రెండు జిల్లాలను కలిపే రోడ్డిది. జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రం వెళ్లాలన్నా ఈ రోడ్డుపైనే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యంగల ఈ రోడ్డును విస్తరణపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది.
జహీరాబాద్, న్యూస్‌లైన్: రెండు జిల్లాలను కలిపే రోడ్డిది. జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రం వెళ్లాలన్నా ఈ రోడ్డుపైనే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యంగల ఈ రోడ్డును విస్తరణపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లా ప్రజలంతా రోజుల తరబడి వేడుకోగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంవత్సరం కిందట జహీరాబాద్ నుంచి కర్ణాటక రాష్ర్ట సరి హద్దు వరకు తాండూరు రోడ్డును విస్తరించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన హామీకి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు.
ఈ రోడ్డు మండలంలోని హోతి(కె), మల్‌చల్మ, శేఖాపూర్ గ్రామాల మీదుగా రంగారెడ్డి జిల్లాలోని తాండూరుకు వెళుతుంది. నాపరాతి పరిశ్రమకు పేరుగాంచిన తాండూరుకు జహీరాబాద్ ప్రాంతం నుంచి వెళ్లే వాహనాల సంఖ్య అధికంగానే ఉంటుంది. సింగిల్ రోడ్డు కావడం, రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఎదురెదురుగా వాహనాలు వస్తే రోడ్డు దిగక తప్పని పరిస్థితి. ఇక వర్షాకాలంలో వాహనాలు రోడ్డు కిందకు దిగితే బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది.
అందువల్లే ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు 2012 మే 3వ తేదీన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని మల్‌చల్మ గ్రామానికి వచ్చిన సీఎంకు తాండూరు రోడ్డు దుస్థితిని, ప్రయాణికుల ఇబ్బందిని తెలిపారు. రోడ్డును విస్తరిస్తే తాండూరు వెళ్లే ప్రయాణీకులు, వాహన దారులతో పాటు మండలంలోని మల్‌చల్మ, శేఖాపూర్, హోతి(కె) గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇందుకు స్పందించిన సీఎం కిరణ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 కిలో మీటర్ల మేర రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ.10 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు హామి కూడా ఇచ్చారు. హామి ఇచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ఇప్పటికైనా సీఎం తన మాటను నిలబెట్టుకుని తాండూరు రోడ్డును విస్తరించి తమ ఇక్కట్లు తీర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.