
‘‘మనలో లక్ష్మి, పార్వతి, దుర్గ... ఈ అమ్మవార్లు అందరూ ఉన్నారు. అయితే వాళ్లు ఉన్న సంగతి మనం గ్రహించాలి. మనలోని ఆ శక్తిని ఉపయోగించుకుని అనుకున్నది సాధించాలి. అమ్మాయిలు అనుకోవాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ లేదు’’ అని రాశీ ఖన్నా అన్నారు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్న ఈ నార్త్ బ్యూటీ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.
→ ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి ‘రామ్‌లీలా’కి వెళ్లేవాళ్లం. అక్కడ రావణ దహనం చూసేవాళ్లం. చెడు అంతం అవుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. దసరా అంటే చెడు పై మంచి గెలవడం. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచి గెలవాలి.
→ హీరోయిన్ అయిన తర్వాత ఇంతకు ముందులా స్వేచ్ఛగా పబ్లిక్‌లోకి రావడం కుదరదు కాబట్టి, ఇంట్లోనే ఉండి పూజ చేస్తున్నాను. మాకు నార్త్‌లో నవరాత్రికి చిన్న పిల్లలను అమ్మవారిలా భావించి, పూజించడం అలవాటు. చిన్న చిన్న అమ్మాయిలు అమ్మవారిలా డ్రెసప్ అయి, వేరే వాళ్ల ఇంటికి వెళతారు. అక్కడ వాళ్లు ఈ పిల్లలను అమ్మవారిలా భావించి, పూజ చేస్తారు. నా చిన్నప్పుడు నేను అలా వేరేవాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. అలా అలంకరించుకుని వెళ్లడం నాకు ఇప్పటికీ ఓ తీపి గుర్తులా మిగిలి పోయింది. ఈ నవరాత్రికి నా బ్రదర్‌వాళ్లు మా ఇంటికి వచ్చారు. నేను మా ట్రెడిషన్‌ని ఫాలో అయి, నా మేనకోడలిని అమ్మవారిలా అలంకరించి, పూజ చేశాను. అందుకే ఈ నవరాత్రి నాకు స్పెషల్.
→ పూరీ, హల్వా మాకు పండగ స్పెషల్. ఉడకబెట్టిన శెనగలను కూడా ప్రసాదంగా పెడతాం. హల్వా చేయడం కష్టం అంటారు కానీ నాకు చాలా ఈజీ. పండగకి నేను హల్వా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
∙మహిళలు ఒకరినొకరు స పోర్ట్ చేసుకోవాలి. అయితే కొందరు అమ్మాయిలు వేరే అమ్మాయిలను స పోర్ట్ చేయరు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు... బయట కూడా స పోర్ట్ చేయనివాళ్లు ఉన్నారు. చాలామంది ‘స్త్రీవాదం’ అని అమ్మాయిలకు ఏదో న్యాయం చేసేట్లు మాట్లాడతారు. కానీ ‘ఫేక్ ఫెమినిజమ్’ని కూడా చూశాను. అమ్మాయిలే ఇలా ఉంటే.. మగవాళ్లు స పోర్ట్ చేయాలని ఎలా ఆశిస్తాం. మహిళలందరం ఒకరినొకరు స పోర్ట్ చేసుకుని, ఎదగాలి.
→ జీవితంలో ధైర్యంగా ఉండే అమ్మాయిలను, పిరికివాళ్లను చూస్తాం. అయితే పిరికిగా ఉన్నారని తప్పుబట్టను. ఎందుకంటే మనం ఎలా ఉండాలనేది మన ఇంటి పెంపకం కూడా నిర్ణయిస్తుందని నా అభి ప్రాయం. ఒకవేళ వాళ్ల అమ్మ అలా పిరికిగా ఉండి ఉంటారు. ఆమెని చూసి వాళ్లు అలా ఉంటారేమో. కానీ నా జీవితంలో చాలామంది పవర్‌ఫుల్ ఉమెన్ ఉన్నారు. మా అమ్మ, బామ్మ, నా ఫ్రెండ్స్... ఇలా నా చుట్టూ ఉన్నవాళ్లందరూ శక్తిమంతులే. అందుకే నేనూ వాళ్లలా స్ట్రాంగ్ లేడీలా ఉంటున్నా. లక్ష్మి, దుర్గా, పార్వతి... ఈ అమ్మవార్లందరూ మనలోనే ఉన్నారు. అయితే మనం తెలుసుకోగలగాలి. ‘నా వల్ల ఏమీ కాదు’ అని కొందరు ఫిక్స్ అయి పోతారు. మన పవర్‌ని తక్కువ అంచనా వేసుకోకూడదు.
→ 50 ఏళ్ల క్రితం స్త్రీలు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనూ కొందరు స్త్రీలు ఎందరికో ఆదర్శంగా నిలిచే పనులు చేశారు. కానీ ఇప్పుడు అనుకున్నది సాధించే పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అఫ్‌కోర్స్ అమ్మాయిలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వెనక్కి లాగడానికి ప్రయత్నించేవాళ్లు ఉంటారు. వాళ్లని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే.
→ స్కూల్లో ఫంక్షన్స్ కోసం నేను దుర్గా మాతలా అలంకరించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఘాగ్రా వేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, జుట్టు విరబోసుకుని... మొత్తం అలంకరణ అయ్యాక అద్దంలో చూసుకున్నప్పుడు తెలియని ఫీలింగ్ కలిగేది. ఆ గెటప్‌లో ఉన్నప్పుడు పవర్‌ఫుల్‌గా అనిపించేది.
→ సినిమాల్లో అమ్మవారి క్యారెక్టర్ చేయాలని ఉంది. అయితే అమ్మవారి గెటప్ అంటే ఆషామాషీ కాదు. ఆ గెటప్‌లో ఉన్నంతవరకూ నిష్ఠగా ఉండాలి. భక్తితో ఉండాలి. అమ్మవారి క్యారెక్టర్ చేయాలనే నా కల నెరవేరే అవకాశం వస్తే మాత్రం శ్రద్ధాభక్తులతో చేస్తాను.
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనలో మంచి ఉంటే మనకు అదే వస్తుందని నా నమ్మకం. నా లైఫ్‌లో నాకు చాలాసార్లు ఇది అనుభవమైంది. దసరా సందేశంలానే... చెడుపై మంచి గెలవడం అనేది జరిగే తీరుతుంది. నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు ఉన్నప్పుడు న్యాయానికి స్థానం ఉంటుంది.
– డి.జి. భవాని