పశ్చిమంలో ఓట్ల తొలగింపు కలకలం!

 Removal Of Votes In The West Of Vijayawada - Sakshi

37వ డివిజన్‌లో మైనార్టీల ఓట్లు గల్లంతు

రెండు వేలకు పైగా ఓట్లు పోయినట్లు స్థానికుల ఆరోపణ

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే టార్గెట్‌ !

సాక్షి, విజయవాడ: రానున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా తిరిగి అధికారాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతుందని పలువురు మండి పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన ప్రాంతం కావటంతో అధికార పార్టీ పెద్దలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికల్లో ఏదో విధంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ అనుకూలంగా ఉన్న ప్రాంతాలను టార్గెట్‌ చేశారు.

నియోజకవర్గంలో ఫారం–7 ద్వారా కొంతమంది వైఎస్సార్‌ ఓట్ల తొలగింపుకు కుట్రలు చేస్తే గత నాలుగేళ్లగా ఈప్రాంతంలో వైఎస్సార్‌ సీపీ అనుకూల ప్రాంతాలంటూ కొన్నింటిని ఎంపిక చేసుకొని అధికారపార్టీ దానిపై దృష్టి సారించింది. పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు కసరత్తు  చేశారు. అయితే చాలా మందికి తమ ఓట్లు పోయిన సంగతి తెలియకపోవటంతో ఇప్పుడిప్పుడే బాధితులు బయట పడుతున్నారు.

ఐటీ గ్రిడ్స్‌ వల్లే..!
తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీ గ్రిడ్‌ సంస్థ ద్వారానే మా ఓట్లు గల్లంతయ్యాయంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. తమ ఇంటికి వచ్చి పెన్షన్‌ వస్తుందా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటూ అన్ని వివరాలను తీసుకొని వెళ్లి తీరా ఓట్ల తొలగింపు చేశారంటూ 37వ డివిజన్‌కు చెందిన పలువురు మండిపడుతున్నారు.

ఇప్పటి వరకూ తమ ఓట్లు ఎలా పోయాయో తెలియని బాధితులు తాజాగా రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఐటీగ్రిడ్‌ సంస్థ లీలలు, టీడీపీ నేతలు ప్రకటనలతో చాలా మందికి తమ ఓట్లు తొలగింపు వారి పుణ్యమేనని అర్ధమైందంటూ పలువురు చెబుతున్నారు.

కొండ ప్రాంతాల్లో అధికం ...
కొండ ప్రాంతాల్లో అధికంగా ఓట్లు గల్లంతైనట్లు ఆయా ప్రాంతాల్లోని నాయకులు చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లోని నివాసితులు తమ ఓట్లును ఎప్పటికప్పుడు పరిశీలించటం చేతకాకపోవటం, నిత్యం కూలి పనులకు వెళ్లేవారు కావటంతో తమ ఓటు ఉన్నది, లేనిది వారు తెలుసుకోలేకపోతున్నారని నాయకులు చెబుతున్నారు. 

ప్రధానంగా 37వ డివిజన్‌లోని కొండ ప్రాంతంలోనూ చాలా వరకూ ఓట్లు గల్లంతయ్యాయి. అలాగే డివిజన్‌లోని మైనార్టీలకు సంబంధించిన ఓట్లు కనపడటం లేదని ఆయా బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top