ఎన్టీపీసీ చేతికి ఆర్టీపీపీ?

RTPP Likely To Merge IN NTPC - Sakshi

అప్పులన్నీ ఎన్టీపీసీకే

తుది దశకు ప్రక్రియ!

మొదట్నుంచీ ఆర్టీపీపీ భారమే

యూనిట్‌ ధర రూ.6పైనే

బొగ్గు రవాణా తలకు మించిన భారం

విలీనమైనా ఉద్యోగులు సేఫ్‌ 

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరులోని ఏపీ జెన్‌కోకు చెందిన రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(ఆర్టీపీపీ) జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) చేతుల్లోకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని జెన్‌కో ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆర్టీపీపీకి ఉన్న అప్పు మొత్తాన్ని ఎన్టీపీసీ చెల్లిస్తుందని తెలిపారు. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఈ ప్లాంటు సంస్థకు భారమని భావించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. 210 మెగావాట్ల సామర్థ్యంతో 1994లో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రస్తుతం 1,650 మెగావాట్లకు విస్తరించింది. ఇందులో 600 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆర్టీపీపీలో 1,500 మందికిపైగా శాశ్వత ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌లో మరో 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. విలీనమైతే శాశ్వత ఉద్యోగులు ఎన్టీపీసీలో కొనసాగుతారు.  

విలీనానికి కారణాలివీ 
ఆర్టీపీపీని ఆరంభం నుంచీ నష్టాలే వెంటాడుతున్నాయి. నాలుగు దశల ఈ ప్లాంట్‌కు రూ.5,520.76 కోట్ల అప్పులున్నాయి. దీనికి బొగ్గు ప్రధాన సమస్యగా మారుతోంది. మహానది కోల్‌ ఫీల్డ్‌ (ఎంసీఎల్‌) నుంచి బొగ్గు రవాణా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తాల్చేరు నుంచి కృష్ణపట్నం పోర్టుకు, అక్కడ్నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని ఆర్టీపీపీకి బొగ్గు రవాణా చేయాల్సి వస్తోంది. దీంతో చర వ్యయం విపరీతంగా పెరుగుతోంది. ప్రతీ యూనిట్‌కూ రూ.4.15 చొప్పున చర వ్యయం (వేరియబుల్‌ కాస్ట్‌) చెల్లిస్తున్నారు. దీనికితోడు స్థిర వ్యయం (ఫిక్స్‌డ్‌ కాస్ట్‌) యూనిట్‌కు రూ.1.90 వరకూ ఉంటోంది. రెండూ కలిపి యూనిట్‌ విద్యుత్‌ రూ.6.05 అవుతోంది. ఏపీఈఆర్‌సీ నిబంధనల ప్రకారం తక్కువ ధర ఉన్న విద్యుత్‌నే ప్రోత్సహించాలి. ఈ కారణంగా ఇతర ప్లాంట్లు, పీపీఏలున్న విద్యుత్‌నే తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఉద్యోగుల వేతనాలూ ఇవ్వాలి. వీటికోసం ఆర్టీపీపీ కోసం అదనంగా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్‌ కొనుగోలు చేసి, ప్రజలకు చౌక ధరలకు అందించే యోచనలో ఉంది. ఈ కారణంగా భవిష్యత్‌లోనూ ఆర్టీపీపీ మరింత భారమనే జెన్‌కో భావిస్తోంది. 

ఎన్టీపీసీకి లాభమేంటి?
ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. కేంద్ర సంస్థ కావడం వల్ల బొగ్గు కొరత ఉండదు. అదీగాక ఎన్టీపీసీ థర్మల్‌తోపాటు సౌర విద్యుత్‌నూ ఉత్పత్తి చేస్తోంది. అనేక రాష్ట్రాలకు హైబ్రిడ్‌(సోలార్, థర్మల్‌ కలిపి) విద్యుత్‌ అందిస్తామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కారణంగా ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాల్సి వస్తుంది. ఆర్టీపీపీలో ఉత్పత్తి పెంచితే యూనిట్‌ ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పూర్తిస్థాయి ఉత్పత్తి చేసే వీలుంది. జరిగే ఉత్పత్తిని కూడా వినియోగంలోకి తెచ్చే వెసులుబాటూ ఎన్టీపీసీకి ఉంది. అయితే విలీనంపై విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీపీపీ సిబ్బంది ఉద్యోగాల మాటేంటని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎన్టీపీసీ స్పష్టత ఇవ్వాలని పట్టుపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల సందేహాలపై పూర్తి స్పష్టత ఇచ్చాకే ముందుకెళతామని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఉద్యోగులకు ఢోకా లేదు: శ్రీకాంత్‌
ఆర్టీపీపీ ఎన్టీపీసీ చేతికెళ్లినా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. పైగా వాళ్లందరికీ ఎన్టీపీసీ స్కేల్‌ వర్తిస్తుందన్నారు. ఇప్పుడున్న అప్పంతా ఎన్టీపీసీకే బదలాయిస్తామని, దీనివల్ల జెన్‌కోకు భారం తగ్గుతుందని చెప్పారు. 

ఉద్యోగ సంఘాలతో చర్చించాలి: ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ 
ఆర్టీపీపీ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదించాలని ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ జెన్‌కో విభాగం కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులకు అవసరమైన భద్రత కల్పించాల్సి ఉందన్నారు. తమతో చర్చిస్తే వాస్తవాలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగలమని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top