గుట్టుగా గెస్ట్‌లెక్చరర్ల నియామకాలు

Secret Lecturers Recruitment.. - Sakshi

గురుకులాల్లో పాలక పెద్దల అడ్డగోలు రాజకీయం 

నెల్లిమర్ల: జిల్లావ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఏడు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు జూలై నెలలోనే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భవనాలు అందుబాటులో ఉన్న మూడు ప్రాంతాల్లో ఈ నెలలో పాఠశాలలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించిన గెస్ట్‌ టీచర్ల నియామకాలను మాత్రం అడ్డదారిలో చేపట్టారు. అధికార టీడీపీ నేతల ఒత్తిడితో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే నియామకాలు చేపట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న సాలూరులో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే టీచర్లను నియమించారు. సంబంధిత బీసీ సొసైటీ అధికారులు ఈ విషయంలో టీడీపీ నేతలకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలేమైందంటే...
విజయనగరం, కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మండలం కారాడ, కురుపాం ప్రాంతాల్లో ఈ విద్యాసంవత్సరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురంలో బాలికలు, విజయనగరం, కారాడ, కురుపాంలో బాలుర పాఠశాలలు ప్రారంభించాలని సంబంధిత అధికారులు ముందుకొచ్చారు. భవనాలు అందుబాటులో ఉన్న గంట్యాడ, కారాడ, సాలూరు ప్రాంతాల్లో ముందుగా ఈ నెలలోనే పాఠశాలలను ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేశారు. ఈ పాఠశాలల్లో బోధనకు గెస్ట్‌ టీచర్లను నియమించేందుకు ప్రకటన ఇవ్వాలి. కానీ అదేమీ లేకుండానే సంబంధిత అధికారులు గెస్ట్‌ టీచర్ల నియామకాలు చేపట్టేశారు. అధికార టీడీపీ నేతలు చెప్పిన అభ్యర్థుల నుంచి బయోడేటాలు తీసుకుని, వారు సిఫారసు చేసినవారినే ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి.

వందిమంది దరఖాస్తు చేసుకున్నారు
గెస్ట్‌ టీచర్ల కోసం మొత్తం వందమంది అభ్యర్థులు స్వతహాగానే దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారిలో 40మంది మాత్రమే ఇంటర్వూ్యలకు హాజరయ్యారని అంటున్నారు. మూడు పాఠశాలలకు సంబంధించి 20మందిని నియమించినట్లు తెలిపారు. అకడమిక్‌ గైడెన్స్‌ అధికారితో పాటు గురుకులాల జిల్లా కన్వీనరుతో పాటు ఒక సబ్జెక్ట్‌ నిపుణుడు కమిటీగా ఏర్పడి టీచర్లను ఎంపికచేసినట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్ధమని, కేవలం టీడీపీ నేతలు చెప్పిన వారినే నియమించినట్లు భోగట్టా.

పారదర్శకంగానే నియామకాలు
జిల్లాలోని గంట్యాడ, కారాడ, సాలూరులో నెలకొల్పే బీసీ గురుకులాలకు సంబంధించిన గెస్ట్‌ టీచర్ల నియామకాలను పారదర్శకంగానే చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రకటన ఇవ్వలేదు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. గంటకు రూ. 148లు చొప్పున నెలకు గరిష్టంగా రూ 14,800 గౌరవ వేతనంగా అందజేస్తాం. రెగ్యులర్‌ టీచర్లను నియమించగానే వీరిని తొలగిస్తాం.–సత్యారావు, జిల్లా గురుకులాల కన్వీనర్‌    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top