కార్మికుల కష్టం స్వాహా!

Salary Allowances For sanitation workers in Anantapur - Sakshi

మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల అలవెన్సుల చెల్లింపుల్లో అక్రమాలు

శ్రమజీవుల సొమ్మును ఇష్టానుసారంగా దోచేసిన ఘనులు

గందరగోళం సృష్టించి సర్దుబాటు పంచాయితీలు

హిందూపురం: వేకువజామునే పరక.. పార చేతబట్టి రోడ్లు ఊడ్చి, మురికి కాలువల్లో చెత్తాచెదారాన్ని నెత్తికెత్తుకుని ప్రజారోగ్యం కోసం శ్రమించే కష్టజీవుల శ్రమ దోపిడీకి గురైంది. శ్రమజీవుల కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...  వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించాలన్న తలంపుతో కనీస వేతనం రూ.18వేలు చెల్లించేలా చట్టం చేశారు. ఈ చట్టం గత ఆగస్టు మాసం నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి వరకూ రూ.12 వేలు ప్రకారం వారికి వేతనాలు అందేవి. పెంచిన వేతనం రూ.6వేలు తొమ్మిది నెలల బకాయిలను ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం చెల్లించింది. ఈ మొత్తంపై కన్నేసిన కొందరు ఉద్యోగులు.. గత పాలకులు అండదండలతో పెత్తనం కట్టబెట్టుకుని కార్మికులపై పనుల పర్యవేక్షణ పేరిట చేస్తున్న అధికారం చెలాయిస్తున్న మేస్త్రీలు చాలా తెలివిగా స్వాహా చేశారు. రూ. లక్షల్లో కార్మికుల సొమ్మును అప్పనంగా దోచేశారు. 

దోపిడీ సాగిందిలా..
హిందూపురం మున్సిపాలిటీ ప్రజారోగ్య విభాగంలో 220 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో రూ. 12 వేలు వేతనం అందేది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని ఒక్కసారిగా రూ.6 వేలు పెంచుతూ రూ.18వేలుకు చేర్చింది.  పెంచిన రూ.6వేలు వేతనాన్ని ఈ ఏడాది జూన్‌లో అరియర్స్‌ రూపంలో 9 నెలల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.54వేలు జమ కావాల్సి ఉంది. అయితే కార్మికుల వేతనాలకు సంబంధించి బిల్లులు చేసే క్లర్క్‌ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చాడు. సుమారు 50 నుంచి 60 మందికి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.72వేలు ప్రకారం జమ అయ్యేటట్లు బిల్లులు చేశాడు. మిగిలిన సగం ఖాతాల్లో కేవలం రూ.18వేలు వేశాడు.  ముగ్గురికి రూ.లక్షల్లో జమచేశాడు. తిరిగి బ్యాంక్‌ ఖాతాల్లో ఇతరుల డబ్బు కూడా జమ అయిందని, వారికి ఇచ్చేయాలని, లేకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయంటూ భయపెట్టి సొమ్ము వెనక్కు తీసుకోవడం, మిగిలిన వారికి సర్దుబాటు చేయడం షరామాములైంది. కావాలనే గందగోళానికి తెరలేపి, కార్మికుల అమాయకత్వంతో ఆడుకున్నారు. ఒక్కొక్కరి ఖాతా నుంచి రూ.9వేలు గుట్టుచప్పుడు కాకుండా నొక్కేశారు.  

లెక్క తేలని రూ.9వేలు
పారిశుద్ధ్య కార్మికులకు పెంచి వేతనం ప్రకారం ఒక్కొక్కరికి రూ. 54 వేలు ఆరియర్స్‌ అందాల్సి ఉంది. అయితే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కార్మికులకు కేవలం రూ.45 వేలు మాత్రమే చెల్లించారు. ఇందులో రూ.9వేలకు లెక్కలు మాయమయ్యాయి. ఈ లెక్కన రూ. లక్షల్లో సొమ్మును అధికారులు స్వాహా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల్లో చాలామంది భార్యభర్తలు, బంధువులు కలిసి ఉంటున్నారు. దీంతో వీరిపై ఆజమాయిషీ చేసే వారు చాలా సులువుగా మోసం చేసి శ్రమజీవుల సొమ్మును అప్పనంగా దోచేశారు. భార్యభర్తలకు రూ.1.80లక్షలు అందాల్సి ఉండగా, ఒకరి ఖాతాలో రూ.72వేలు, ఇంకొకరి ఖాతాలో రూ.18వేలు జమ చేశారు. తర్వాత ఇద్దరినీ పిలిచి నీ సొమ్ము నీ భార్య ఖాతాలో పడిందనో..   పక్క కార్మికుడి ఖాతాలో పడిందనో నమ్మబలికి మిగిలిన రూ.27వేలు తీసివ్వాలంటూ దుప్పటి పంచాయితీలతో సర్దుబాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ అందరూ మిలాఖత్‌ అయినట్లుగా ఆరోపణలున్నాయి.

బకాయిలు ఇప్పించేశాం
కార్మికుల ఆక్యుపేషన్‌ హెల్త్‌ అలవెన్సు జమలో పొరబాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమే. పొరబాటున మరొకరి ఖాతాలో ఈ మొత్తం పడింది. వీటిని శానిటరీ అధికారులు పరిశీలించి సొమ్మును వెనక్కు తీసుకుని మిగిలిన కార్మికులు ఇచ్చేశారు  ఏదైనా అన్యాయం జరిగివుంటే వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.– భవానీప్రసాద్, మున్సిపల్‌ కమిషనర్,హిందూపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top