ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు. ఈమేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునసమీక్షించుకునేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. ఉద్యోగులందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచివాలయ ప్రధాన ద్వారం, ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట బైటాయించారు.
హైదరాబాద్ అందరిదని, రాజధానిని వదిలిపోమని నినదించారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం నేతలు మీడియాతో మాట్లాడారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందున నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు ఫోరం చైర్మన్ యు. మురళీకృష్ణ చెప్పారు. వచ్చే నెల 2తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు ప్రకటించారు.