డంపులు.. డబ్బులు | sand business running very hugely in nalgonda district | Sakshi
Sakshi News home page

డంపులు.. డబ్బులు

Dec 15 2013 4:12 AM | Updated on Mar 18 2019 7:55 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక దందా ఇపుడో ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా రెవెన్యూ, పోలీసు అధికారులతో చేతులు కలిపి వందలాది లారీల ఇసుకను తరలిస్తున్నారు.

సాక్షిప్రతినిధి, నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక దందా ఇపుడో ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా రెవెన్యూ, పోలీసు అధికారులతో చేతులు కలిపి వందలాది లారీల ఇసుకను తరలిస్తున్నారు. ఇదే అదునుగా ఇసుక లారీలు, ట్రాక్టర్లను ఆపి వసూళ్లకు తెగబడుతున్న పోకిరీలు పెరిగిపోయారు. రాత్రిపూట కాపుగాసి బండ్లు పట్టిస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తోటలు, రోడ్డు పక్క ఖాళీస్థలాలు ఇసుక డంపులుగా మారాయి. వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా డంపులకు ఇసుక చేర్చి, ఆ తర్వాత లారీలకు ఎత్తి నగరాలకు తరలిస్తున్నారు. శనివారం వేములపల్లి మండలంలో ఒకే చోట 50ట్రాక్టర్ లోడులకు సరిపోయే ఇసుక డంపును స్వాధీనం చేసుకున్నారు.
 
 వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇసుక క్వారీలకు అనుమతి లేదు. జరుగుతున్నదంతా అక్రమ వ్యాపారమే. గ్రామాల్లో స్థానిక అవసరాల పేర ఇసుక తవ్వేసి సరిహద్దులు దాటిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఏకంగా జేసీబీలు పెట్టి మరీ తవ్వుతున్నారు. లారీల్లో నింపి దానికి ఎస్కార్టుగా కొందరు ముందుండి ప్రధాన రహదారుల దాకా కాపలా కాస్తూ వెళుతున్నారు. వేములపల్లి  మండలంలోని పాలేరు వాగు నుంచి ఇసుకను లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఒక్కో లారీకి రూ.20 వేల చొప్పున తీసుకొని రాత్రి వేళ దందా నడుపుతున్నారు. ఉదయం పూట పాలేరు వాగు నుంచి డంపులకు చేరవేసి రాత్రి వేళ లారీలలో తరలిస్తున్నారు. కామేపల్లి, రావులపెంట, సల్కునూరు, బొమ్మకల్లు, భీమనపల్లి, ఆగామోత్కూర్, చిరుమర్తి, కల్వెలపాలెం గ్రామాలతో పాటు మిర్యాలగూడ మండలం తడకమళ్ల నుంచి లారీల కొద్దీ ఇసుక బయటకు తరలిపోతోంది. ఒక్క సల్కునూరు క్రాస్ రోడ్డు వద్దనే తొమ్మిది చోట్ల డంపులు నిర్వహిస్తున్నారు. సల్కునూరు క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాలు రాత్రి వేళ పట్టపగలును తలపించే స్థాయిలో ఇసుక వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
 
 రెవెన్యూ అధికారులకు మామూళ్లు..
 ఇసుక దందా నిర్వాహకులు రెవెన్యూ అధికారుల్లో కొందరిని తమ గుంపులో కలిపేసుకుంటున్నారు. మరికొందరికి మామూళ్లు  ముట్టజెప్పి తమ దందాకు అడ్డుపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక్కో లారీకి కనీసం రూ.1500 ముట్టజెబుతున్నారు. రాత్రి వేళ తరలిస్తున్న ఇసుక లారీలకు సంబంధించి డబ్బులు ఉదయమే అందిస్తున్నారు. కొంతమంది డంప్‌నకు రూ.20 వేల నుంచి 30 వేల రూపాయలు నెలసరి మామూళ్లు అం  దిస్తున్నారు. ట్రాక్టర్లు నడిపేవారు ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.2 వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నారు.
 
 మామూళ్లు ఇవ్వని వారి లారీలను మాత్రమే పట్టుకుంటున్నారన్న ఆరోపణలు రెవెన్యూ శాఖ అధికారులపై ఉన్నాయి. ఇటీవల మిర్యాలగూడ మండలం తడకమళ్లలోని సాగర్ ఎడమ కాలువ వద్ద ఉన్న డంపుల నుంచి వెళుతున్న 9 లారీలను సీజ్ చేశారు. ఇక,  సల్కునూరు వద్ద ఉన్న డంపుల జోలికి వెళ్లని వేములపల్లి రెవెన్యూ అధికారులు శనివారం కామేపల్లి గ్రామానికి వెళ్లి నిల్వ ఉన్న డంపులను సీజ్ చేశారు.
 
 పట్టుకుంటే భారీగా వసూళ్లు..
 పట్టుబడిన లారీల నుంచి కొందరు అధికారులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో లారీకి రూ.30 వేలకు పైగానే వసూలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా రాత్రి వేళలో తిరుగుతూ లారీలు పట్టుకొని డబ్బులు ముడితే వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మిర్యాలగూడ మండల అధికారి ఒకరు  రెండు లారీలు పట్టుకొని  రూ.85 వేలు వసూలు చేసినట్లు సమాచారం.
 
 వేములపల్లి, మిర్యాలగూడ  మండలాల్లో జరుగుతున్న ఇసుక దందాకు సంబంధించిన ఈ ఉదంతాలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో హాలియా వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక నల్లగొండ రూరల్ పోలీసు స్టేషన్ మీదుగానే మునుగోడు రోడ్డు నుంచి జాతీయ రహదారికి చేరుకుంటోంది. నల్లగొండ-నాగార్జునసాగర్ బీటీ రోడ్డు ఇసుక లారీల పుణ్యమాని రూపం కోల్పోతోంది. మునుగోడు, కనగల్ వాగుల్లోనూ ఇసుక తోడేస్తున్నారు. కేవలం ఇసుక వ్యాపారం నడపడానికి కొందరు ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలు కొనుగోలు చేశారంటే ఆశ్చర్యం లేదు. ఇక, మూసీ పరీవాహక ప్రాంతంలోనూ ఇసుక వ్యాపారానికి బ్రేకులు పడలేదు. ఎవరి స్థాయిలో వారికి అదనపు ఆదాయం ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి కళ్లెం వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement