య మెగిలమ్మను బలవంతంగా వెట్టిచాకిరీ కోసం తీసుకెళ్లారని చెంచయ్య వాపోయారు. అప్పు చెల్లించాలని, లేదా కుమార్తెలను పనులకు పంపాలని తిరుమలరెడ్డి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చానని తెలిపాడు. ప్రాణహాని ఉండటంతో పిల్లలను తిరుపతి ఎస్పీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించాడు. తిరుమలరెడ్డి నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకున్నాడు. అలాగే నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెంచయ్య విజ్ఞప్తి చేశాడు. సమావేశంలో ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర నాయక్, కె.మోహన్, హరిశివప్ప, బి.వెంకటరమణ, ఎ.కళావతి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top