పోటెత్తిన శ్రీశైలం

Rush of devotees in sreesailam temple

మల్లన్న క్షేత్రానికి  భక్తుల రద్దీ

ఆలయ పూజా వేళల్లో మార్పులు

ఉచిత దర్శనానికి 4గంటలు

కర్నూలు  , శ్రీశైలం:  శ్రీశైలమహాక్షేత్రం   ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీశైలం డ్యాం గేట్లను తీయడంతో భక్తుల తాకిడి  పెరిగింది. దీనికి తోడు వారాంతపు  వరుస సెలవుదినాలు కలిసి రావడంతో ఉభయరాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి  శనివారం రాత్రికే శ్రీశైలానికి లక్షమందికి పైగా భక్తులు  చేరుకున్నారు. ఆదివారం ఉదయానికి మరింత పెరగడంతో ఆలయ పుర వీధులు మొదలుకొని ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలు భక్తులతో కిక్కిరిసి పోయాయి.   రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈఓ భరత్‌గుప్త  ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, 3గంటలకు సుప్రభాతం, 4 గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత, శీఘ్ర దర్శన, క్యూలలో వేకువజాము నుంచే నిలుచున్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అభిషేక సేవాకర్తలకు మాత్రం గర్భాలయంలోకి నిర్ణీత సమయంలో అనుమతించారు.  800లకు పైగా అభిషేకాలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి.  

ఉచిత దర్శనానికి నాలుగు గంటలు
శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల  ఉచిత దర్శన క్యూల ద్వారా దర్శించుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టగా, రూ.150 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉచిత ప్రత్యేక దర్శనం క్యూలలో  భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దీంతో పాటు మంచినీరు, పిల్లలకు, వృద్ధులకు బిస్కెట్లు, సాంబారన్నం మొదలైన వాటిని అందజేశారు.    భక్తుల రద్దీని దృష్టిలో ఉం చుకుని అన్నపూర్ణభవన్‌లో ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు నిరంతరంగా భోజన వితరణ జరిగేలా ఈఓ భరత్‌గుప్త ఏర్పాట్లు చేశారు.  కాగా సాక్షిగణపతి, హఠకేశ్వరం తదితరప్రదేశాల వద్ద ట్రాఫిక్‌జామ్‌ తలెత్తింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top