‘ఏరా.. ఏట్లో ఇసుకేమిరా...కావాల్సినప్పుడల్లా డబ్బులు కావాలి అని సతాయిస్తుంటారు. డబ్బులు లేవు..ఏమీ లేవు ఫో..!’
సాక్షి, కడప : ‘ఏరా.. ఏట్లో ఇసుకేమిరా...కావాల్సినప్పుడల్లా డబ్బులు కావాలి అని సతాయిస్తుంటారు. డబ్బులు లేవు..ఏమీ లేవు ఫో..!’
ఇవి గతంలో పల్లెల్లో డబ్బులు అడిగిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మాటలు. ప్రస్తుతం సీన్ మారింది. ఇసుక బంగారమైంది. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎంతలా అంటే.. తవ్వకాలు, రవాణా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారంటే జిల్లాలో ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తవ్వకాలపై దాదాపు మూడేళ్ల్ల కిందట హైకోర్టు నిషేధం విధించింది.
దీంతో అప్పటిదాకా ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక క్వారీలపై అధికారులు నిషేధం విధించారు. తవ్వకాలు జరపకుండా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో జిల్లాలో ఇసుకరవాణా తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇసుక తవ్వకాలపై నిషేధం విధించకమునుపు జ్యోతి, అనిమెల, రాజంపేటతో పాటు ఏడు ఇసుక క్వారీలకు అనుమతి ఉండేది. ప్రభుత్వ రుసుం మేరకు డబ్బులు చెల్లించి ఇసుక తవ్వకాలు కొనసాగేవి. బాడుగతో కలిపి ట్రాక్టర్ ఇసుకకు రూ. 500 వసూలు చేసేవారు. దూరప్రాంతాలైతే బాడుగ పెరిగేది. అయితే నిషేధం తర్వాత ఇసుక బంగారమైంది. ఒక్కసారిగా 5-10రెట్లు పైబడి ఇసుక ధర పెరిగింది.
పస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ. 2,500 నుంచి రూ. 7వేల వరకూ పలుకుతోంది. ఇళ్ల నిర్మాణానికి ఇసుక తప్పనిసరి. ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నవారు ఎంతడబ్బైనా చెల్లించి ఇసుక కొనుగోలు చేయాల్సిందే. ట్రాక్టర్ల యజమానులు చెప్పినంత డబ్బులు చెల్లించి ఇసుక కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన డబ్బుల్లో మొదటగా ట్రాక్టర్ల యజమానులు లబ్ధిపొందుతుంటే..రెండోస్థానంలో పోలీసులు..మూడోస్థానంలో రెవెన్యూ అధికారులు..నాలుగో స్థానంలో మైనింగ్ అధికారులు ఉన్నారు.
దూరాన్నిబట్టి రేటు:
నదీ ప్రాంతం నుంచి పదికిలోమీటర్లలోపు ఒక్కో ట్రాక్టరు ఇసుకకు రూ. 2,500 నుంచి 3వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ పరిధి దాటితే ధర పెరుగుతూ పోతుంది. పోరుమామిళ్లతో పాటు నెల్లూరు, క ర్నూలుకు కూడా ఇసుక రవాణా సాగుతోంది. ట్రాక్టర్లకైతే రూ. 7 -8 వేలు వసూలు చేస్తారు. ఇతర జిల్లాలకు లారీల ద్వారా రవాణా చేస్తారు. లారీల బాడుగే రూ. 15-20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్దవటం, కమలాపురం, జమ్మలమడుగు, చెన్నూరు, బద్వేలు, అట్లూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.
పోస్టింగ్ కోసం తంటాలు:
త్వరలో ఎస్‌ఐల బదిలీలు ఉన్నాయి. ఇసుక రవాణా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం కొంతమంది ఎస్‌ఐలు తీవ్రంగా యత్నిస్తున్నారు. వారికి అనుకూలమైన ప్రజాప్రతినిధులు, రాజకీయనేతల ద్వారా సిఫార్సు చేయించుకుంటున్నారు.
అడ్డొస్తే భౌతిక దాడులకూ సిద్ధం:
ఇసుకరవాణాలో సహకరిస్తే డబ్బులు ఇవ్వడం, కాదంటే దాడులకు దిగడమే మార్గంగా ఇసుకాసురులు భావిస్తున్నారు. గతేడాది కడప సమీపంలోని లింగంపల్లి సమీపంలో తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ జిల్లా అధికారిపై ఇసుకమాఫియా భౌతికదాడికి తెగబడింది. అట్లూరు పరిధిలో అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ కానిస్టేబుల్‌పై మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు.