పాలిటెక్నిక్ లెక్చరర్ల కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలులో తప్పులు
నిబంధనలకు విరుద్ధంగా కొందరికి లెవెల్–11 పదోన్నతి
ఏపీపీఎస్సీ అనుమతి లేకుండా సీఏఎస్ అమలుపై సందేహాలు
ఒకేసారి సర్వీసులో చేరినవారికి వేర్వేరు వేతనాలపై ఆందోళన
డైరెక్టరేట్ అధికారుల తప్పులకు లెక్చరర్లు బలి
డైరెక్టరేట్‌ను తప్పుదారి పట్టించిన కమిటీపై కనిపించని చర్యలు
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యా శాఖ చేస్తున్న తప్పులకు ఉద్యోగులు బలవుతున్నారు. డైరెక్టరేట్ అధికారుల తప్పుడు నిర్ణయాల కారణంగా ఆర్థికంగా నష్ట పోతున్నారు. అనుభవజ్ఞులుగా చలామణీ అవుతున్న కొందరు అధికారులు ఏకంగా చట్టాలనే ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. వీరు ఉన్నతాధికారులను సైతం తప్పుదారి పట్టించి, సిబ్బంది ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విద్యా శాఖను నిర్వీర్యం చేస్తుండటం, ఉన్నతాధికారుల ఉదాసీనతతో సాంకేతిక విద్యలో కొందరు అధికారులకు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో సాంకేతిక విద్య డైరెక్టరేట్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ అయిన వారు సర్వీస్ మేటర్స్‌లో నిష్ణాతులుగా చెప్పుకుని, బదిలీ ఉత్తర్వులను నిలిపివేయించుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసింది.
ఇప్పుడు ఇదే అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తూ పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ల ప్రయోజనాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ అధికారులు ఇటీవల పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఇచ్చే ‘కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్’(సీఏఎస్)ను కోల్పోయేలా చేశారు. 2022లో ఇచ్చిన లెవెల్–10 పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే లెవెల్–11 అమలుకు ఆదేశాలిచ్చేశారు. ఏపీపీఎస్సీ అనుమతి లేకుండానే ఈ ప్రక్రియ చేపట్టేశారు. తప్పును గుర్తించిన మూడు నెలలు తర్వాత తీరిగ్గా దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
దీనివల్ల తమకు ఇబ్బందులొస్తాయని భయపడ్డ కొందరు ఈ ఆదేశాలను పక్కనబెట్టగా, మరికొందరు అమలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఒకేసారి సర్విసులో చేరిన పాలిటెక్నిక్ లెక్చరర్ల వేతనాల్లో భారీ వ్యత్యాసం వచ్చింది. ఈ తప్పులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోకపోగా, వీరినే వివిధ కమిటీల్లో వేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టారీతిన సీఏఎస్ అమలు
పాలిటెక్నిక్ లెక్చరర్లు సర్విస్ కమిషన్ ద్వారా లెవల్–9ఏ ఆర్థిక ప్రయోజనాలతో నియమితులవుతారు. ఐదేళ్ల తర్వాత అనుభవం, విద్యార్హతలు ఉన్నవారికి లెవెల్–10కి పదోన్నతి ఇస్తారు. తర్వాత లెవెల్–11 (సీనియర్ లెక్చరర్ స్కేల్)కి పదోన్నతి కల్పిస్తారు. అలా పదోన్నతులిచ్చే పరిస్థితి లేనప్పుడు వారికి ఉన్న సర్వీసుకు అనుగుణంగా ఆర్థి క ప్రయోజనాలు కల్పించాలి. ఇందుకోసం ‘కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్’ను అమలు చేస్తారు. ఈ అధికారం ప్రిన్సిపల్స్‌కు కల్పించారు. 2012–13లో లెక్చరర్లుగా చేరినవారికి ఏఐసీటీఈ పే స్కేల్ 2016 ప్రకారం లెవల్–10 హోదా 2022లోనే అమలు చేశారు. అయితే, అర్హులైనవారిలో కొందరికి ఇప్పటికీ అమలు చేయలేదు.
లెవెల్–11 మాత్రం జీవో నం.10 ప్రకారం తప్పనిసరిగా ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలి. కానీ, అంతర్గత కమిటీని వేసి, దాని సూచనల మేరకు ఈ ఏడాది సెపె్టంబర్‌లో 244 మంది లెక్చరర్లకు లెవెల్–9ఏ నుంచి నేరుగా లెవెల్–11కు పదోన్నతి ఇచ్చారు. ఏపీపీఎస్సీ అనుమతి లేకుండా ఆదేశాలివ్వడంతో కంగుతిన్న లెక్చరర్లు.. లెవెల్–10 అమలు చేయకుండా లెవెల్–11 ఎలా ఇస్తారని డైరెక్టరేట్‌కు భారీగా ఫిర్యాదులు చేశారు. ఇది పెద్ద తప్పు అని విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు నాలుగైదు రోజుల తర్వాత ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. కానీ, ఈలోగానే చాలా కాలేజీల్లో లెవెల్–11 అమల్లోకి తేవడంతో పాటు ఆ స్థాయి వేతనాలు కూడా డ్రా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
తప్పు చేసిన వారిపై చర్యలేవీ?
వివాదాస్పదమైన లెవెల్–11పై తప్పటడుగులు వేసిన డైరెక్టరేట్ ఇప్పుడు ఆ లెక్చరర్లతో పాటు మరికొందరిని కొత్తగా కలిపి 412 మందికి లెవెల్–10 అమలుకు కసరత్తు చేస్తోంది. ఇందులోనూ స్థానిక కాలేజీల ప్రిన్సిపాల్స్ ఇవ్వాల్సిన సీఏఎస్‌పై డైరెక్టరేట్‌లోని కొందరు అధికారులు జోక్యం చేసుకుని వివరాలు అడుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. మూడు నెలలుగా డైరెక్టరేట్ వెబ్‌సైట్‌లో లెవెల్–11 ఆదేశాలు ఉండడంపై ‘సాక్షి’ ప్రతినిధి ఉన్నతాధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఆదేశాల ఆర్డర్‌ను తొలగించారు.
ఈ వ్యవహారంపై సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్)ను వివరణ కోరగా.. లెవల్–11 అమలుకు ఆదేశాలిచ్చింది వాస్తవమేనని, ఆ తర్వాత వాటిని విరమించుకున్నట్టు తెలిపారు. లెవెల్–10ను కాలేజీ ప్రిన్సిపల్స్ అమలు చేస్తారని వివరించారు. అయితే, లెవెల్–10 అమలుపై 2022 తర్వాత ఇప్పుడు డైరెక్టరేట్ జోక్యం చేసుకోవడం, లెవెల్–11కు నిబంధనలను అనుసరించకపోవడం, డైరెక్టరేట్‌ను తప్పుదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


