
జీతాల్లేవ్.. ఈ గడ్డే దిక్కు.. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇదే గ్రాసమని చూపుతున్న ఉద్యోగినులు
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమ కుటుంబాలను ఎండబెడుతున్న ప్రైవేట్ ఏజెన్సీల తీరుకు నిరసనగా శుక్రవారం నగరంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇలా వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని, వేతనాలు లేక బతుకులు అస్తవ్యస్తమయ్యాయని ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు నినదించారు. జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ విశాఖ సెక్యూరిటీ గార్డుల యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వీరు జీవీఎంసీ రోడ్డులో ధర్నా నిర్వహించారు. బకాయిల సహా జీతాలు వెంటనే చెల్లించేట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గార్డులు గడ్డి పరకలు పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డుపైకి రావడానికి అనుమతి లేదని పోలీసులు గార్డులను హెచ్చరించారు. లేదంటే అరెస్ట్‌లు చేస్తామని చెప్పడంతో గార్డులు తప్పనిసరి పరిస్ధితిలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో సెక్యూరిటీ గార్డులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
నగరంలో ప్రభుత్వ ఆధీనంలోని కింగ్ జార్జి హాస్పటల్, ప్రభుత్వం విక్టోరియా జనరల్ హాస్పటల్, పభుత్వ మానసిక ఆసుపత్రి, ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రి, చెవి, ముక్కు, గొంతు, వ్యాధుల ఆస్పత్రి విమ్స్, ప్రాంతీయ కంటి ఆసుపత్రులలో 400 మంది సెక్యూరిటీ గార్డులు జై బాలాజీ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ తరపున సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంత బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారని, జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఉండడంతో మరో దారిలేక విధులు బహిష్కరించామని తెలిపారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షుడు సీహెచ్ గురుమూర్తితోపాటు ఎ.గోపి, ఇ.సాగర్, ఐ.శివ తదితరులు పాల్గొన్నారు.