తమకో నీతి... ఇతరులకో నీతా..

Revenue Association Leaders Fires on Devineni Uma - Sakshi

టీడీపీ నేత దేవినేని ఉమాపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చేసిందే నీతిగా.. ప్రస్తుత ప్రభుత్వం చేసేది నీతిలేని పనిగా.. ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను అవమానించేలా తెలుగుదేశం నేతలు మాట్లాడం సరికాదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ చైర్మన్‌ కె.రమేష్‌కుమార్‌ అన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేత బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా ఉద్యోగులుగా సహకరిస్తామని ఆయన చెప్పారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే దేవినేని ఉమా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఏడాదిలోనే అమరావతికి రావాలని కోరితే కట్టుబట్టలతో ఉద్యోగులు తరలివచ్చారని గుర్తుచేశారు. రాజధాని మారినా, రాష్ట్రాలు విడిపోయినా మొదట నష్టపోయేది ఉద్యోగులేనన్నారు. ఉద్యోగ సంఘాలను రాజకీయ ఉచ్చులోనికి లాగొద్దని హితవు పలికారు. సమావేశంలో ఏపీ అమరావతి జేఏసీ కో చైర్మన్‌ కృష్ణమోహన్, జనరల్‌ సెక్రటరీ వెంకట రాజేష్, జిల్లా కార్యదర్శి ప్రమోద్‌ కుమార్, లేబర్‌ డిపార్టుమెంటు రాష్ట్ర అధ్యక్షులు రాజేష్, డ్రైవర్‌ సంఘ జిల్లా అధ్యక్షులు నారాయణ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top