నీటి కేటాయింపుల్లో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీటి కేటాయింపుల్లో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకు జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఆంధ్రరాష్ట్ర రాజధానిగా 1953 నుంచి మూడేళ్ల పాటు కర్నూలు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో రాజధానికి కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మారింది. దీంతో రాజధానిని పోగొట్టుకున్న కర్నూలు జిల్లా అనాథ అయ్యింది. కరువు కాటకాలను బయటపడే అవకాశాన్ని కోల్పోయింది.
ఏటా నీటి వాటాలో కోతే...
రాజధానిని పోగొట్టుకున్న కర్నూలు రైతాంగానికి నీటి వాటాల్లో కోత పెడుతూనే ఉన్నారు. మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు తుంగభద్ర డ్యాంకు డిజైన్ చేశారు. రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన కర్ణాటక, ఆంధ్రరాష్ట్రాల మధ్య జలవివాదాలు మొదలయ్యాయి. వివాదాల పరిష్కారం కోసం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1974 తుంగభద్ర బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని నీటి పంపకాలను చేపట్టాలి.
టీబీ డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న 1.42 లక్షల ఎకరాల సాగు కోసం 24 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా కర్నూలు-కడప (కేసీ కెనాల్) కింద ఉన్న 2.65 లక్షల ఎకరాల కోసం 10 టీఎంసీలు ఇవ్వాలి. అయితే పాలకుల నిర్ణక్ష్యం కారణంగా కేసీ కెనాల్‌కు 4 టీఎంసీలు, తుంగభద్ర దిగువ కాలుకు 9 టీఎంసీల నీరు తక్కువ సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రెండు కాలువల మధ్య సుమారు 1.50 ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. నీటి కేటాయింపులను నమ్ముకుని సాగుచేసిన రైతులకు కన్నీరు మిగులుతోంది.
జలయుద్ధాలు తప్పవేమో..!
రాజధాని విడిపోతుందని తెలిసి ఆనాడు జనం తిరగబడ్డారు. పాలకులపై ఒత్తిడితెచ్చారు. అయినా ప్రయోజనం లేదు. వారు అనుకున్నట్టే రాజధానిని తీసుకెళ్లి రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యా యం జరుగుతోందని జనం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకున్న నాధుడు లేరు. జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఎవరూ నీటి కేటాయింపులపై ఉద్యమించలేదు. వైఎస్సార్సీపీ మాత్రం ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తుండటంతో జలయుద్ధాలు తప్పేట్లు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.