
సాక్షి, న్యూఢిల్లీ: ఎగుమతుల కోసం అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై అతిగా ఆధారపడటం మంచిది కాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించింది. మొత్తం 23 సిఫార్సులు చేసింది.
కమిటీ చేసిన సిఫార్సులు ఇవే..
- తోటల పెంపకానికి కూడా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడం
- జీఎస్టీని పకడ్బందీగా అమలు చేయడం
- మధ్య, చిన్నతరహా పరిశ్రమల నుంచి సానుకూల ఎగుమతులను ప్రోత్సహించడం
- పారిశ్రామిక రంగం నుంచి ఎగుమతులను ప్రోత్సహించడం.
జాప్యం పట్ల అసంతృప్తి
అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన ఈ కమిటీ దేశంలో పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడంలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రోత్సాహానికి కేంద్రం తగినన్ని నిధులను కేటాయించనందున ఆ శాఖకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు గండిపడుతోందని అభిప్రాయపడింది. ఎగుమతుల్లో ఒక క్రమ పద్ధతిని అనుసరించడం, నిర్దిష్ట ఆలోచనలతో ప్రయత్నించడం, ఎగుమతులను వివిధ రంగాలకు విస్తరింపజేయడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడం, విధానాలను సరళీకృతం చేయడం వంటి చర్యల ద్వారా 2024–25 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల మేరకు ఎగుమతుల లక్ష్య సాధనలో ముందడుగు వేయొచ్చని కమిటీ సూచించింది. వాణిజ్యం, పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహం శాఖకు రూ.9,238.51 కోట్లు కేటాయించాల్సి ఉండగా 2020–21 బడ్జెట్‌లో రూ 6,219.32 ట్లే కేటాయించడాన్ని కమిటీ ప్రస్తావించింది.