రాయితీ రుణాలేవీ? | Runalevi subsidy? | Sakshi
Sakshi News home page

రాయితీ రుణాలేవీ?

Jul 26 2014 2:31 AM | Updated on Sep 15 2018 2:43 PM

రాయితీ రుణాలేవీ? - Sakshi

రాయితీ రుణాలేవీ?

ఇంటికో ఉద్యోగమంటూ ఊదరగొట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ బీరాలు పలికారు. ఎన్నికలకు ముందు యువతపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు.

  •      గతేడాదీ అరకొరే
  •      ఈ ఏడాది ఆ ఊసే లేదు
  •      లక్ష్యం మేరకు మంజూరుకాని యూనిట్లు
  •      స్వయం ఉపాధి కోల్పోతున్న నిరుద్యోగులు
  • ఇంటికో ఉద్యోగమంటూ ఊదరగొట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ బీరాలు పలికారు. ఎన్నికలకు ముందు యువతపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. తీరా అధికారం చేపట్టాక ఆవిషయాన్నే విస్మరించారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు సంస్థలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కనీసం స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగులకు సాయమందించాల్సిన సర్కారు ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. నిరుద్యోగ యువత జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది.
     
    విశాఖ రూరల్: ఆర్థిక సంవత్సరం సగానికి చేరుకున్నా.. వివిధ శాఖల ద్వారా అందించే రాయితీ రుణాలు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా దక్కలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల రాయితీ నిధులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడం గమనార్హం. అవి వస్తేనే గాని కొత్తవాటికి అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం గతేడాది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాయితీ పెంపుపై గత డిసెంబర్ వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఆ ఏడాది ఎస్సీలకు సంబంధించి 1425 యూనిట్లు లక్ష్యంగా అధికారులు ప్రతిపాదించారు. సబ్సిడీ ఎంతన్న విషయాన్ని తేల్చకపోవడంతో జనవరి వరకు ఒక్కటీ మంజూరు కాలేదు.

    మైనార్టీల విషయంలోనూ అదే పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల నిరుద్యోగుల కోసం 5750 యూనిట్లను లక్ష్యాంగా నిర్దేశించారు. బ్యాంకు రుణం, లబ్ధిదారుని వాటా, సబ్సిడీ ఇలా మొత్తంగా వీటికి రూ.34.49 కోట్లు కేటాయించారు. వీటిలో మంజూరైన యూనిట్లకు సబ్సిడీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రుణ లక్ష్యాలు, మంజూరులో భారీ వ్యత్యాసముంటోంది.
     
    ఈ ఏడాది లేనట్టేనా!

    వాస్తవానికి ఏటా ఏప్రిల్, మేలో యూనిట్ల మంజూరు, నిధుల లక్ష్యం నిర్దేశించి మూడు నెలల్లో రుణాలను మంజూరు చేస్తుంటారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలవుతున్నా.. ఇప్పటి వరకు ఏ శాఖకు రాయితీ రుణ లక్ష్యాలను నిర్దేశించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సబ్సిడీ రుణాలు అందించే పరిస్థితులు లేవని అధికారులు సైతం చెబుతున్నారు. గతేడాదికి సంబంధించిన రుణాల రాయితీ నిధులు మంజూరైతేనే గాని కొత్తవి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

    అయితే రుణాల కోసం నిరుద్యోగులు సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు వారికి ఎటువంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు. యూనిట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు స్వయం ఉపాధిని కల్పించుకోలేకపోతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement