హోదాకోసం... విజయనగర్జన

sakshi tv special program Special status - Sakshi

అర్థవంతంగా ‘హోదా కోసం ఎందాకైనా’ చర్చా వేదిక

భారీగా హాజరైన వివిధ వర్గాల మేధావులు, విద్యార్థులు

ప్రతి ఒక్కరూ బలంగా వినిపించిన హోదా కాంక్ష

ఇంతవరకూ జరిగిన అన్యాయంపై వెలిబుచ్చిన ఆవేదన

కేంద్ర మంత్రి రాజీనామా చేసి పోరాడాలని డిమాండ్‌

సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం పట్టణంలోని నాయుడు ఫంక్షన్‌ హాల్‌. శనివారం ఉదయం పదిగంటలయింది. ఎక్కడెక్కడినుంచో... విద్యార్థులు... మేధావులు... వివిధ ప్రజా సంఘాల నాయకులు... రాజకీయ ప్రతినిధులు... ఒక్కరొక్కరుగా చేరుకున్నారు. కాసేపట్లోనే హాల్‌ మొత్తం ఆహూతులతో నిండిపోయింది. సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నిండైన సభలో సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ‘హోదాకోసం ఎందాకైనా’ నేతృత్వంలో సాగిన చర్చావేదిక కూల్‌గా మొదలైంది. వాదోపవాదా లు వినిపించారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అని గొంతులన్నీ ముక్త కంఠంతో తేల్చిచెప్పాయి.

 కార్యక్రమంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు సీపీఐ, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకుల్లో బీజేపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు హోదా సాధనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేయటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్వంద్వ వైఖరితో ఆంధ్రులను మోసం చేసిన వైనాన్ని అంతా వివరించారు. ముఖ్యంగా జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రసంగాల్లో హోదా వల్ల కలిగే లాభాలను వివరిస్తూ హోదా కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాట పటిమ కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కేంద్ర మంత్రికి పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి
కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి, రాజపౌరుషం ఉంటే తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. పార్టీ ఫిరాయింపులకు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. బడ్జెట్‌ అధ్యయనం పేరిట ఆయన రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం సరికాదు. దేశంలో అభివృద్ధి చెందిన అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయి.
– పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి,
 ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్‌

ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అనలేదు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ ఏనాడూ హామీ ఇవ్వలేదు. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు కేంద్రం అందిస్తోంది. ఆ విషయాన్ని టీడీపీ నేతలు తొక్కిపెడుతున్నారు.
– పి.అశోక్, బీజేపీ స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా కన్వీనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top