బీమాపై రైతులకేదీ ధీమా? | Said the farmer's insurance? | Sakshi
Sakshi News home page

బీమాపై రైతులకేదీ ధీమా?

Jul 20 2014 2:29 AM | Updated on Oct 1 2018 2:03 PM

బీమాపై రైతులకేదీ ధీమా? - Sakshi

బీమాపై రైతులకేదీ ధీమా?

పంటల బీమా ఈ ఏడాది ఖరీఫ్‌లో నిరుపయోగం కానుంది. ఒకవైపు బీమా గడువు ముగుస్తోంది. మరోవైపు పంటల సాగు, రుణాల పంపిణీ ముందుకు సాగలేదు.

  •      ప్రీమియం చెల్లించేందుకు పదిరోజులే గడువు
  •      రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల విముఖత
  •      రైతులు నష్టపోయినా పరిహారం లేనట్టే
  •      గడువు నెల రోజులు పొడిగించాలని వినతి
  • నర్సీపట్నం రూరల్: పంటల బీమా ఈ ఏడాది ఖరీఫ్‌లో నిరుపయోగం కానుంది. ఒకవైపు బీమా గడువు ముగుస్తోంది. మరోవైపు పంటల సాగు, రుణాల పంపిణీ ముందుకు సాగలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.27 లక్షల హెక్టార్లలో వరితో పాటు కంది, పెసర, మిరప, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేయాలని లక్ష్యం చేసుకున్నారు.
     
    రైతు పంట నష్టపోతే ఆదుకునేందుకు జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పంటలకు విధించిన గరిష్ట పరిమితిలో 12.5 శాతాన్ని ప్రీమియం గా చెల్లించాలని షరతు విధించింది. దీనిలో 5 శాతం ప్రభుత్వం భరిస్తుం డగా, మిగిలిన దాన్ని రైతే నేరుగా చెల్లించాలి. ప్రీమియం చెల్లించేందుకు జూలై నెలాఖరు వరకు గడువుంది. ఈ ప్రీమియాన్ని రుణం తీసుకున్న రైతు ఖాతా నుంచి మినహాయించేవారు. రుణం తీసుకోని రైతుల నుంచి నేరుగా అధికారులు వసూలు చేసేవారు.  
     
    జిల్లాలో అధిక శాతం రైతులు వారు తీసుకున్న రుణాల నుంచే బీమా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.700 కోట్ల రుణాలివ్వాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని ప్రకటించినా అమలు చేయలేదు. రుణాల రీ షెడ్యూల్ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో బ్యాంకులు ఖరీఫ్ రైతులకు ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు.
     
    వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పూర్తిస్థాయిలో నాట్లు వేయలేదు. ప్రస్తుతం విత్తనాలు వేసి, నారు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీమా ప్రీమియం చెల్లించేందుకు వీల్లేక పోయింది. రైతులు పంటలు సాగు చేశాకే బీమా ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉండటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఖరీఫ్ రైతులకు అన్ని విధాలుగా ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో బీమా చెల్లించేందుకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి మరో పది రోజులే గడువుండటంతో ఏం చేయాలో పాలుపోక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరో నెల రోజులైనా గడువు పొడిగించకపోతే నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement