సంక్షేమాభివృద్ధి పథకాలకు మట్టి డబ్బులు 

Sale of Polavaram soil by APMDC as transparent - Sakshi

పారదర్శకంగా ఏపీఎండీసీ ద్వారా పోలవరం మట్టి అమ్మకం

తొలిదశలో 58.51 లక్షల క్యూబిక్‌ మీటర్లు విక్రయం 

అధిక ధర కోట్‌ చేసే కాంట్రాక్టర్‌కు పనులు 

రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం 

ఐదేళ్లు అడ్డగోలుగా దోచేసిన టీడీపీ నేతలు

సాక్షి, అమరావతి: పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల్లో లభ్యమైన మట్టిని పారదర్శకంగా ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మట్టి మాఫియాకు చెక్‌ పెట్టి ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విక్రయించడం ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.  

తొలిదశ విక్రయాలకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ 
తొలి దశలో తూర్పు గోదావరి జిల్లాలోని గండేపల్లి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తొండంగి, శంఖవరం మండలాలతోపాటు విశాఖ పట్నం జిల్లా కసింకోట మండల పరిధిలోని పోలవరం ఎడమ కాలువ పది రీచ్‌ల్లో 32,79,432 క్యూబిక్‌ మీటర్ల మట్టిని విక్రయిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, నల్లజర్ల, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలాలు, కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, విజయవాడ మండలాల పరిధిలోని ఎనిమిది రీచ్‌ల్లో 25,72,294 క్యూబిక్‌ మీటర్ల మట్టి విక్రయానికి ఏపీఎండీసీ ఇటీవల టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

19న టెండర్లు  ఖరారు
క్యూబిక్‌ మీటర్‌ మట్టి ధర రూ.86 కాగా, గ్రావెల్‌ రేటు రూ.113 చొప్పున  నిర్ణయించారు. టెండర్‌లో పేర్కొన్న ధర కంటే ఎవరు అధికంగా కోట్‌ చేస్తే వారికి మట్టిని విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తుంది. తొలి దశ మట్టి విక్రయ టెండర్లను ఈనెల 19న ఖరారు చేయనున్నారు. 

మట్టిని మింగిన టీడీపీ నేతలు
పోలవరం కాలువ గట్లపై నిల్వ చేసిన మట్టిని టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో పోలవరం మట్టిని దోచేశారు. కొన్ని చోట్ల కాల్వ గట్లపై కొండలను తలపించే రీతిలో నిల్వ చేసిన మట్టి సైతం మాయమైంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మట్టి దోపిడీలో చెలరేగిపోయారు. 

మిగిలింది 12 కోట్ల క్యూబిక్‌ మీటర్లు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి మాఫియాకు చెక్‌ పెట్టింది. పోలవరం మట్టిని ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. జలవనరులు, గనుల శాఖల అధికారులతో పోలవరం కుడి, ఎడమ కాలువ గట్లపై సర్వే చేయించింది. టీడీపీ నేతలు దోచేయగా కాలువ గట్లపై 12 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి నిల్వ ఉన్నట్లు తేలింది. 

- ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం పోలవరం మట్టి విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో జలవనరుల శాఖకు రూ.700 కోట్లు,  గనుల శాఖకు సీనరేజీ కింద రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని లెక్క కడుతున్నారు. 

మట్టి విక్రయం ద్వారా పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లు ఖాళీ కావడంతో సుమారు ఐదు వేల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. దీన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top