హ్యాట్రిక్‌ విజయాలు వీరి సొంతం

Seventeen Members are Hatric MLAs In Srikakulam Constituency - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆటలోనైనా.. ఎన్నికల్లో అయినా హ్యాట్రిక్‌ విజయాలు సాధించడం గొప్ప విషయమే. క్రికెట్‌ ఆటలోనే ఎక్కువ హ్యాట్రిక్‌ ప్రస్తావన వస్తుంది. వరుసగా మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్‌ అని బౌలర్‌ను ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధిస్తే.. అంతకన్నా గొప్ప విషయమే. అందరికీ ఇది సాధ్యం కాదు. అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటూ.. వారి మెప్పు పొందిన వారికే ఇలాంటి రికార్డు దక్కుతుంది. ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వారు అరుదుగా ఉంటారు. ఆ ఖ్యాతి దక్కించుకున్నవారు శ్రీకాకుళం జిల్లాలో 17 మంది ఉన్నారు. ఆనాటి తరం నాయకులు గౌతులచ్చన్న, లుకలాపు లక్ష్మణదాసు, పోతుల గున్నయ్య, శిమ్మ జగన్నాథం, తమ్మినేని పాపారావు, కింజరాపు ఎర్రన్నాయుడు, నిమ్మక గోపాలరావులతో పాటు ఈ తరంలో కూడా చాలామంది ఉన్నారు. 

  • రాష్ట్రంలో తొలి మహిళా స్పీకరుగా గుర్తింపు పొందిన కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వరుసగా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో వైఎస్‌ఆర్‌ ప్రభంజనంలో ఓటమి పొందారు. 
  • నరసన్నపేట నియోజకవర్గం నుంచి శిమ్మ జగన్నాథం 1955 నుంచి 1972 వరకూ వరుసగా గెలుపొందారు. 
  • ధర్మాన కృష్ణదాసు 2004, 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం పొంది హ్యాట్రిక్‌ నమోదు చేశారు.
  • శ్రీకాకుళం నియోజకర్గం నుంచి గుండ అప్పలసూర్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు వరుస విజ యాలు సాధించారు. అప్పలసూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకూ వరుస ఎన్నికల్లో విజయం సాధించా రు. 2004 నుంచి ఆయనకు అపజయాలు పలకరిస్తున్నాయి. 
  • ధర్మాన ప్రసాదరావు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. నరసన్నపేట నుంచి 1999లో ప్రత్యర్థి బగ్గు లక్ష్మణరావుపై గెలవగా, 2004, 09 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి గుండ అప్పలసూర్యనారయణపై విజయం సాధించి హ్యాట్రిక్‌  నమోదు చేశారు.
  • పాతపట్నం నియోజకవర్గం నుంచి కలమట మోహనరావు ఐదుసార్లు గెలుపొందారు. 1978లో గెలిచి అనంతరం ఒకసారి ఓటమి పొందారు. తరువాత ఎన్నికల్లో 89, 94, 99, 2004ల్లో వరుసగా విజయం సాధించి ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు.
  • లుకలావు లక్ష్మణదాసు ఐదుసార్లు గెలుపొందగా పాతపట్నం (ద్విసభ్య) నియోజకవర్గం నుంచి 1952, 55, 62ల్లో గెలుపొంది హ్యాట్రిక్‌ నమోదు చేశారు. జిల్లాలో మొదట హ్యాట్రిక్‌ విజయం సాధించింది ఈయనే..
  • ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారాం 1998, 85,ఎన్నికల్లో గెలిచి 89లో ఓటమి పొందారు. 1991 లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావును ఓడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన తమ్మినేని 1994, 99  ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు.
  • పార్వతీపురం ప్రాంతానికి చెందిన పోతుల గున్నయ్య 1952లో చీపురుపల్లి, 55లో పాతపట్నం, 62లో కొత్తూరు, 67లో పాతపట్నం నియోజకవర్గాల నుంచి వరుసగా గెలుపొందారు.
  • కింజరాపు ఎర్రన్నాయుడు 1983 నుంచి 94 వరకూ వరుసగా విజయాలు సాధించారు. 83, 85 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 89లో టీడీపీ టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటిచేసి ఘనవిజయం నమోదు చేశారు.
  • 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో  హరిచ్చంద్రపురం నుంచి అరంగేట్రం చేసిన కింజరాపు అచ్చన్నాయుడు 99, 2004, సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. 
  • ఇచ్ఛాపురం నుంచి ఎంవీ కృష్ణారావు 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 
  • కొత్తూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి నిమ్మక గోపాలరావు నాలుగుసార్లు గెలిచారు. 1972లో రాజకీయంలో ప్రవేశించిన ఆయన 1989, 94, 99 సంవత్సరం ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అంతకు ముందు 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పొందారు.
  • కిమిడి కళా వెంకటరావు కూడా 1983, 85, 89 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. పూర్వపు నగిరికటకం (ప్రస్తుతం ఆమదాలవలస) నియోజకవర్గం నుంచి తమ్మినేని పాపారావు కూడా హ్యాట్రిక్‌ విజయం నమోదు చేశారు. 
  • గౌతు లచ్చన్న సోంపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు వరుసగా విజయం పొందారు.అలాగే ఈయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా నాలుగుసార్లు గెలుపొందారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top