ఎర్రచందనం కూలీలు తిరగబడడం వల్లే ఎన్‌కౌంటర్ చేసినట్లు టాస్క్‌ఫోర్సు డీఐజీ కాంతారావు తెలిపారు.
ఎర్రచందనం కూలీలు తిరగబడడం వల్లే ఎన్‌కౌంటర్ చేసినట్లు టాస్క్‌ఫోర్సు డీఐజీ కాంతారావు తెలిపారు. సోమవారం సాయంత్రం 150 మంది వరకు ఎర్రకూలీలు శేషాచల అడవుల్లోకి వచ్చారన్న పక్కా సమాచారం టాస్క్‌ఫోర్సుకు అందడంతో 24 మందితో కూడిన రెండు బృందాలు ఆయుధాలతో కూంబింగ్‌కు వెళ్లాయని చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు వంద మంది కూలీలు ఎర్రచందనం దుంగలతో కొండ నుంచి దిగుతూ టాస్క్‌ఫోర్సుకు ఎదురుపడ్డారన్నారు.
‘‘మామూలుగా బెదిరిస్తే పారిపోతారని ఎర్రచందనం కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. టాస్క్‌ఫోర్స్ గట్టిగా నిలబడింది. ఇద్దరు ముగ్గురు సిబ్బంది ఉంటే బెదిరించి చంపేవారు. గతంలోనూ అటవీశాఖ అధికారులపై ఎర్రదొంగలు తెగబడి పొట్టన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లొంగిపోవాలని హెచ్చరికలు జారీచేసి గాలిలోకి కాల్పులు జరిపారు. అప్పటికీ వారు దాడులు కొనసాగించడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షనార్థం కాల్పులు జరిపారు’’ అని ఆయన పేర్కొన్నారు.