
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ
►ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్
►భూములను తక్కువ ధరకు కొట్టేయాలని సీఎం మరో స్కెచ్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అత్యధికంగా వేలం పాట పాడి తొలి బిడ్డర్‌గా నిలిచిన సత్యనారాయణ బిల్డర్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ బెదిరిస్తోందని చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేయిస్తుండటం దారుణం అన్నారు. ఈ ఆరోపణలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పోరాటం వల్లే రెండోసారి వేలం జరిగిందని, తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.40 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన రూ.22 కోట్ల చౌక ధరకు సదావర్తి భూములను తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తే.. వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం చేసి అడ్డుకుందన్నారు. కోర్టు సూచనతో రెండవ సారి వేలం నిర్వహిస్తే తిరిగి తక్కువ ధరకు భూములు కొట్టేయాలని చంద్రబాబు వ్యూహం రచించారన్నారు. ఇందులో భాగంగానే వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన శ్రీనివాసులరెడ్డి పక్కకు తప్పుకుని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని విషయాలు తెలుసుకున్నాకే సదావర్తి భూముల వేలం పాటకు వచ్చామని, ఈ భూములు విలువైనవి అని వేలం జరిగాక శ్రీనివాసులరెడ్డి మీడియాకు చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ప్రజలకు తెలిసిపోయిందని కొత్త డ్రామా
చెన్నైలోని సదావర్తి భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద బ్రాహ్మణ విద్యార్థులు విద్యనభ్యసించేందుకు ఉపయోగించాలని రాజా వాసిరెడ్డి వారసులు 1885కు ముందే రాసిచ్చారని ఆర్కే చెప్పారు. వారికి దక్కాల్సిన ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, లోకేశ్‌లు దక్కించుకున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియడంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటోందని కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.