ఆఖరి పందేరం

Rs 13.47 Crores For Minister Nara Lokesh Dept Computers - Sakshi

లోకేశ్‌ శాఖలో కంప్యూటర్లకు రూ.13.47 కోట్లు

ప్రజావేదిక ఒక రోజు భోజనాల వ్యయం రూ.3.44 లక్షలు

ఢిల్లీ ధర్మపోరాట దీక్ష సౌకర్యాల వ్యయం రూ.42.80 లక్షలు  

సాక్షి, అమరావతి: ప్రస్తుత ప్రభుత్వం గడువు మరో 12 రోజుల్లో ముగుస్తుందనగా తనకు కావాల్సిన వారి బిల్లులను ఆగమేఘాలపై చెల్లించేస్తోంది. క్లియరెన్స్‌ సేల్‌ మాదిరి కోట్ల నుంచి లక్షల రూపాల బిల్లులను వివిధ శాఖల కార్యదర్శులు వారాంతంలో విడుదల చేశారు. సశేషం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అస్మదీయ సంస్థలు, వ్యక్తుల బిల్లుల చెల్లింపునకు సంబంధిత శాఖలు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుంచి నిధులను విడుదల చేస్తూ శుక్రవారం పలు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ శాఖలో కంప్యూటర్ల ఏర్పాటునకు 13.47 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్షర ఎంటర్‌ప్రైజెస్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ ఐటంలను సరఫరా చేసిందని, ఇందు కోసం 13,47,82,782 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాలు కల్పించినందుకు మరో 1.38 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.

ఇక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అవార్డు గ్రహీతలకు ఒక రోజు ఇచ్చిన డిన్నర్‌కు 3,44,430 రూపాయలను విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్‌. శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఉత్తర్వులో ఈ ఏడాది, గత ఏడాది రిపబ్లిక్‌ డే ఉత్సవాల నిర్వహణ కోసం 2.29 కోట్ల రూపాయలు వ్యయం కాగా ఆ మొత్తాన్ని విడుదల చేశారు. హైకోర్టు భవనాల తనిఖీ కోసం అయిన 7,54,231 రూపాయలను విడుదల చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న వారికి సౌకర్యాల కల్పన కోసం 42,80,477 రూపాయలు వ్యయం కాగా దాన్ని కూడా విడుదల చేశారు. గుర్తింపు కార్డులు ముద్రించినందుకు 4,36,314 రూపాయలు విడుదల చేశారు. ప్రణాళిక శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల రెమ్యూనరేషన్‌ కోసం 50 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top