దశ తిరిగింది !

Sakshi Effect Good Days For Two Villages

సాక్షి ఫోన్‌ ఇన్‌తో రెండు గిరిజన గ్రామాలకు మహర్దశ

గిరిజనుల గోడుకు స్పందించిన జిల్లా యంత్రాంగం 

కనీస సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశం

పశులబంద, జీలుగులోవ గ్రామాలను సందర్శించిన అధికారులు

దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోని ఆ రెండు గ్రామాల దశ ఒక్క ఫోన్‌ కాల్‌తో మారబోతోంది. రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలకు రోడ్డు, విద్యుత్, మంచినీరు సౌకర్యాలు కల్పించాలని వచ్చిన వినతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఇటీవల సాక్షి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో కొంతమంది గిరిజనులు తమ సమస్యలను చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్‌ ఆ రెండు గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రామాలను తహసీల్దార్‌ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు సందర్శించారు. విద్యుత్, తాగునీరు, రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహారాణిపేట,(విశాఖ దక్షిణ): రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు కొనేళ్ల వరకూ రెవెన్యూ రికార్డుల్లో లేవు. దీంతో అభివృద్ధి ఈ ఊర్లవైపు తొంగిచూలేదు. సుమారు మూడేళ్ల క్రితం రెవెన్యూ రికారుల్లో చేర్చినప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది పాలకులు వచ్చినా అభివృద్ధి ఆనవాళ్లు ఇక్కడ కనిపించలేదు. కళ్యాణపులోవకు ఆరు కిలో మీటర్ల దూరంలో సామాలమ్మ కొండల్లో పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు ఉన్నాయి. విద్యుత్‌ సౌకర్యం లేదు. మంచినీరు దొరకదు. కనీసం రోడ్డు కూడా లేదు. ఈ గ్రామాల్లో 18 గిరిజన కుటుంబాలుండగా (కోందు తెగ).. 50 మందికి పైగా జీవిస్తున్నారు. అడవిలో పండే వాటినే తింటూ.. కొండకోనల్లో అడవి జంతువులు, క్రిమికీటకాల మధ్య జీవనం సాగిస్తున్నారు.

ఓటు హక్కులేదు. రేషన్, ఆధార్‌కార్డులకు నోచుకోలేదు. వీరు ఏ మండలంలో ఉన్నారో..ఏ పంచాయతీకి చెందిన గుర్తింపు లేకుండా పోయింది. ఎలాంటి ప్రభుత్వపథకాలు అందడం లేదు.  విద్యుత్‌ సరఫరా లేక చీకట్లో అవస్థలు పడుతున్నారు. కట్టెలను వెలిగించి వచ్చే వెలుతురులో రాత్రి భోజనం చేసి నిద్రలోకి జారుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న జీసీసీ గతంలో ఓ సారి రెండు గ్రామల గిరిజనులకు కిరోసిన్‌ సరఫరా చేసింది. తరువాత ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఓ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో గ్రావిటీ పథకం  ఏర్పాటు చేసి కుళాయి ద్వారా నీరు సరఫరా చేశారు. ప్రస్తుతం అది కూడా పాడైంది. దీంతో గెడ్డలో ఊరే నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కూడా జరగడం లేదు. జీసీసీ కూడా ఈ గ్రామాలవైపు పూర్తిస్థాయిలో కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో సాక్షి నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమలో పాల్గొన్న కొంతమంది గిరిజన సంఘ నాయకులు ఈ గ్రామాల దుస్థితిని చెప్పారు. తక్షణమే స్పందించిన  ఆయన గ్రామాలకు వెళ్లి పరిస్థితిని చూడమని ఆదేశించారు. దీంతో రావికమతం తహసీల్దార్‌ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, విద్యుత్‌ శాఖ అధికారులు పశులబంద, జీలుగులోవ గ్రామాలను సందర్శించారు. విద్యుత్, రోడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మమ్మల్ని ఆదుకోండి..
అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం. కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి నీరు లేదు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా చేయాలి. రోడ్డు వేయాలి.
కొర్రగాసి, పశువులబంద

ఏ మండలంలో ఉన్నాయో?
పశులబండ, జీలుగులో గిరిజన గ్రామాలు ఏ మండలంలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. రావికమతం అని చెబుతున్నా ఆ మండల అధికారులు మా వైపు చూడడం లేదు. ఏమైనా ఆధారం ఉందా అని  అడుతున్నారు. సాక్షి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో మాట్లాడే అవకాశం కలిగింది. తమకు ఎంతో ఆనందం కలిగింది. విద్యుత్, తాగునీరు, రహదారులు లేవని చెప్పాం. కలెక్టర్‌ స్పందించారు. సాక్షికి కృతజ్ఞతలు.
–  కె.గోవిందరావు, మైదాన ప్రాంత గిరిజన సంఘం జిల్లా కన్వీనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top