సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజే ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న పంట కాలువల పూడిక సమస్యను ఒక రోజులో పరిష్కరించారు. రాజకీయాల్లో సైనిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారు ఈ విశ్రాంత సైనికాధికారి.
సైదాపురం(వెంకటగిరి), న్యూస్‌లైన్: సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజే ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న పంట కాలువల పూడిక సమస్యను ఒక రోజులో పరిష్కరించారు. రాజకీయాల్లో సైనిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారు ఈ విశ్రాంత సైనికాధికారి. సైదాపురానికి చెందిన బండి వెంకటేశ్వర్లురెడ్డి గతంలో సైన్యంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 230 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
శనివారం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టారు. చెరువుకు నీరు అందించే ప్రధాన కాలువ పూడిపోవడంతో నీరు గ్రామంలోకి ప్రవేశించి వీధులు బురదమయం కావడం ఆయన దృష్టికి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండటంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంకటేశ్వర్లురెడ్డి మొదటి ప్రాధాన్యమిచ్చారు. మంగళవారం ప్రొక్లెయిన్ తెప్పించి సుమారు కిలోమీటర్ పొడవున కాలువలో పూడిక తీయించారు. ప్రొక్లెయిన్ వద్దే ఉండి సిబ్బందికి సూచనలిస్తూ సాయంత్రానికి పని పూర్తిచేయించారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లురెడ్డి చెప్పారు.