కోడి పందేల వెల రూ.2 వేల కోట్లు

Rs 2000 crores Betting for Cock Fights - Sakshi

గత ఏడాదికి ఇది రెట్టింపు

‘బరి’తెగిస్తున్న టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

వారి అండతో కోడి పందేలకు భారీ ఏర్పాట్లు

గతేడాది హైకోర్టు నుంచి ఇక్కట్లు ఎదురైనా బేఖాతర్‌

తోటల్లో నిర్వహణ.. అక్కడే సకల సౌకర్యాలు

ఒక్కో పందెం కోడి ధర రూ.1.50 లక్షలు

విదేశాలతోపాటు పలు రాష్ట్రాల నుంచి పందెంరాయుళ్ల రాక

ఉభయ గోదావరి జిల్లాల్లో హోటళ్లు, రిసార్ట్స్‌ ఫుల్‌

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌ : సంక్రాంతి పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా రాజకీయ అండతో ఈసారి కూడా నిర్వాహకులు మరింతగా ‘బరి’తెగిస్తున్నారు. రూ.రెండు వేల కోట్లకు పైగా ఈ ఏడాది పందేలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఇందుకు ఎంతో ముందు నుంచే వీటికి కసరత్తు జరిగింది. పోలీసులూ చూసీచూడనట్లు ఉండాలని వారికి లోపాయికారిగా సంకేతాలు అందాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీఎత్తున కోడిపందాలను ప్రోత్సహిస్తున్నారు. కాగా, ఎప్పటిలాగే ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఈ పందేలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్‌ వంటి పోటీలు అని చెప్పి బరులు పెద్దఎత్తున సిద్ధంచేశారు. పందేలు సోమవారం నుంచి ప్రారంభమవుతుండడంతో కోళ్ల గ్రేడింగ్‌ పూర్తిచేసి పందేలకు అర్హత కలిగిన పుంజులను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆయా ప్రాంతాలకు తరలించారు. 

ఈసారి రూ.2వేల కోట్లు టార్గెట్‌
కోడి పందేలతో పాటు బరుల పక్కనే పెద్దఎత్తున జూదం జరుగుతుంటుంది. పేకాట, కోతాట, గుండాటల్లో పెద్ద మొత్తాల్లో చేతులు మారుతుంది. ఇలా గతేడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. ఈసారి పెద్దగా పోలీసుల ఆంక్షలు లేకపోవడంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేలు, జూదాన్ని బాగా విస్తరించారు. ప్రధానంగా ఒక్కో జిల్లాలో కనీసం భారీ పందేలు వేసేలా 15 పెద్ద బరులు, చిన్నపాటి పందేలు వేసుకునేలా 600 నుంచి 800 బరులు సిద్ధమయ్యాయి. చిన్నపాటి పందాల్లో కనీసం రూ.5 వేల నుంచి లక్ష వరకు పందెం ఒడ్డుతుంటారు. అదే భారీ పందేల్లో అయితే కనీసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బెట్టింగ్‌ వేస్తుంటారు. దీనికితోడు పుంజులను బరిలో దింపిన వారు తమ పుంజు నెగ్గుతుందని నేరుగా బెట్టింగ్‌ వేస్తే.. చుట్టూ చేరిన వారు పైపందేలు కాస్తుంటారు. ఒక్కో పందెంలో నేరుగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు పందెం వేస్తే దానికి పైపందేలు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు జరుగుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో బరిలో రోజుకు కనీసం 15 కోడి పందేలను వేస్తుంటారు. అదే సంక్రాంతి రోజైతే 24గంటలూ పందేలు వేస్తారు. దీంతో ఒక్కో బరిలో మూడు రోజుల్లో దాదాపు 60 పందేలు వేస్తుంటారు. దీనికితోడు పేకాట, కోతాట, గుండాట ఫలితాలు నిమిషాల్లో తేలిపోతుంటాయి. వాస్తవానికి కోడి పందాల కంటే జూదంలోనే పెద్దఎత్తున మొత్తాలు చేతులు మారుతుంటాయి. ఈ లెక్కన గతేడాది రాష్ట్రంలో దాదాపు రూ.వెయ్యి కోట్లు చేతులు మారితే ఈ ఏడాది రూ.1,500 నుంచి రూ.2 వేల కోట్లు మారుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

గ్రేడింగ్‌ ఇలా..
పందేలకు ఇక ఒకరోజే సమయం ఉండడంతో పెంపకం స్థావరాల్లో కోడి పుంజులకు గ్రేడింగ్‌ పూర్తిచేసి పందెం బరులకు తరలించారు. తొలుత డింకీ పందెం వేస్తారు. అందులో పందెం పుంజు తన ప్రత్యర్థి పుంజుపై నిమిషానికి నాలుగుసార్లు చొప్పున దాడిచేసి వరుసగా రెండు డింకీ పందేలలో ప్రతిభ చూపితే ఆ పుంజు మొదటి శ్రేణి పుంజుగా పరిగణిస్తారు. ఈ రకం పుంజు ధర రూ.1.50 లక్షలు ఉంటుంది. 

సర్కారు గ్రీన్‌సిగ్నల్‌
ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయంగా రాణించాలంటే కోడి పందేలకు అడ్డంకులు చెప్పకూడదని పలు జిల్లాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సర్కారు వీరికి లోపాయికారిగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది కోడి పందాలు అడ్డుకుంటామంటూ నెలరోజుల ముందు నుంచే పోలీసులు హెచ్చరికలు చేయడంతోపాటు ముందస్తు దాడులు, కత్తులు కట్టే వారిపై బైండోవర్‌ కేసులు పెట్టి కట్టడిచేసే ప్రయత్నాలు చేశారు. అయినా, పందేలు ఆగకపోవడంతో పోలీసులు, అధికారులు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. తాజాగా, విజయవాడలో హైకోర్టు కార్యకలాపాలు మొదలవడంతో ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని నిర్వాహకుల్లో టెన్షన్‌ నెలకొంది.

తోటల్లో బరులు.. అక్కడే అన్ని ఏర్పాట్లు
ఇదిలా ఉంటే.. కోడి పందేల నిర్వహణకు మామిడి తోటలు, కొబ్బరి తోటలు, ఇతర పండ్ల తోటలను నిర్వాహకులు లీజుకు తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర ముఖ్యమైన వారి కోసం బరుల వద్దే మద్యం విక్రయాలు ఏర్పాటుచేస్తున్నారు. కోడి పందేల బరులకు ఆనుకుని పేకాట, కోతాట, గుండాట వంటి జూదాల నిర్వహణకు కూడా రంగం సిద్ధమైంది. ఈ జూదాల్లో కేవుల్‌ (నిర్వహణ వాటా) వల్ల పెద్ద మొత్తాల్లో ఆర్థిక లాభం ఉండటంతో వీటి నిర్వహణకు గ్రామ, పట్టణాల్లో తీవ్ర పోటీ నెలకొంది.  

విదేశాల నుంచీ రాక
మరోవైపు.. సంక్రాంతి పండుగ కోసం అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సొంతూళ్లకు వస్తుండగా పందేల్లో పాల్గొనేందుకు వారు ఇప్పటికే స్థానిక బ్యాంకుల్లోని తమ ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేశారు. పురుషులకు తామేమీ తీసిపోమంటూ మహిళలు, యువతులు కూడా పందేలకు వస్తున్నారు. కోనసీమలోని దిండి పరిసర రిసార్ట్స్‌లతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని హోటళ్లు నెలరోజుల కిందటే బుక్‌ అయిపోయాయి. అమరావతి, విజయవాడ, రాయలసీమ ఉత్తరాంధ్రలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాగపూర్, భువనేశ్వర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచీ కూడా పందెం రాయుళ్లు చేరుకుంటున్నారు. ‘పశ్చిమ’లో అయితే పర్యాటక ఏజెంట్లు ప్రైవేటు నివాస గృహాలను కూడా సంప్రదిస్తున్నారు. ఒక మడత మంచం వేస్తే సాధారణ తాటాకు ఇల్లు కూడా స్టార్‌ హోటల్‌ రూమ్‌ ధర పలుకుతుందని ఒక పర్యాటక ఏజెంట్‌ ‘సాక్షి’కి చెప్పారు.

మొక్కుబడిగా దాడులు..
కోడి పందాలకు కేంద్రంగా చెప్పుకునే ఉభయగోదావరి జిల్లాల్లో గడిచిన రెండు రోజులుగా పోలీసులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బరులను ధ్వంసం చేసిన పోలీసులు కోడి పుంజులకు కత్తులు కట్టే వారిపై బైండోవర్‌ కేసులు పెట్టారు. అయితే, రాజకీయ అండదండలున్న వారు పోలీసులకు ఎదురు తిరుగుతున్నారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఈ దాడులేంటని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక పోలీసు అధికారిని నిర్వాహకులే నిలదీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కోనసీమ పుంజులకు అత్యధిక ధర
కోడి పందేల్లో కోనసీమ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి వాతావరణంలో పెరిగిన పుంజులు పందేలలో రాణిస్తాయన్న నమ్మకం ఉంది. పెంపకం, తర్ఫీదు కూడా అదేస్థాయిలో ఉంటుంది. ప్రస్తుత సంక్రాంతికి పందెం రాయుళ్ళు కోనసీమ పుంజులపై అత్యధికంగా నగదు పెట్టారని సమాచారం. ఈసారి కోనసీమ పుంజు ఏకంగా రూ.1.50 లక్షల ధర పలికింది. ఈ ధరకు సుమారు 300లకుపైగా పందెం పుంజులు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లినట్లు తెలిసింది. లక్షా యాభై వేలలోపు ధరలున్న పుంజులు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. 

టీడీపీ నేతల అండదండలతో..
- రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అండదండలతో అనేకచోట్ల బరులు సిద్ధంచేశారు. 
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అనుచరులు 10 ఎకరాలను చదును చేసి బరిని సిద్ధంచేశారు. 
ఇదే జిల్లా గొడవర్రు గ్రామంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అనుచరులు కూడా ఆరు ఎకరాల్లో బరిని ఏర్పాటుచేశారు. 
అలాగే, బాపులపాడు మండలం అంపాపురంలోనూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు బరి ఏర్పాటుచేశారు. అంతేకాక, కొత్తూరు తాడేపల్లి, గుడివాడ, పామర్రు, కైకలూరు, మైలవరం మండలాల్లో అధికార పార్టీ నేతల అండదండలతో బరులు సిద్ధం చేశారు. 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఐదు మండలాల్లో బరులను ఏర్పాటుచేస్తున్నారు. 
ఇక గుంటూరు జిల్లాలో ఆదివారం నుంచే పందేలకు తెరలేపారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో ఒక్కరోజే కోటికి పైగా చేతులు మారినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎంపీ డైరెక్షన్‌లో పెద్దఎత్తున బరులు ఏర్పాటుచేశారు. 
విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మూడేళ్లుగా పందేలు నిర్వహిస్తున్నారు. 
తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప సొంత ఇలాకా పెద్దాపురం నియోజకవర్గంలోనే భారీఎత్తున పందేలకు ఏర్పాట్లుచేశారు. అలాగే, ఆర్థికమంత్రి యనమల ఇలాకా తునిలోని తేటగుంటలో పెద్ద పందేలకు రంగం సిద్ధం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top