నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Schools Restart From today - Sakshi

ఎండల దృష్ట్యా 15 వరకు ఒంటిపూట బడులు

సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీకి చర్యలు

నాలుగు రోజులపాటు రాజన్న బడిబాట

వైఎస్సార్‌ అక్షయపాత్రతో విద్యార్థులకు పౌష్టికాహారం

జనవరి 26 నుంచి అమ్మఒడి

సాక్షి, అమరావతి: మళ్లీ బడి గంటలు మోగడానికి వేళైంది. రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నాలుగు రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీన్ని పాఠశాల విద్యా శాఖ ఈసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, పాఠశాలలను రోజంతా కాకుండా ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 15 వరకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నందున రెండు పూటల కార్యక్రమాలను ఒక్కపూటకే సర్దుబాటు చేయాలని సూచించింది. పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 16 ఆదివారం కావడంతో తిరిగి పాఠశాలలు 17 నుంచి యధావిధిగా పూర్తిస్థాయిలో కొనసాగుతాయి. 

అమ్మఒడితో లక్షలాది మందికి మేలు
కాగా.. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెల్లరేషన్‌ కార్డు ఉండి, తమ పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చేసిన ఎన్నికల హామీని అమల్లోకి తేవడానికి కార్యాచరణను కూడా నిర్దేశించారు. జనవరి 26 నుంచి అందించే అమ్మఒడి పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. రాష్ట్రంలో 630 ప్రభుత్వ స్కూళ్లు, 38,589 జిల్లా పరిషత్, మండల పరిషత్‌ స్కూళ్లు, 34 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 164 మోడల్‌ స్కూళ్లు, 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, 2,110 మున్సిపల్‌ స్కూళ్లు, ఇతర ప్రభుత్వ యాజమాన్య, ఆర్థిక సహకార స్కూళ్లు 3,163 ఉండగా, ప్రైవేటు యాజమాన్యంలో 17,021 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో మొత్తం 70,37,478 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 55 శాతం మంది ఉండగా తక్కిన వారంతా ప్రైవేటు స్కూళ్ల విద్యార్ధులే.

అమ్మఒడి పథకంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు మరింత పెరిగనున్నాయి. అదే సమయంలో డ్రాపౌట్లు, బడి బయటి పిల్లల సంఖ్య కూడా తగ్గనుంది. ప్రతి తల్లి తన పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలను చదివించుకునే స్థోమత లేని తల్లిదండ్రులకు ఇది చేయూతగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మౌలిక సదుపాయాల అనంతరం పరిస్థితిని ఫొటోలు తీసి ప్రజలకు ముంగిటకు తీసుకురానున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులతోపాటు అకడమిక్‌ వ్యవహారాలపై నియంత్రణకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. అలాగే జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రతి ప్రైవేటు స్కూలులో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

అపోహలు సరికాదు: వైఎస్సార్‌టీఎఫ్‌
అమ్మఒడి పథకంపై కొందరు అనవసర అపోహలు లేవనెత్తుతున్నారని, ఇది సరికాదని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వి.రెడ్డి శేఖరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద తల్లులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమమని అన్నారు. కాగా, ప్రస్తుతం సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తేలకపో వడంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై సందిగ్ధంలో ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ అయితే మళ్లీ కొత్త ప్రాంతంలో పిల్లలను చేర్పించడం ఇబ్బందిగా మారుతుందని వారంటున్నారు.

తొలి రోజు స్వాగత సంబరం
నేటి నుంచి రాష్ట్రంలో రాజన్న బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలి రోజు ‘స్వాగత సంబరం’ పేరిట కార్యక్రమాలుంటాయి. పాఠశాలలో పండుగ వాతావరణాన్ని కల్పించడం, పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించడం, బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారుచేసి ప్రదర్శించడం చేయాలి. రెండో రోజు విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వడం, అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలి. మూడో రోజు ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. నాలుగో రోజు ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు, తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం, సహపంక్తి భోజనాలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాఠశాల శాఖ అధికారులతో సమీక్ష చేయడంతోపాటు మంగళవారం అన్ని జిల్లాల విద్యాధికారులు, సర్వశిక్ష అభియాన్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ఉత్తమ విద్యా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. వైఎస్సార్‌ అక్షయపాత్ర ద్వారా పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అమ్మఒడి పథకం.. పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమం కాదని, పేద తల్లుల గౌరవానికి ముఖ్యమంత్రి ప్రకటించిన పథకమని తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 26 నుంచి అమలవుతుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే రూపొందించనున్నామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top