880 మద్యం దుకాణాల తగ్గింపు

Reduction of 880 liquor stores - Sakshi

అక్టోబర్‌ నుంచి రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ మద్యం దుకాణాలే!

దశలవారీ మద్య నిషేధానికి శ్రీకారం

వీటి ద్వారా 15 వేల ఉద్యోగాల కల్పనకు నిర్ణయం

కొత్త మద్యం విధానంపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబర్‌ నుంచి అమలుకానున్న కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో 880 తగ్గించి 3,500 మద్యం షాపుల్ని నిర్వహించాలని నిర్ణయించారు. దశల వారీగా మద్య నిషేధం అమల్లో భాగంగా మొదటి విడతలో 20 శాతం దుకాణాల్ని తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 మద్యం షాపులున్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు.

సెప్టెంబర్‌తో ఈ షాపులకు ఇచ్చిన లైసెన్సు రెన్యువల్‌ గడువు ముగుస్తుంది. అక్టోబర్‌ నుంచి అమల్లోకి తెచ్చే నూతన మద్యం పాలసీలో తగ్గించిన మేరకు 3,500 మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించేందుకు కసరత్తు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేతిలో దుకాణాలుండటం వల్ల మద్య నియంత్రణకు మార్గం సులువవుతుందని, నిబంధనల ఉల్లంఘనలు కూడా ఉండవన్నారు. అక్టోబర్‌ నాటికి రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు కూడా కనిపించకూడదని సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు, గుడికి, బడికి దగ్గర లేకుండా చూడాలన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మద్యం షాపుల్ని నిర్వహించాలని, మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. 

కాంట్రాక్టు విధానంలో కొత్తగా 15 వేల ఉద్యోగాలు
ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా కాంట్రాక్టు విధానంలో కొత్తగా 15 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మద్యం దుకాణంలో సూపర్‌వైజర్, సేల్స్‌మెన్‌ పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు వివరించారు. పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లతో పాటు స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన కచ్చితంగా అమలు చేయాలనే ప్రభుత్వ ప్రాధాన్యతను సీఎం అధికారులకు సూచించారు. సీఎం సమీక్షలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ తదితరులున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top