అందరికీ అందుబాటులో ఉంటా

Sakshi Interview With Taneti Vanitha

సాక్షి, కొవ్వూరు: రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తానేటి వనిత గతంలో ఎమ్మెల్యేగా సత్తాచాటారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఐదేళ్లుగా అధికారపార్టీ అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.  

ప్రశ్న : ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? 
వనిత : ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా విశేష స్పందన వస్తోంది.  

ప్రశ్న : మీకు కలిసి వచ్చే అంశాలు ఏమిటీ? 
వనిత : ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. మా తండ్రి జొన్నకూటి బాబాజీరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ప్రజలు విసుగెత్తారు. ఆ పార్టీ ఇక్కడ స్థానికేతరురాలికి టికెట్‌ ఇచ్చింది. ఇవన్నీ నాకు కలిసి వచ్చే అంశాలు.  

ప్రశ్న : గెలుపుపై ధీమాగా ఉన్నారా? 
వనిత :  గెలుపు తథ్యం. నవరత్న పథకాలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. దీనికితోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా మానాన్న పని చేసినా, నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు కొనసాగినా ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు. ప్రజలతో మమేకమయ్యాం. ఏడేళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నా.   ఇవి నా గెలుపునకు దోహదం చేస్తాయి. 

ప్రశ్న : మీ ప్రాధాన్యాంశాలు? 
వనిత : గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మిస్తా. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని వందల పడకలు అప్‌గ్రేడ్‌ చేయిస్తా. అన్ని వైద్యసేవలూ అందుబాటులోకి తెస్తా.  

ప్రశ్న : ఎంత వరకు చదువుకున్నారు?
వనిత : ఎమ్మెస్సీ(జువాలజీ)

ప్రశ్న : మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? 
వనిత :  నా భర్త శ్రీనివాసరావు సహకారం ఎంతో ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సర్దుబాటు చేసుకుంటూ నాకు మద్దతు పలుకుతున్నారు. మా నాన్న బాబాజీరావు, ఇతర కుటుంబ సభ్యులంతా సహకరిస్తున్నారు.

ప్రశ్న : మీ రాజకీయ ప్రస్థానం? 
వనిత : 2009లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందా. 2012 నవంబర్‌లో పదవిని త్రుణప్రాయంగా వదిలా.  వైఎస్సార్‌ సీపీలో చేరా. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఏడేళ్ల నుంచి కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నా. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి బరిలో దిగినా గెలుపు చేజారింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నా. ఈసారి టీడీపీ కోటలో వైఎస్సార్‌ సీపీ పాగా వేయడం ఖాయం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top