breaking news
tribel girl
-
బాధితుడి భార్యనూ బలవంతంగా తీసుకెళ్లిన వైనం
తిరుపతి మంగళం: మానవత్వం మరచి ఎనిమిదేళ్లుగా గిరిజన బాలికలతో వెట్టిచాకిరీ చేయించాడు ఓ కసాయి. నలుగురు నిరుపేద బాలికల స్వేదాన్ని పీల్చిపిప్పి చేసి చిత్రహింసలకు గురిచేశాడు. బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తిరుపతిలో బుధవారం గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రమణనాయక్ బాధిత బాలికల గురించి విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం యానాది కాలనీలో నివసిస్తున్న మేకల చెంచయ్యకు నలుగురు కుమార్తెలున్నారు. రామచంద్రాపురం మండలం రాయల చెరువుపేటకు చెందిన ఎం.తిరుమలరెడ్డి వద్ద 10 సంవత్సరాల క్రితం చెంచయ్య రూ.20 వేలు అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో చెంచయ్య కుమార్తెలు మమత (21), కన్యాకుమారి (19) లను తిరుమలరెడ్డి తన ఇంట్లో, బంధువుల ఇంట్లో 8 సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తర్వాత మూడో కుమార్తె (16)ను రాయచోటిలో, నాలుగో కుమార్తె (13)ను హైదరాబాద్‌లోని తన బావమరిది ఇంట్లో పనుల చేయించేందుకు తిరుమలరెడ్డి పంపించాడు. వేధింపులు తాళలేక పారిపోయి వచ్చిన బాలికలు అప్పు చెల్లించలేదంటూ తన నలుగురు కూతురులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెంచయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్ర హింసలు భరించలేక వినాయక చవితి సందర్భంగా పారిపోయి తమ వద్దకు వచ్చేశారని తెలిపాడు. దీంతో ఇంటిపైకి వచ్చిన తిరుమలరెడ్డి తన భార్య మెగిలమ్మను బలవంతంగా వెట్టిచాకిరీ కోసం తీసుకెళ్లారని చెంచయ్య వాపోయారు. అప్పు చెల్లించాలని, లేదా కుమార్తెలను పనులకు పంపాలని తిరుమలరెడ్డి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చానని తెలిపాడు. ప్రాణహాని ఉండటంతో పిల్లలను తిరుపతి ఎస్పీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించాడు. తిరుమలరెడ్డి నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకున్నాడు. అలాగే నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెంచయ్య విజ్ఞప్తి చేశాడు. సమావేశంలో ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర నాయక్, కె.మోహన్, హరిశివప్ప, బి.వెంకటరమణ, ఎ.కళావతి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్లో చిత్రీకరించి.. చంపేస్తామని బెదిరించారు!
ఆసిఫాబాద్: గిరిజన మైనర్ బాలికను బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కాగజ్‌నగర్ డీఎస్పీ ఎండీ హబీబ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన నిందితులు మాచెర్ల రాజు, సయ్యద్ మతీన్, రౌతు రంజిత్ పథకం ప్రకారం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగజ్‌నగర్‌కు చెందిన మల్లేశ్.. తిర్యాణి మండలానికి చెందిన మహిళలను వ్యవసాయ కూలీ పనులకు తన ఆటోలో తీసుకెళ్లేవాడు. అలా వ్యవసాయ కూలీలతో అతనికి పరిచయం ఏర్పడింది. తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన మైనర్ గిరిజన బాలికతోనూ అతను పరిచయం చేసుకున్నాడు. ఐదు నెలల కిందట మల్లేశ్ తన మిత్రుడు వెంకటేశ్‌తో కలిసి ఆసిఫాబాద్‌కు వచ్చాడు. అక్కడ వారు గిరిజన బాలికను కలుసుకొని.. సమీపంలోని చిన్నరాజూర రోడ్డుకు వెళ్లారు. అదే సమయంలో కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వస్తున్న మాచెర్ల రాజు వారిని గమనించాడు. తన మిత్రులు సయ్యద్ మతీన్, రౌతు రంజిత్‌లతో కలిసి అక్కడికి వెళ్లి.. గిరిజన బాలికతో ఉన్న మల్లేశ్, వెంకటేశ్‌లను బెదిరించారు. వారిపై దాడిచేసి సెల్ఫోన్లు లాక్కున్నారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి విషయం బయటికి చెబితే హతమారుస్తామని బెదిరించారు. 15 రోజుల కిందట ఈ సెల్‌ఫోన్ దృశ్యాలు బయటికి రావడంతో సంఘటన వెలుగుచూసింది. ఈ నెల 9న బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గ్యాంగ్ రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరుపరిచారు.