ఇంటింటా సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కానుక కిట్లను ఉచితంగా పంపిణీ
చింతలపూడి : ఇంటింటా సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కానుక కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి తాలూకాఆఫీస్ కార్యాలయం ఆవరణలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సుజాత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కలెక్టర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. మంత్రి సుజాత మాట్లాడుతూ జిల్లాలో రూ. 25 కోట్లతో తెల్లరేషన్ కార్డుదారులకు ఆరు రకాల సరుకులను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో 39 లక్షల మంది జనాభా ఉంటే 33 లక్షల మందికి నిత్యావసర సరుకులను అందిస్తున్నట్టు తెలిపారు. పండగలోపు కిట్లను లబ్ధిదారులకు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కిట్లు ఎవరికైనా అందకపోతే ఆయా మండలాల తహసిల్దార్ల దృష్టికి తీసుకురావాలని కార్డుదారులకు విజ్ఞప్తి చేశారు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు పాల్గొన్నారు.