ఎర్రచందన కలకలం

ఎర్రచందన కలకలం - Sakshi


 గుంటూరు రూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాదారులు అధికారులకు ఏమాత్రం అనుమానాలు రాకుండా తమ పని చక్కబెట్టుకుంటున్నారు. ఇది మామిడికాయల సీజన్ కావడంతో మామిడికాయల లోడు మాటున ఎర్రచందనం దుంగలను తరలించేందుకు అక్రమార్కులు అనువైన మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

 శనివారం ఉదయం పది గంటల సమయంలో పొన్నూరు వైపు మామిడికాయల లోడుతో వెళుతున్న టాటా ఏస్ గుంటూరు రూరల్ మండలం బుడంపా డు గ్రామ శివారులో ఇంజినీరింగ్ కాలేజీ వద్ద లారీని ఓవర్‌టేక్ చేయిబోయి బోల్తాపడడంతో ఎర్రచందనం అక్ర మ రవాణా గుట్టు బయటపడింది. ఈ వాహనంలో మామిడికాయలు రవాణా అవుతున్నట్లుగా పైకి కనిపిస్తున్నప్పటికీ వాటి అడుగున 22 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నా రు. దీంతో టాటా ఏస్  డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో హైవే పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

 

 వెంటనే సమాచారాన్ని పోలీసు, అటవీ అధికారులకు తెలియజేశారు. ఫారెస్టు రేంజ్ అధికారి (గుంటూరు) కె.రామకొండారెడ్డి, అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు, రూరల్ సీఐ వై.శ్రీనివాసరావులు తమ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎర్రచందనం దుంగల విలువ రూ. నాలుగు లక్షల వరకు ఉంటుందని ఫారెస్టు రేంజ్ అధికారి తెలిపారు. ఇవి మూడో రకం ఎర్రచందనంగా గుర్తించారు. వాహనాన్ని, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తునకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. టాటా ఏస్‌లో లభ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనానికి నంబర్ ఏపీ07 టీఈ 0939 ప్లేటు ఉంది. ఈ నంబర్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 టాటా ఏస్ పొన్నూరు ఆటోస్టాండ్‌కు చెందిందిగా గుర్తిం చారు. పొన్నూరుకు చెందిన ఆటోడ్రైవర్ చందు శ్రీనివాస్ నిన్ననే చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన పిట్టు గోపిరెడ్డి అనే వ్యక్తికి ఈ వాహనాన్ని విక్రయించినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. గత మూడు రోజుల్లో ఈ వాహనం తణుకు, వేంపాడు, కలపర్రు టోల్‌గేట్‌ల వద్ద కట్టిన టోల్‌ప్లాజా బిల్లులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నుంచి నగర శివారు ప్రాంతాల్లో కలిసి చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేస్తామని ఫారెస్టు రేంజ్ అధికారి రామకొండారెడ్డి తెలిపారు.

 

 

 గుంటూరు జిల్లా కేంద్రంగా...

 ఎర్రచందనం దుంగలను నెల్లూరు, కడప, గిద్దలూరు, కర్నూలు అడవుల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీ వల కాలంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేసిన సమయంలో స్మగ్లర్లు ఇద్దరు సిబ్బందిని హతమార్చిన విషయం విదితమే. ఫారెస్ట్, పోలీస్ అధికారుల నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు వీలులేకపోవడంతో గుంటూరు జిల్లాను కేంద్రంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మొక్కుబడిగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండడం వల్లే అక్రమార్కులకు అడ్డులేకుండా పోయిందనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం దుంగలను అక్రమంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలు, ఇన్నోవా, నీళ్ల ట్యాంకర్, స్కార్పియో, అంబులెన్స్ వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

 

 గత ఆరేళ్లలో పట్టుకున్న ఎర్రచందనం వివరాలు..

 జిల్లాలో గత ఆరేళ్లలో వివిధ ప్రాంతాల్లో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్న వివరాలు.. 2008 జనవరి 28న పొన్నూరు రోడ్డు నుంచి తెనాలి వైపు వెళుతున్న లారీలో 264 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఆరు టన్నుల 561 కేజీల బరువు ఉన్న వీటి విలువ రూ.10.36 లక్షలు.  

 

 అదే ఏడాది నవంబర్ 10న పేరేచర్ల బ్రిడ్జి వద్ద ఓ లారీలో రూ. 7.40లక్షల విలువైన 179 దుంగలు, 2010 మార్చి 15న యడ్లపాడు వద్ద ఓ లారీలో రూ. 2.69 లక్షల విలువైన 104 దుంగలు. నవంబర్ 17న గామాలపాడు వద్ద లారీలో రూ.5.50 లక్షల విలువైన 120 దుంగలు, 2011 ఆగస్టు 3న బాపట్ల- చీరాల మధ్య ఆగి ఉన్న లారీలో రూ. 13.50 లక్షల విలువైన 244 దుంగలు, 2013 జూలై 29న కిష్కిందపాలెం వద్ద లారీలో రూ.9.29 లక్షల విలువైన 230 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top