తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్ | Red cross Blood storage records check by the collector | Sakshi
Sakshi News home page

తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్

Nov 8 2013 3:33 AM | Updated on Mar 21 2019 8:29 PM

‘లక్షలు పోసి యంత్రాలు ఏర్పాటు చేస్తే నిరుపయోగంగా వదిలేస్తారా.. పొరపాట్లకు పాల్పడితే రిటైరైనా చర్యలు తప్పవంటూ కలెక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు.

 ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ‘లక్షలు పోసి యంత్రాలు ఏర్పాటు చేస్తే నిరుపయోగంగా వదిలేస్తారా.. పొరపాట్లకు పాల్పడితే రిటైరైనా చర్యలు తప్పవంటూ కలెక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఆత్మకూరులో గురువారం కలెక్టర్ శ్రీకాంత్ విస్తృతంగా పర్యటించారు. తొలుత ప్రభుత్వాసుపత్రిలోని రెడ్‌క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రాన్ని, రికార్డులు, రక్తనిల్వ కేంద్రం పనితీరును తనిఖీ చేశారు.

అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. ఫొటోథెరపీ యంత్రం, వార్మింగ్ యంత్రం నిరుపయోగంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని ఎందుకు ఉపయోగించడంలేదని డీఎంహెచ్‌ఓ, ఏరియా వైద్యశాల వైద్యాధికారిని ప్రశ్నించారు. శిక్షణ పొందిన సిబ్బంది లేరని, అందువల్ల ఉపయోగించడంలేదని వారు సమాధానం ఇవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 సిబ్బంది లేరని ఏడాది నుంచి నిరుపయోగంగా వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు. శిక్షణ ఇచ్చే బాధ్యత ఎవరిదని డీఎంహెచ్‌ఓను ప్రశ్నించగా ఈ బాధ్యత పీఓడీటీదని చెప్పారు. వీటిని అప్పటి పీఓడీటీ సాగర్ ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ఆయన పింఛన్‌లో కోత విధించాలని ఆదేశించారు. శిక్షణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సోమవారం సాయంత్రానికి తమకు పంపాలని ఆదేశించారు. అనంతరం క్రిస్టియన్‌పేట, ఒందూరుగుంట ప్రాం తాల్లో ఆయన పర్యటించారు.  
 
 మీరు ఇంజనీర్లేనా..
 మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా తాగునీటి పథకం, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.65 కోట్లతో పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయని పబ్లిక్‌హెల్త్ అధికారులు వివరించారు. ఆ పథకం పూర్తయితే ప్రజలకు రోజుకు ఎన్నిగంటలు నీరిస్తారని ప్రశ్నించారు. రోజుకోసారి మాత్రమే ఇస్తామని వారు కలెక్టర్‌కు వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు 24 గంటలు నీరివ్వలేరా అంటూ ప్రశ్నించారు. కొన్ని లెక్కలు అడుగగా వారు నీళ్లు నమిలారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ లెక్కలు చెప్పలేకపోతున్నారు.. మీరేం ఇంజనీర్లంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  డీఎంహెచ్‌ఓను ఆత్మకూరులోనే ఉండి దోమలు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  
 
 మినరల్ వాటర్ సీసా
 వెనకబాటుతనానికి గుర్తు
 కలెక్టర్ మున్సిపల్ కార్యాలయానికి రావడంతోనే సిబ్బంది మినరల్ వాట ర్ సీసా తెచ్చి టేబుల్‌పై పెట్టారు. దాని ని చూడటంతోనే ఆయన స్పందిస్తూ ప్రజలకు సరఫరా చేసే నీరు శుద్ధి చేయరా అంటూ ప్రశ్నించారు. మినరల్ వాటర్ సీసా వెనుకబాటు తనానికి గుర్తు అని సుతిమెత్తగా మందలించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కోదండరామిరెడ్డి, తహశీల్దార్ బీకే వెంకటేశులు, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement