ఇసుక.. సమస్యలేదిక!

Sand Stock in Visakhapatnam Yards - Sakshi

స్టాక్‌యార్డుల్లో భారీ ఎత్తున గోదావరి, శ్రీకాకుళం ఇసుక నిల్వ

విక్రయానికి సిద్ధంగా 23 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే సరఫరా

కొనుగోలుదారులకు అందుబాటులో ఇసుక నిల్వ కేంద్రాలు

జిల్లాలో మరిన్ని స్టాక్‌యార్డులఏర్పాటుకు అధికారులు కసరత్తు

విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే సరఫరా చేస్తున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. విశాఖ జిల్లా అవసరాల కోసం ఆయా నదుల్లో కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా జోరందుకుంది. ఇక జిల్లాలో మరిన్ని స్టాక్‌ యార్డుల ఏర్పాటు ద్వారా ఇసుకను మరింత చేరువలో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణం): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘ఉచిత ఇసుక’ సాకుతో జరిగిన మాఫియా దోపిడీని నిరోధించి, ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందించాలని, అదే సమయంలో వాల్టా నిబంధనల ప్రకారం నదులను సంరక్షించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రుతుపవనాలు, తుపానుల ప్రభావంతో వర్షాలు అధికంగా కురిశాయి. దీంతో నదులన్నీ వరదతో పొటెత్తాయి. దాదాపు రెండు నెలల పాటు నిండుగా ప్రవహించాయి. గత పదేళ్లలో ఎప్పుడూలేని విధంగా జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకుఆటంకం ఏర్పడింది. తాజాగా బుల్‌బుల్‌ తుపాను గండం తప్పడంతో వరద మళ్లీ వచ్చే అవకాశం కూడా లేదు. నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. విశాఖ అవసరాల కోసం కేటాయించిన గోదావరి నదిలో రెండు రీచ్‌లు, శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రతి రోజూ సగటున 4 వేల నుంచి 5 వేల టన్నుల ఇసుక జిల్లాకు వస్తోంది.

రీచ్‌ల్లో జోరుగా తవ్వకాలు
విశాఖ నగరం, రూరల్‌ ప్రాంతాల్లో భవన నిర్మాణాల కోసం ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌లను ప్రభుత్వం కేటాయించింది. పెదసవలాపురం, యరగాం, చవ్వాకులపేట రీచ్‌లను బల్క్‌ కొనుగోలుదారుల కోసం, గోపాలపెంట, మడపాం రీచ్‌లను రిటైల్‌ అవసరాల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి, కాటవరం రీచ్‌లను బల్క్, రిటైల్‌ వినియోగదారుల కోసం కేటాయించారు.

స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. విశాఖ నగర శివారు ముడసర్లోవ, అగనంపూడితో పాటు రూరల్‌లో నక్కపల్లి, నర్సీపట్నంలో ప్రస్తుతం ఇసుక స్టాక్‌యార్డులు నిర్వహిస్తున్నారు. చోడవరం, అనకాపల్లిలో ఏర్పాటు కోసం స్థలాన్వేషణ ఒకటీ రెండు రోజుల్లో కొలిక్కి రానుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో 8,076  టన్నులు, ముడసర్లోవలో 14,227 టన్నులు, నక్కపల్లిలో 650 టన్నులు, నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా దాదాపు 23 వేల టన్నుల మేర ఇసుక నిల్వ ఉందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యార్డుల్లో ఇప్పటివరకు 69,846 టన్నుల ఇసుక విక్రయాలు జరిగాయి.

అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఒకవైపు భవన నిర్మాణ అవసరాలకు ఇసుకను అందుబాటులో ఉంచుతూనే మరోవైపు ఇసుక అక్రమ రవాణా నిరోధానికి జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. పర్యవేక్షణ కోసం నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జిల్లాకు కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా ఇతర జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్రమార్కులను ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకూ స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పోలీసుల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిండికేట్, మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇసుక ఆక్రమ సరఫరా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. సరఫరా పర్యవేక్షణకు కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికారికి అప్పగించారు.

దూరం బట్టి రవాణా చార్జీలు
స్టాక్‌ యార్డులో ఇసుక కోసం టన్ను రూ.375 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీచ్‌ నుంచి యార్డుకు కిలోమీటరును బట్టి రవాణా చార్జీ నిర్ణయించారు. టన్నుకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేస్తున్నారు. లోడింగ్‌ చార్జీలు టన్నుకు రూ.50 అదనం. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం నుంచి విశాఖలోని ముడసర్లోవ ఇసుక స్టాక్‌ యార్డు వరకూ 115 కిలో మీటర్లు దూరం ఉంది. కిలోమీటరుకు రూ.4.90 చొప్పున టన్నుకు ధర లెక్కిస్తున్నారు. ఈ మేరకు టన్నుకు రూ.975 చొప్పున ధర నిర్ణయించినట్లు గనుల శాఖ సహాయ సంచాలకులు టి.తమ్మినాయుడు చెప్పారు. అలాగే గోదావరి ఇసుక టన్ను ధర రూ.1375 ఉంది. ఈ ప్రకారం ఆన్‌లైన్‌ www.rand.ap.gov.in లో వినియోగదారులు తమ పేరును ఆధార్, మొబైల్‌ నంబరు ద్వారా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్డరు రసీదు రూపంలో ఓఆర్‌ కోడ్‌ సహా మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. గనుల శాఖ పోర్టల్‌ www.minerapgov లో నమోదైన వాహనం ద్వారా ఇసుకను రవాణా చేసుకోవచ్చు. ఈ వాహనం నిర్దేశిత ప్రాంతం చేరేవరకూ ధ్రువీకరణ కోసం ఇ–రవాణా పత్రం అధికారులు స్టాక్‌యార్డు వద్ద ఇస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top