బిగుస్తున్న ఉచ్చు ! | SE Raja Rao Contract employee criminal case | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు !

Jan 30 2014 1:14 AM | Updated on Sep 15 2018 8:15 PM

గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎస్‌ఈగా పనిచేసి సస్పెండైన రాజారావుపై నలువైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. గుంటూరుతో పాటు

సాక్షి, గుంటూరు :గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎస్‌ఈగా పనిచేసి సస్పెండైన రాజారావుపై నలువైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణ బృందం గుర్తించింది. ఆయనతో పాటు ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులై, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకట సుబ్బారావుపైనా క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్టు (ఆర్ ఆర్ యాక్టు) ఉపయోగించి దుర్వినియోగం జరిగిన నిధుల్ని తిరిగి రాబట్టే ఆలోచనలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది.
 
 గుంటూరులో క్వాలిటీ కంట్రోల్ సీఈ జగన్మోహన్ నేతృత్వంలో పలువురు ఎస్‌ఈలు గుంటూరులోనే మకాం వేసి మూడ్రోజుల పాటు విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఈలు, డీఈలు మొత్తం 90 మందిని పిలిపించి విచారణ బృందం విచారణ చేసింది. మరోవైపు పారిశుధ్య మిషన్ సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.  రాజారావు వద్ద నుంచి తీసుకున్న అడ్వాన్స్ తాలూకూ వివరాలు, నిల్వ సొమ్మును ఏఈలు, డీఈల వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. అయితే ఈ నిధుల కుంభకోణంలో నలుగురైదుగురు డీఈల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరు తీసుకున్న అడ్వాన్స్‌లు, అనుసరించిన రీయింబర్స్ విధానంపై లోతుల్లోకెళ్ళి విచారణ నిర్వహిస్తున్నారు. వీరు కూడా సెల్ఫ్ చెక్కులు వినియోగించారా, నిధుల ఖర్చు వివరాలపైనా ఆరా తీస్తున్నారు. 
 
 వెంకట సుబ్బారావు చేతిలో 
 రాజారావు కీలుబొమ్మగా మారారా?
 నిధుల ఖర్చు వ్యవహారంలో వెంకట సుబ్బారావు చేతిలో రాజారావు కీలుబొమ్మగా మారారా ..ఈ  ప్రశ్నకు ఆర్‌డబ్ల్యుఎస్ సిబ్బంది నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎస్‌ఈగా తనకున్న విశేషాధికారాలను సుబ్బారావు కోసం వినియోగించారని తెలుస్తోంది. ఇరువురికి ఉన్న సత్సంబంధాలతోనే ఇంత పెద్ద మొత్తంలో నిధుల గోల్‌మాల్ జరిగింది. మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్ల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున నిధుల్ని వెంకటసుబ్బారావు సమీకరించుకున్నారు. వెంకట సుబ్బారావు అనతి కాలంలోనే స్థిరాస్తుల కొనుగోలుతో పాటు విలాసవంతమైన జీవితానికి ఆలవాటుపడ్డారు.
 
 నెల్లూరులోనూ వేళ్ళూనుకున్న రాజారావు అవినీతి 
 రాజారావు ఎస్‌ఈగా గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఇంచార్జిగా పనిచేశారు. ఆ సమయంలో అక్కడ నిధుల్ని దారి మళ్ళించి గుంటూరులో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలోని రికార్డులను పరిశీలించి లెక్కలు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సీఈ జగన్మోహన్ నేతృత్వంలో ఎస్‌ఈల బృందం ఫిబ్రవరి మొదటి వారంలో అక్కడకు వెళ్ళనున్నారు. అక్కడ ఎంతమేర నిధుల దుర్వినియోగం జరిగింది? నిధుల బదలాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ చేయనున్నట్లు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సీఈ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. 
 
 రాజారావును కాపాడేందుకు ముఖ్య నేత చేసిన ప్రయత్నాలు విఫలం
 రాజారావును కాపాడేందుకు జిల్లాకు చెంది పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ ముఖ్య నేత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాజారావుపై గత ఏడాది నవంబరులోనే ఓ ప్రాజెక్టు డెరైక్టర్ విచారణ చేసి నివేదిక సమర్పించారు. అయితే అప్పట్లో రాజారావుపై చర్య తీసుకోకుండా కాపాడినా చివరకు సస్పెన్షన్, అవినీతి వ్యవహారాన్ని ఆపలేకపోయారు. రాజారావు అవినీతిలో ఆర్‌డబ్ల్యుఎస్‌లోని ఇరువురు ఉన్నతాధికారులకు  భాగం ఉన్నట్లు సమాచారం. వారిపై లోకాయుక్తలో ఫిర్యాదులు కూడా వున్నాయి.  తన పోస్టును ఖరారు చేసుకునేందుకు రాజారావు ఓ ఉన్నతాధికారికి పెద్ద మొత్తంలో ఇచ్చినట్టు సమాచారం.  రాజారావు అవినీతిని రూఢీ చేస్తూ ఓ ప్రాజెక్టు డెరైక్టరు రెండు నెలల కిందట నివేదిక ఇచ్చినా అప్పట్లోనే సస్పెండ్ చేయకుండా హైదరాబాదులో సరెండర్ చేసి, కొద్ది కాలం సెలవులో వెళ్ళాలని ఇరువురు ఉన్నతాధికారులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రాజారావుకు ఏలూరులో పోస్టింగ్ ఇవ్వాలని భావించగా, కథ అడ్డం తిరిగింది. సస్పెండైన రాజారావును తాము విచారణకు పిలవకున్నా, విచారణ జరిగే ప్రదేశానికి హాజరయ్యారని, ఆయనే వచ్చి తమకు విస్తుగొలిపే విషయాలు వెల్లడించినట్లు విచారణాధికారులు చెప్పడం పరిశీలనాంశం. అయితే రాజారావు క్రిమినల్ కేసును ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement